Share News

Pawar Vs Amit shah: రాష్ట్ర బహిష్కరణకు గురైన వ్యక్తి ఇవాళ హోం మంత్రి.. పవార్ ఫైర్

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:11 PM

''అవినీతికి సూత్రధారి'' అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్‌ మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన గుజరాత్‌ నుంచి సుప్రీంకోర్టు ఆయనను దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు.

Pawar Vs Amit shah: రాష్ట్ర బహిష్కరణకు గురైన వ్యక్తి ఇవాళ హోం మంత్రి.. పవార్ ఫైర్

న్యూఢిల్లీ: ''అవినీతికి సూత్రధారి'' అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్‌ (Sharad Pawar) మండిపడ్డారు. సొంత రాష్ట్రమైన గుజరాత్‌ నుంచి సుప్రీంకోర్టు ఆయనను (Shah) దూరంగా ఉంచిన విషయాన్ని గుర్తుచేశారు.


''ఆయన (అమిత్‌షా) ఇటీవల నాపై మాటల దాడి చేశాడు. దేశంలోని అవినీతి పరులకు కమాండర్‌నంటూ నాపై వ్యాఖ్యలు చేశారు. వింతైన విషయం ఏమిటంటే.. గుజరాత్ చట్టాలని హోం మంత్రి ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు ఆయనను గుజరాత్ నుంచి బహిష్కరించింది'' అని పవార్ చెప్పారు. బహిష్కరణకు గురైన వ్యక్తి ఇవాళ దేశానికి హోం మంత్రిగా ఉన్నారు. మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించాలి. ఎవరి చేతుల్లో అయితే దేశం ఇవాళ ఉందో వారు వక్ర మార్గంలో దేశాన్ని నడుపుతున్నారు. నూటికి నూరుశాతం నేను ఆ మాటను కచ్చితంగా చెప్పగలను. మనం అప్రమత్తంగా ఉండాలి'' అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పవార్ అన్నారు.

NITI Aayog: నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాక్ అవుట్


సొహ్రాబుద్దీన్ షేఖ్ ఎన్‌కౌంటర్ కేసులో భారతీయ జనతా పార్టీ నేత అమిత్‌షా 2010లో రెండేళ్ల పాటు సొంత రాష్ట్రం నుంచి బహిష్కరణకు గురయ్యారు. 2014లో ఆయనను నిర్దోషిగా ప్రకటించారు


మహారాష్ట్రలోని పుణెలో ఈనెల 21న జరిగిన బీజేపీ కాంక్లేవ్‌లో హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ, అవినీతి గురించి విపక్షాలు మాట్లాడుతున్నాయని, భారత రాజకీయాల్లో అవినీతికి కింగ్‌పిన్ శరద్ పవార్ అని అన్నారు. అందులో తనకెలాంటి అయోమయం లేదన్నారు. మరాఠా రిజర్వేషన్లను తన రాజకీయ ప్రయోజనాలకు పవార్ వాడుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆయనకు మరాఠా రిజర్వేషన్ల అంశం గుర్తొస్తుందని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఊసే ఎత్తరని అమిత్‌షా తప్పుపట్టారు. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ అధికారంలో ఉంది. విపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఉన్నాయి.

Read more National News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 03:11 PM