Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం..ద్రోహి అని పిలిచినా జనంతో జై కొట్టించుకున్న నాయకుడు
ABN , Publish Date - Nov 26 , 2024 | 02:27 PM
ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కుటుంబ పోషణ కోసం ఆటో రిక్షా, టెంపో డ్రైవర్‌గా పనిచేసిన షిండే.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో అగ్ర నేతగా ఉన్నారు. గత సీఎం ఉద్దవ్ ఠాక్రేకు చుక్కలు చూపించిన ఏక్‌నాథ్ షిండే గురించి పూర్తిగా ఈ కథనంలో తెలుసుకుందాం..
Eknath shinde: ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగుబాటు నేతగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పేరు. శివసేనలో అగ్ర నాయకుడైన షిండే 2022లో మహారాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పారు. గత సీఎం ఉద్దవ్ ఠాక్రేకు చుక్కలు చూపించారు. మహారాష్ట్ర శాసనసభకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా, మహా రాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, సీఎంగా వివిధ హోదాల్లో పని చేశారు.
జననం, విద్యాభాస్యం:
మరాఠా వర్గానికి చెందిన వ్యక్తి ఏక్‌నాథ్ షిండే. ఆయన స్వస్థలం సతారా.1964 ఫిబ్రవరి 9న జన్మించారు. యశ్వంతరావు చవాన్ ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండేకు లతా షిండేతో వివాహం జరిగింది. కుటుంబ పోషణ కోసం ఆటో రిక్షా నడిపేవారు. టెంపో డ్రైవర్‌గానూ పనిచేసిన షిండే.. ఇప్పుడు మహా రాష్ట్ర రాజకీయాల స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏక్ నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సర్జన్. అతను కళ్యాణ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
రాజకీయ జీవితం:
1980లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే స్ఫూర్తితో ఏక్‌నాథ్ షిండే రాజకీయాల్లో చేరారు. ఆ తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ కీలక నేతగా ఎదిగారు. 1997లో జరిగిన థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. థానే జిల్లాలో జరిగిన ప్రజా ఉద్యమాల్లోనూ ఎప్పుడు ముందుండేవారు. అలా శివసేన అధిష్ఠానం దృష్టిలో పడిన షిండే.. 2004లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కోప్రి - పచ్చపాఖాది నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిండే వెనక్కి తిరిగి చూసుకోలేదు.
వరుసగా నాలుగుసార్లు..
2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పని చేశారు. థానే ప్రాంతంలో ప్రముఖ నేతల్లో ఏక్‌నాథ్ షిండే ఒకరిగా నిలిచారు. ఆ ప్రాంతాల్లో శివసేనను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. పార్టీలోనూ, ప్రజల్లోనూ ఎంతో నమ్మకం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. 28 నవంబర్ 2019 నుండి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా-వికాస్- అఘాడి ఆధ్వర్యంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసి శివసేన పార్టీపై అసంతృప్తితో 35 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని షిండే పార్టీపై అసంతృప్తితో చెందినట్లు వార్తలు వినిపించాయి. పార్టీపై తిరుగుబాటు చేయడంతో 2022 జూన్ 21న శివసేన నుండి సస్పెండ్ అయ్యారు.
తిరుగుబాటు..
బాల్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడుగా, నమ్మకస్తుడుగా ఉన్న ఏక్‌నాథ్ షిండే.. తిరుగుబాటు బావుట ఎగురవేయడం వెనక అనేక కారణాలు వినిపించాయి. తనకు దక్కాల్సిన సీఎం పదవి మధ్యలో ఉద్ధవ్ ఠాక్రే రావడంతో చేజారిపోయిందని, హిందూత్వ పార్టీగా పేరుపొందిన శివసేన.. బాల్‌ఠాక్రే సిద్ధాంతాలను పక్కనపెట్టి కాంగ్రెస్ లాంటి పార్టీలతో జతగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, సీఎం కావాల్సిన తనకు మంత్రివర్గంలో కూడా తగినంత ప్రాధాన్యం దక్కలేదని ఇలా అనేక కారణాలతో ఆయన తీవ్ర అసంతప్తికి గురయ్యారని వార్తలు వినిపించాయి.
శివసేనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన షిండే.. తనకు సీఎం పదవి ముఖ్యం కాదని.. పదవుల కోసం తిరుగుబాటు చేయడం బాల్ ఠాక్రే తనకు నేర్పలేదనీ.. హిందుత్వం కోసమే తిరుగుబాటు చేశానని అన్నారు. శివసేన సిద్ధాంతాలను నమ్ముకున్న 35 మంది శాసనసభ్యులు తన వెంట ఉన్నారని తెలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో శివసేన పార్టీ పొత్తు తెంపుకొని.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్ప.. తాను తిరిగి శివసేనకు వచ్చేది లేదని ఖరాకండీగా చెప్పారు. అలా అప్పుడు షిండే.. మహావికాస్ అఘాడీ సర్కార్‌కు చెమటలు పట్టించి మహా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షిండే జూలై 30న మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Also Read: