Share News

Reduce the pain : వేడి వర్సెస్‌ చల్లదనం

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:34 AM

నొప్పులను తగ్గించుకోవడం కోసం కొందరు వేడి కాపడం సూచిస్తారు, ఇంకొందరు ఐస్‌ ప్యాక్‌ సూచిస్తారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఫలితాన్నిస్తుంది. తెలుసుకుందాం!

Reduce the pain : వేడి వర్సెస్‌ చల్లదనం

పెయిన్‌ రిలీఫ్‌

నొప్పులను తగ్గించుకోవడం కోసం కొందరు వేడి కాపడం సూచిస్తారు, ఇంకొందరు ఐస్‌ ప్యాక్‌ సూచిస్తారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఫలితాన్నిస్తుంది. తెలుసుకుందాం!

వేడి, చల్లదనం... ఈ రెండూ సహజసిద్ధ నొప్పినివారిణి చిట్కాలు. అయితే వేడి కాపడం ఎటువంటి నొప్పులను తగ్గిస్తుందో, చల్లని పట్టు ఏ బాధను దూరం చేస్తుందో తెలుసుకోవడం అవసరం. కొన్ని నొప్పులు చల్లదనంతో తగ్గితే, మరికొన్ని వేడితో ఉపశమనాన్ని అందిస్తాయి. సమస్య ఆధారంగా పరిష్కారాన్ని ఎంచుకోవాలి.

ఆర్థ్రయిటిస్‌: మోకాళ్లు, భుజాలు, మేచేతులు, వేళ్ల కీళ్లలో మృదులాస్థి అరిగిపోవడం మూలంగా తలెత్తే నొప్పులు వేడి కాపడంతో తగ్గుముఖం పడతాయి. బిగుసుకుపోయిన కీళ్లు, కండరాలు వేడి కాపడంతో వదులై, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

గౌట్‌: కాలి బొటనవేలు, చీలమండలం, మడమ, మోకాలు, మణికట్టు, వేళ్లు, మోచేతుల్లోని తీవ్రవైన ఇన్‌ఫ్లమేటరీ ఆర్థ్రయిటి్‌సకు కోల్డ్‌ కంప్రెషన్‌ చక్కని పరిష్కారం.

తలనొప్పి: తలలోని నాడులు, రక్తనాళాల వల్ల తలెత్తే తలనొప్పులు లేదంటే మెడలోని కండరాల నొప్పులకు రెండు రకాల కాపడాలు అవసరమవుతాయి. కత్తితో పొడుతున్నట్టు బాధించే పోటులను ఐస్‌తో, మెడ నొప్పులను వేడి కాపడంతో తగ్గించుకోవచ్చు.


బెణుకులు: తొడ, వెన్ను, పిక్కల్లోని కండరాలు పట్టేసినా, టెండాన్లు గాయపడినా, లక్షణాల ఆధారంగా వేడి, చల్లదనాల పట్టులను ఎంచుకోవాలి. వాచి, నొప్పితో బాధించే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించుకోవడం కోసం ఐస్‌ను ఉపయోగించాలి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిన తర్వాత బిగుతును సడలించడం కోసం వేడి కాపడం ఉపయోగపడుతుంది.

గాయాలు: మోకాలు, మోచేతులు, యాంకిల్‌, పాదాల్లో లిగమెంట్లు దెబ్బతిన్నప్పుడు ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, నొప్పి అదుపులోకి రావడం కోసం ఐస్‌తో పట్టు వేయాలి. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గిన తర్వాత బిగుతును సడలించడం కోసం వేడి కాపడం పెట్టుకోవాలి.

టెండనైటిస్‌: భుజాలు, మోచేతులు, మోకాళ్లు, మణికట్టు మడమల్లోని కీళ్లతో అనుసంధానమై ఉండే టెండాన్లు ఎక్కువగా శ్రమకు గురవడం వల్ల తలెత్తే నొప్పులకు ఐస్‌తో పట్టు వేయాలి.

టెండినోసిస్‌: కీళ్లతో అనుసంధానమై ఉండే టెండాన్లు ఇరిటేట్‌ అయి, బిగుసుకుపోయినప్పుడు కలిగే అసౌకర్యాన్ని తొలగించుకోవడం కోసం, వేడి కాపడం పెట్టుకోవాలి.

ఏం జరుగుతుంది?

మంచుతో రక్తనాళాలు కుంచించుకుపోయి గాయాలు, దెబ్బల నొప్పి తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ అదుపులోకొచ్చి గాయం తీవ్రత తగ్గుతుంది. ఆర్థ్రయిటి్‌సకూ వేడికాపడం పెట్టడానికి కారణం వేడితో రక్తప్రవాహం పెరిగి, బిగుసుకున్న కండరాలు, కీళ్లు వదులవుతాయి. దాంతో ఉపశమనం దక్కుతుంది. తీవ్రమైన గాయాలు, ఎముకలు చిట్లిన, విరిగిన సందర్భాల్లో నొప్పిని తగ్గించుకోవడం కోసం ఎలాంటి కాపడాలు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగి, గాయం తగ్గే వేగం నెమ్మదిస్తుంది.

Updated Date - Jul 30 , 2024 | 12:53 AM