Navya: మునగ రుచికరంగా!
ABN , Publish Date - Jun 22 , 2024 | 02:09 AM
ఎన్ని మాటలైనా చెప్పు.. మునక్కాయలతో చేసిన కూరలు మాత్రం మహా మెప్పు. భలే రుచి. మునక్కాడ మటన్, మునక్కాడ చికెన్ కర్రీ, మునక్కాడ ఉల్లిపాయకారం వంటలను ఈ వీకెండ్‌లో వండుకోండిలా..
వంటిల్లు
ఎన్ని మాటలైనా చెప్పు.. మునక్కాయలతో చేసిన కూరలు మాత్రం మహా మెప్పు. భలే రుచి. మునక్కాడ మటన్, మునక్కాడ చికెన్ కర్రీ, మునక్కాడ ఉల్లిపాయకారం వంటలను ఈ వీకెండ్‌లో వండుకోండిలా..
మునక్కాడ చికెన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు
లేత మునక్కాయలు- 3, చికెన్- అర కేజీ, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, టమోటాలు- 2 (ముక్కలుగా తరగాలి), ఉల్లిపాయలు- 2 (చిన్న ముక్కలుగా తరగాలి) పచ్చిమిర్చి- 4 (నిలువుగా కోయాలి), అల్లం,వెల్లుల్లి పేస్ట్- 2 టీ స్పూన్లు, చికెన్ మసాలా- 2 టీస్పూన్లు, కారంపొడి- 2 టీస్పూన్లు, పసుపు- కొద్దిగా, ఉప్పు- రుచికి సరిపడ, కొత్తిమీర- కొద్దిగా, యాలకులు- 2, బిర్యానీ ఆకు- 1
తయారీ విధానం
మూకుడులో నూనె వేయాలి. కాస్త వేడయ్యాక యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మూడు నిముషాల పాటు కలిపాక పసుపు, ఉప్పు వేసి కలపాలి. మూకుడుపై మూత ఉంచి రెండు నిముషాల తర్వాత గరిటెతో కదిపి.. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
రెండు నిముషాల పాటు గరిటెతో కలిపాక.. మునక్కాయలు, కారం పొడి వేసి కలపాలి. రెండు నిముషాలు ఆగాక చికెన్ వేసి బాగా కలపాలి. మూకుడుపై మూత ఉంచి.. మూడు నిముషాల పాటు కుక్ చేశాక టమోటా ముక్కలు వేసి కలిపిన తర్వాత చికెన్ మసాలా వేసి కలిపి మూత పెట్టాలి. పెద్దగ్లాసు నీళ్లు పోసి చికెన్ ముక్కలు ఉడికేంత వరకూ కనీసం పదిహేను నిముషాలు కుక్ చేయాలి. చికెన్ ఉడికిందో లేదో చూసుకుని కొత్తిమీర చల్లి దించేసుకోవటమే తరువాయి. మునక్కాడ చికెన్ కర్రీని చపాతీ, అన్నంతో తినాలి.
మునక్కాడ మటన్
కావల్సిన పదార్థాలు
లేత మునక్కాయలు- 2, మటన్ ముక్కలు- 1 కేజీ, నూనె- 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు-2 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 3 నిలువుగా సగానికి కట్ చేసుకోవాలి), కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్లు, జింజర్ గార్లిక్ పేస్ట్- 1 టేబుల్ స్పూన్, పసుపు- కొద్దిగా, కారం- 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడ, చిన్న టమోటాలు- 2
తయారీ విధానం
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. దీంతో పాటు మునక్కాయలను కడిగి.. వీటిని చిటికెన వేలంత పరిమాణంలో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో నూనె వేయాలి. కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత కొత్తిమీర వేసి రెండు నిముషాలు కలపాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారంపొడి, ఉప్పు వేసి మిశ్రమాన్ని గరిటెతో రెండు నిముషాల పాటు బాగా కలపాలి. ఇపుడు మటన్ వేసి కలపాలి. టమోటా ముక్కలు వేసి కలపాలి. ఐదు నిముషాల పాటు కుక్ చేయాలి.
ఐదు నిముషాల తర్వాత గ్రేవీకి సరిపడ అంటే కనీసం 300 మి.లీ. నీళ్లను పోయాలి. గరిటెతో కలిపిన తర్వాత కుక్కర్‌పై మూతను క్లోజ్ చేసి ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంటే.. మటన్ బాగా ఉడుకుతుంది.
ఆ తర్వాత మూత తీసి మునక్కాయ ముక్కలను వేయాలి. మంటను తగ్గించి.. ఐదు నిముషాల పాటు కుక్ చేయాలి. పులుసు కాస్త అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు వేసుకోవచ్చు. రెండు నిముషాల పాటు ఉడికించి చివరగా కొత్తిమీరను గార్నిష్‌గా చల్లుకోవాలి. ఈ మునక్కాడ మటన్‌ను భోజనంతో లేదా చపాతీతో తింటే రుచికరం.
మునక్కాడ ఉల్లిపాయకారం
కావల్సిన పదార్థాలు
లేత మునక్కాయలు- 2, నూనె- మూడు టేబుల్ స్పూన్లు, మెంతులు- అర టేబుల్ స్పూన్, ధనియాలు- టేబుల్ స్పూన్, జీలకర్ర- టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయలు- 10, ఆవాలు- కొద్దిగా, శగనపప్పు- టేబుల్ స్పూన్, మినప్పప్పు- టీస్పూన్, మీడియంసైజ్ ఉల్లిపాయలు-4 (సన్నగా తరగాలి), టమోటా ముక్కలు- కప్పు, వెల్లుల్లి రెబ్బలు-8, పసుసు- కొద్దిగా, చింతపండు రసం- టేబుల్ స్పూన్
తయారీ విధానం
ప్యాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేసి మెంతులు, ధనియాలు, ముప్పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి గరిటెతో కదుపుతూ వేయించాలి. ఈ మిశ్రమాన్ని జార్‌లో వేసి సగం ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి.. మరీ మెత్తగా కాకుండా.. మిక్సీ పట్టాలి. అదే ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మిగిలిన జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి గరిటెతో తిప్పుతూ లోఫ్లేమ్‌లో రెండు నిముషాల పాటు వేయించాలి. ఆ తర్వాత సగం ఉల్లిపాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. లోఫ్లేమ్‌లో రెండు నిముషాలు వేయించాలి. రుచికి సరిపడ ఉప్పు వేసి.. కొద్దిగా కరివేపాకు వేయాలి. ఈ మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి.
రెండు నిముషా తర్వాత టమోటా ముక్కలు వేసి కొద్దిసేపు కలిపాక ప్యాన్‌పై మూత ఉంచి కుక్ చేయాలి. ఐదు నిముషాల తర్వాత చూస్తే టమోటా, మునక్కాయ ముక్కలు బాగా ఉడుకుతాయి. గరిటెతో కదిపి పసుపు వేసి మరోసారి కలపాలి. మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ప్యాన్ మూత ఉంచి మూడు నిముషాల పాటు కుక్ చేయాలి. మునక్కాయ ముక్కలు ఉడికింది చెక్ చేసుకుని జార్‌లో పట్టిన ఉల్లిపాయ కారం వేసి కలపాలి. ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసిన తర్వాత చింతపండు రసం వేయాలి. మూడు నిముషాల పాటు గరిటెతో కదుపుతూ ఉండాలి. మునక్కాయ ఉల్లిపాయకారం రెడీ. రైస్‌తో తింటే భలే ఉంటుంది.