Delhi: మతచిచ్చు రగల్చటం మీకు అలవాటుగా మారింది .. మోదీపై ఖర్గే నిప్పులు
ABN , Publish Date - Apr 26 , 2024 | 04:13 AM
మాటలను వక్రీకరించటం, ప్రజల మధ్య మతచిచ్చు రగల్చ టం మీకు అలవాటుగా మారింది. ఈ విధమైన మాటలతో మీరు ప్రధాని పదవికున్న ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు’ అంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.
ప్రధాని పదవికున్న ప్రతిష్ఠను మీరు దిగజారుస్తున్నారు
మోదీపై ఖర్గే నిప్పులు.. లేఖ రాసిన కాంగ్రెస్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ, ఏప్రిల్25 (ఆంధ్రజ్యోతి): ‘దేశంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, ధనికులు-పేదల మధ్య వ్యత్యాసాల గురించి తాము మాట్లాడుతుంటే.. ప్రజలను హిందువులు, ముస్లింలుగా ఎందుకు విడదీస్తున్నారని మోదీని ప్రశ్నించారు. ‘మా పార్టీ మేనిఫెస్టోలో చెప్పని వాటి గురించి మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
దేశ ప్రధాని హోదాలో మీరు అబద్ధాలు మాట్లాడకుండా.. మీ వద్దకు నేనే వచ్చి మా మేనిఫెస్టో గురించి స్వయంగా వివరిస్తా. నాకు సమయం ఇవ్వండి’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంచుతుందని, సంపదను, బంగారాన్ని, చివరికి మంగళసూత్రాలను కూడా లాక్కొని పునఃపంపిణీ చేస్తుందని మోదీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఖర్గే గురువారం లేఖ రాశారు. ఆ లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
మోదీ, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూసి తాము ఆశ్చర్యపోవటమో, దిగ్ర్భాంతికి గురికావటమే జరగలేదని, తొలిదశ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చూశాక వారిలా మాట్లాడుతారని ఊహించిందేనని ఖర్గే పేర్కొన్నారు. ‘మీరు పని చేసేదే కార్పొరేట్ కంపెనీల కోసం. వారికి లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇచ్చే మీరు పేదలు తినే ఆహారం, చివరికి ఉప్పు మీదా జీఎస్టీ వేస్తారు. పేదల సంక్షేమం, ఆర్థిక అంతరాల గురించి మేం మా మేనిఫెస్టోలో మాట్లాడుతుంటే మీరు హిందూ-ముస్లిం అని విబేధాలు సృష్టిస్తున్నారు’ అని ఖర్గే నిప్పులు చెరిగారు.
పేదలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు ను రుణాల రూపంలో ధనికులకు కట్టబెట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని, తర్వాత ఆ రుణాలనూ రద్దు చేశారన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 3లక్షల కోట్ల కార్పొరేట్ల రుణాలను రద్దుచేసి ఆ సంపదను పేదల నుంచి ధనికులకు మళ్లించారన్నారు. ఈ పదేళ్లలో ఒక్క రైతు రుణాన్ని మోదీ రద్దు చేయలేదన్నారు.
మణిపూర్‌లో మహిళలపై జరిగిన దారుణ అత్యాచారాలకు, రేపిస్టుల మెడ లో దండలు వేసి సత్కరించిన ఘటనలకు మోదీ ప్రభుత్వం బాధ్యత వహించదా?అని ప్రశ్నించారు. అటువంటి మీరు మహిళల మంగళసూత్రాల గురించి మాట్లాడటమేమిటని మోదీని నిలదీశారు.
మా పార్టీ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను ప్రస్తావనే లేదు: జైరాం రమేశ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వారసత్వ పన్నుపై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల పట్ల దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ జైరాంరమేశ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను ప్రస్తావనేలేదన్నారు. ఆ ఆంశం గురించి తామెప్పుడూ మాట్లాడలేదని, అది తమ ఎజెండాలోలేదని పేర్కొన్నారు. 1985లో ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీ వారసత్వ పన్నును రద్దు చేశారన్నారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో జైరాం మాట్లాడుతూ తమ పార్టీ మేనిఫెస్టోలో సంపద పునఃపంపిణీ గురించి లేదన్నారు.