Share News

National : వికీలీక్స్‌ అసాంజేకు విముక్తి

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:03 AM

రహస్యాల వెల్లడి కేసులో అరెస్టయిన వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే (52)కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయనను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు ఒకటి ఆదేశించ

National : వికీలీక్స్‌ అసాంజేకు విముక్తి

విడుదల చేసిన అమెరికా కోర్టు

కాన్‌బెర్రా, జూన్‌ 26: రహస్యాల వెల్లడి కేసులో అరెస్టయిన వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే (52)కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయనను విడిచిపెట్టాలని అమెరికా కోర్టు ఒకటి ఆదేశించడంతో బుధవారం స్వదేశమైన ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. అమెరికా న్యాయశాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయన కేసు నుంచి బయటపడ్డారు. అమెరికా ప్రధాన భూభాగంలోని కోర్టుల్లో విచారణ జరిగేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో అమెరికా కామన్‌వెల్త్‌ ప్రాంతమైన నార్తరన్‌ మారియానా ద్వీపంలోని సైపాన్‌లో ఉన్న యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో విచారణ జరిగింది.

పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ఈ దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉండడం గమనార్హం. అమెరికా రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలు అసాంజేపై ఉన్నాయి. 2006లో స్థాపించిన వికీలీక్స్‌ సంస్థ ద్వారా వీటిని బహిర్గతం చేశారు. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ల్లో అమెరికా సైన్యం చేసిన అక్రమాలతోపాటు వివిధ అంశాలపై ఆయన దాదాపు కోటి పత్రాలను వెలుగులోకి తెచ్చారు. ఈ పత్రాల కారణంగానే అమెరికా మిలటరీ అకృత్యాలు ప్రపంచానికి తెలిశాయి. అసాంజే చర్యలను పత్రికా స్వేచ్ఛను ఆకాంక్షించే వారు స్వాగతించినా అమెరికా ప్రభుత్వం మాత్రం తీవ్రంగా పరిగణించింది.


దాంతో అమెరికా నుంచి లండన్‌కు పరారై అక్కడి ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. చివరకు అయిదేళ్ల పాటు లండన్‌ జైలులో శిక్షను అనుభవించారు. గత వారం రహస్య విచారణ జరిపిన అక్కడి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దాంతో సోమవారం ఆయన లండన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. లండన్‌ నుంచి వచ్చిన తరువాత అమెరికా కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశాన్ని పొందారు. అమెరికా న్యాయవిభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అసాంజే.. కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు.

గూఢచర్య చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, ప్రచురించడం వంటి నేరాలకు పాల్పడినట్టు ప్రకటించారు. సుమారు మూడు గంటల పాటు వాదనలు విన్న జడ్జి రమోనా వి మంగ్లోనా ఈ నేర అంగీకారాన్ని ఆమోదించారు. లండన్‌ జైలులో గడిపిన కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ ఆయనను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకా అదనపు శిక్ష అవసరం లేదని తెలిపారు. అనంతరం అసాంజే ప్రత్యేక విమానంలో అమెరికా, బ్రిటన్‌ల్లోని ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి కాన్‌బెర్రా చేరుకున్నారు.

Updated Date - Jun 27 , 2024 | 04:03 AM