Navya : కూరగాయల్ని మిక్స్ చేసి వండితే..
ABN , Publish Date - Jul 13 , 2024 | 12:49 AM
కూరగాయల్లో పీచుపదార్థంతో పాటు విటమిన్లు, మినరల్స్, న్యూట్రిన్లు పుష్కలం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలురకాల కూరగాయలతో వండుకునే ఈ మిక్స్డ్ వెజిటెబుల్ ఫుడ్‌ను ఇంట్లోనే చేసుకోండిలా..
వంటిల్లు
మిక్స్ వెజిటెబుల్ సబ్జి
కూరగాయల్లో పీచుపదార్థంతో పాటు విటమిన్లు, మినరల్స్, న్యూట్రిన్లు పుష్కలం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పలురకాల కూరగాయలతో వండుకునే ఈ మిక్స్డ్ వెజిటెబుల్ ఫుడ్‌ను ఇంట్లోనే చేసుకోండిలా..
కావాల్సిన పదార్థాలు: నూనె- 4 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు-6, పచ్చి మిర్చి- 2, అల్లం ముక్కలు- 2 (చిన్నవి), ఎండుమిర్చి- 3, ఉల్లిపాయలు-2 (ముక్కలుగా తరగాలి), టమోటాలు-3 (ముక్కలుగా తరగాలి), జీడిపప్పులు- 10, పనీర్ క్యూబ్స్- 100 గ్రాములు, మీడియం సైజ్ బంగాళదుంప- 1 (ముక్కలుగా కట్ చేయాలి), క్యారెట్-1 (ముక్కలుగా తరగాలి), బీన్స్- 8 (ముక్కలుగా తరగాలి), కాలిఫ్లవర్ ముక్కలు- 10, క్యాప్సికం ముక్కలు- 6, నానబెట్టిన పచ్చి బఠాణీలు- టేబుల్ స్పూన్, జీలకర్ర- టీస్పూన్, పసుపు- కొద్దిగా, కసూరీ మేతీ- అర టీస్పూన్, కారం పొడి- అరటీస్పూన్, జీలకర్ర పొడి- అరటీస్పూన్, ధనియాల పొడి- అర టీస్పూన్, గరం మసాలా- అర టీస్పూన్, కొత్తిమీర- టీస్పూన్, పెరుగు- రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం: మూకుడులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. కాస్త వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసిన తర్వాత గరిటెతో కదపాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయల రంగు మారిన తర్వాత టమోటా ముక్కలు వేసి మూడు నిముషాల పాటు కలిపాక జీడిపప్పు వేయాలి. మూకుడుపై మూత ఉంచి ఆరు నిముషాల పాటు లోఫ్లేమ్‌లో కుక్ చేయాలి. మూకుడులోని కూరగాయలు మగ్గుతాయి.
గరిటెతో కదిపిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లబర్చిన తర్వాత రెండు స్పూన్ల నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. మెత్తటి పేస్ట్‌లా వస్తుంది. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకుని టేబుల్ స్పూన్ నూనె వేసి పనీర్ ముక్కలు వేయాలి. రెండు మూడు నిముషాల పాటు వీటిని వేయిస్తే రంగు మారుతుంది. దీన్ని ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్‌లో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కాలిఫ్లవర్ ముక్కలు వేసి మూడు నిముషాల పాటు కుక్ చేయాలి. క్యాప్సికం ముక్కలు, పచ్చి బఠాణీలు వేశాక తగినంత ఉప్పు వేసి కలపాలి.
మూడు నిముషాల పాటు కుక్ చేసిన తర్వాత ఈ కూరగాయముక్కల మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేసి జీలకర్ర, పసుపు, కారం, కసూరీ మేతీ వేసి లోఫ్లేమ్‌లో కలపాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో నాలుగు నిముషాల పాటు కదుపుతూ కుక్ చేయాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు పోయాలి.
వేయించుకున్న వెజిటేబుల్స్ ముక్కలు వేయాలి. జీలకర్ర పొడి వేసి కొద్దిగా అవసరం అనుకుంటే కారం, ఉప్పు సరి చూసుకుని తగినంత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత మూత ఉంచి నాలుగు నిముషాల పాటు కుక్ చేయాలి. చివరగా వేయించిన పనీర్ ముక్కలు వేసి రెండు నిముషాల పాటు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి కలిపిన తర్వాత పెరుగు వేసి నిముషం పాటు కలిపాక.. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కర్రీని చపాతీలోకి రుచిగా ఉంటుంది.