Navya Kitchen : ఖీమా..రుచిలో వారెవ్వా!
ABN , Publish Date - Aug 03 , 2024 | 05:45 AM
నాన్‌వెజ్‌తో చేసే వంటకాలకు చాలా సమయమే పడుతుంది. ముఖ్యంగా మటన్ అయితే మరికాస్త సమయం తీసుకుంటుంది. మటన్‌తోనే సులువుగా, వేగంగా వండుకోవచ్చు. ఆ వంటలే మటన్ ఖీమా కర్రీ, మటన్ ఖీమా ఉండలు.
వంటిల్లు
నాన్‌వెజ్‌తో చేసే వంటకాలకు చాలా సమయమే పడుతుంది. ముఖ్యంగా మటన్ అయితే మరికాస్త సమయం తీసుకుంటుంది. అయితే ఈ మటన్‌తోనే సులువుగా, వేగంగా వండుకోవచ్చు. ఆ వంటలే మటన్ ఖీమా కర్రీ, మటన్ ఖీమా ఉండలు. వీటిని వండుకోండిలా..
మటన్ ఖీమా కర్రీ
కావల్సిన పదార్థాలు
మటన్ ఖీమా- 500 గ్రాములు, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, నల్లయాలక- 1, పెద్ద ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, పచ్చిమిర్చి- 4, అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్, కారం పొడి- ఒకటిన్నర టేబుల్ స్పూన్, టమోటాలు-2 (సన్నగా తరగాలి), ధనియాల పొడి- టీస్పూన్, కొత్తిమీర- టేబుల్ స్పూన్
తయారీ విధానం
కుక్కర్‌లో నూనె వేసి.. కాస్త వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారేంత వరకూ కదుపుతూ వేయించాలి. నిలువుగా చీరి పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక మూడు నిముషాల పాటు కలపాలి.
కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోతుంది. తర్వాత మటన్ ఖీమా వేసి కలపాలి. నాలుగు నిముషాల పాటు కుక్ చేయాలి. ఆ తర్వాత కారంపొడి, ఉప్పుతో పాటు ధనియాల పొడి వేసి కలపాలి.
వెంటనే సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేయాలి. మూడు నిముషాలు గరిటెతో కలిపాక.. ఒక కప్పు నీళ్లు పోయాలి. కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చేంత వరకూ కుక్ చేయాలి. మటన్ ఖీమాను గరిటెతో కలిపి రెండు నిముషాల పాటు ఉడికించి.. ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ మటన్ ఖీమా కర్రీ చపాతీ లేదా అన్నంలోకి రుచికరంగా ఉంటుంది.
మటన్ ఖీమా ఉండలు
కావాల్సిన పదార్థాలు
లేత మటన్ ఖీమా- 300 గ్రాములు, చిన్న ఉల్లిపాయలు-2 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 4, వెల్లుల్లి- 7, అల్లం ముక్క- 1 (సన్నగా తరగాలి), కారం పొడి- ఒకటిన్నర టీస్పూన్, ధనియాల పొడి- ఒకటిన్నర టీస్పూన్, పసుపు- కొద్దిగా, ఉప్పు- తగినంత, గరం మసాలా- ముప్పావు టీస్పూన్, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం
జార్‌లో మటన్ ఖీమా, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, తరిగిన అల్లం ముక్కల మిశ్రమం, కారం పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. గరుకుగా మిక్సీ పట్టాలి. వీటిని చిన్న బాల్స్‌లో ఒత్తుకోవాలి. చివరగా గుంత ప్యాన్‌లో నూనె వేసి వేడయ్యాక.. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఈ బాల్స్‌ను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ ఖీమా ఉండలు స్నాక్స్‌లా తినొచ్చు. రుచిగా ఉంటాయివి.