Kushboo Kumari : ‘మంచి-చెడు’ పాఠంగా...
ABN , Publish Date - Oct 07 , 2024 | 05:40 AM
అన్నెంపున్నెం ఎరుగని వయసులో అత్యాచారాల బారిన పడుతున్న పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి... ఇదీ బిహార్ ప్రభుత్వ టీచర్ కుష్బూ కుమారి తపన. ‘మంచి స్పర్శ-చెడు స్పర్శ’ గురించి ఆమె రూపొందించిన పాఠం... వేరే రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకమయింది.
అన్నెంపున్నెం ఎరుగని వయసులో అత్యాచారాల బారిన పడుతున్న పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి... ఇదీ బిహార్ ప్రభుత్వ టీచర్ కుష్బూ కుమారి తపన. ‘మంచి స్పర్శ-చెడు స్పర్శ’ గురించి ఆమె రూపొందించిన పాఠం... వేరే రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకమయింది. సృజనాత్మక పద్ధతుల్లో బోధన కోసం సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగిస్తూ, వేలాది పిల్లలకు ఆమె చేరువయ్యారు.
‘‘పసి పిల్లల మీద అత్యాచార వార్తలు చూస్తే నా మనసు కల్లోలమైపోతుంది. మనది నాగరికమైన సమాజమని చెబుతాం. కానీ ఇలాంటి సంఘటనల గురించి ఎవరూ మాట్లాడరు. ఇది ఏదో ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారమని అనుకుంటారు. ‘మనవరకూ వస్తే...’ అని ఆలోచించరు. దీనికి పరిష్కారంగా... ‘నావంతుగా ఏదైనా చెయ్యగలనా?’ అని ఎంతో మధనపడేదాన్ని. నేను పుట్టింది, పెరిగింది బిహార్‌లోని కటోరియా పట్టణంలో. స్కూల్లో చదువుతున్నప్పుడు... ‘‘పెద్దయ్యాక మీరు ఏమవ్వాలనుకుంటున్నారు?’’ అని మా టీచర్ అందరినీ అడిగారు. ‘‘నేను టీచర్ అవుతా’’ అని చెప్పాను. ఎదుగుతున్నకొద్దీ సమాజంలో టీచర్ పాత్ర ఎంత ముఖ్యమైనదో, ఎంత పవిత్రమైనదో నాకు అర్థమయింది.
పిల్లలతో గడపడం అంటే నాకున్న ఇష్టం కూడా టీచర్ కావడానికి దోహదం చేసింది. హిందీలో ఆనర్స్ డిగ్రీ చేశాను, టీచర్ ట్రైనింగ్ తరువాత... ‘ఖతౌన్ మిడిల్ స్కూల్’లో ఉద్యోగంలో చేరాను. ఒకసారి మా ప్రాంతంలో ఒక బాలిక మీద జరిగిన అత్యాచారం సంచలనం సృష్టించింది. నిజానికి ఇలాంటి సంఘటనల గురించి తరచూ వింటూనే ఉంటాం. పిల్లలమీద అత్యాచారాలకు పాల్పడే వాళ్ళలో బంధువులు, కుటుంబ సన్నిహితులు, పరిచయస్తులే ఎక్కువ. ఈ సంగతి బయటపడితే... తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో చాలామంది తల్లితండ్రులు ఈ అకృత్యాలను దాచిపెడతారు.
కానీ ఆ పసి మనసుకు తగిలిన గాయం ఎన్నటికీ మానదు. దురుద్దేశాలతో ఉన్న వ్యక్తులెవరో గుర్తించి, వారికి దూరంగా ఉండాలంటే... ‘మంచి స్పర్శ- చెడు స్పర్శ’ మధ్య వ్యత్యాసం గురించి పిల్లలకు అవగాహన కల్పించడం ముఖ్యమని భావించాను. పిల్లలను భయానికి, ఆందోళనగు గురి చెయ్యకుండా... సున్నితమైన విషయాలను వివరించడం కోసం ఒక చిన్న నాటకం తయారు చేశాను. దానిలో పాత్రధారులందరూ పిల్లలే. దాన్ని మా క్లాస్ రూమ్‌లో ప్రదర్శించినప్పుడు... పిల్లల నుంచి మంచి స్పందన వచ్చింది.
