Lok Sabha Elections: 'రామ్ నామ్ సత్య్ హై' ఖాయం.. నేరస్థులకు యోగి వార్నింగ్
ABN , Publish Date - Apr 06 , 2024 | 07:00 PM
సమాజానికి ముప్పు తెచ్చే నేరస్థులకు 'రామ్ నామ్ సత్య్ హై' (అంత్యక్రియలు) ఖాయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. మనిషి మృతదేహానని మోసేటప్పుడు వెంట వెళ్లేవారు 'రామ్ నామ్ సత్య్ హై' అంటూ నినదించడం అనేది హిందూ మత విశ్వాసాల్లో ఒకటిగా ఉంది.
లక్నో: సమాజానికి ముప్పు తెచ్చే నేరస్థులకు 'రామ్ నామ్ సత్య్ హై' (అంత్యక్రియలు) ఖాయమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) హెచ్చరించారు. మనిషి మృతదేహానని మోసేటప్పుడు వెంట వెళ్లేవారు 'రామ్ నామ్ సత్య్ హై' అంటూ నినదించడం అనేది హిందూ మత విశ్వాసాల్లో ఒకటిగా ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలీగఢ్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఆడకూతుళ్ల, వ్యాపారవేత్తలు ఎలాంటి ఆందోళనలు లేకుండా రాత్రిపూట బయటకు వెళ్లగలరని ఎవరూ ఊహించలేదని, అయితే అందుకు తాము భరోసా ఇస్తున్నామని అన్నారు. రాముడి నామం జపిస్తూ జీవితాలను గడుపుతున్నామని, రాముడు లేకుండా ఏదీ సాధ్యం కాదని చెప్పారు. కానీ, ఎవరైనా సరే సమాజ భద్రతకు ముప్పు కలిగిస్తే 'రామ్ నామ్ సత్య' కూడా ఖాయమని హెచ్చరించారు.
ఓటింగ్‌తోనే నిరంతర ప్రగతి, అభివృద్ధి సాధ్యం
ఓటింగ్ అనేది చాలా ముఖ్యమని, నిరంతర ప్రగతి, అభివృద్ధికి ఓటింగ్ ప్రాధాన్యతను అంతా గుర్తెరగాలని సీఎం సూచించారు. పదేళ్ల క్రితం కన్న కలలు ఈరోజు వాస్తవరూపం దాల్చాయని, ఇందుకు ప్రజలు ఓటింగ్ విలువ తెలుసుకోవడమే కారణమని అన్నారు. తప్పుడు ఓటు వల్ల దేశం అవినీతి ఊబిలోకి వెళ్లిపోతుందని అన్నారు. గతంలో అరాచకత్వం, కర్ఫ్యూలు, చట్టాలను పట్టించుకోకపోవడం ఉండేదని, మన ఆడకూతుళ్లు, యువకులకు ముప్పు పొంచి ఉండేదని అన్నారు.
Narendra Modi: 'ఫ్లాప్ చిత్రం' రిపీట్.. రాహుల్, అఖిలేష్ జోడీపై మోదీ వ్యంగ్యోక్తులు
మోదీపై ప్రశంసల జల్లు
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి క్రెడిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికే దక్కుతుందని యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ''మోదీ పేరుతో మోదీకి ఓటు వేస్తే, మీ భవిష్యత్తుకు గ్యారెంటీ. ప్రపంచ స్థాయి కట్టడాలు, హైవైలు, విమానాశ్రయాలు, డిఫెన్స్ కారిడార్లు, మెడికల్ కాలేజీ, యూనివర్శిటీలు ఏదైనా కావచ్చు, అవన్నీ నిర్మితమవుతాయి'' అని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల ఫలితాలపై తనకెంతో ధీమా ఉందని, ప్రజలు సైతం ఇప్పటికే మూడోసారి మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే మొదటి మూడేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకోవడం ఖాయమని అన్నారు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో లోక్‌శభ ఎన్నికలు మొత్తం 7 దశల్లోనూ జరుగనున్నాయి. ఏప్రిల్ 19తో మొదలై జూన్ 1తో పోలింగ్ ముగుస్తుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.