నేను చెప్పాలనుకున్నది వాళ్ళు చాలా త్వరగా గ్రహించారు. స్కూల్ యాజమాన్యం ప్రోత్సాహంతో... మిగిలిన తరగతుల్లో కూడా దాన్ని ప్రదర్శించాం. ఆ సమయంలోనే దాన్ని ఎవరో వీడియో తీసి... ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అది వైరల్ అయింది. కొన్ని నెలల్లోనే 15 లక్షల మంది దాన్ని చూశారు. అప్పుడే నేను ఎన్నడూ కోరుకోని గుర్తింపు ఊహించని రూపంలో వచ్చింది.
అప్పుడు నోట మాట రాలేదు...
ఒక రోజు మా స్కూల్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాజస్థాన్ రాష్ట్ర విద్యా శాఖ నుంచి ఒక అధికారి మాట్లాడారు. నా వీడియో బాగుందని ప్రశంసిస్తూ... దానిలో ఉన్న అంశాలను ప్రతి శనివారం పిల్లలకు బోధించడం కోసం 1,200 మంది శిక్షకుల్ని నియమిస్తున్నామని చెప్పారు. నా నోట మాట రాలేదు. నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం ఈ స్థాయిలో వైరల్ కావడం ఎంతో సంతోషం కలిగించింది. ఆ తరువాత కొన్నాళ్ళకు కొవిడ్ కారణంగా బడులు మూతపడ్డాయి. అప్పుడు.... సోషల్ మీడియాలో పాఠాలు బోధించాలని మా హెడ్‌మాస్టర్ సూచించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి నాకు తెలుసు కాబట్టి ఎంతో సంకోచించాను.
మా హెచ్‌ఎం బలవంతపెట్టడంతో... ఒక పాఠాన్ని సోషల్ మీడియాలో పెట్టాను. దానికి తల్లితండ్రుల నుంచి, పిల్లల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఆ ఉత్సాహంతో వీడియో పాఠాలు చాలా చేశాను. కానీ నేను అనుకున్నట్టే... ట్రోల్స్ ఎదుర్కొన్నాను. కానీ ఆలోచిస్తే అనిపించింది... సృజనాత్మకమైన పద్ధతుల్లో, యాక్టివిటీ బేస్డ్‌గా పాఠాలు నేర్పించడం చాలామందికి నచ్చదు. ఎంతోమంది తల్లితండ్రులే కాదు, కొందరు టీచర్లకు కూడా బట్టీ పద్ధతే మంచిదనుకుంటారు. కానీ అది నిజం కాదని నాకు తెలుసు. అక్షరాలను, అంకెలను ఆట పాటల రూపంలో, చిన్న యాక్టివిటీస్ ద్వారా నేర్పిస్తే... పిల్లలు వాటిని త్వరగా గ్రహించడం మాత్రమే కాదు, అవి వారికి ఎక్కువకాలం గుర్తుంటాయి. మరో సంగతేంటంటే... విద్యార్థులకు ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది పీరియడ్స్ ఉంటాయి. కానీ నైతిక విద్యను బోధించడానికి, వారిలో ప్రేరణ కలిగించి, చదువు మీద భయం పోగొట్టడానికి, ఒత్తిడి తగ్గించడానికి, జీవన నైపుణ్యాలు నేర్పించడానికి పాఠశాలల్లో ఒక్క గంట కూడా మనం కేటాయించడం లేదు. నా వీడియోల్లో ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాను.
నితీశ్, గుల్జార్ మెచ్చుకున్నారు...
టీచర్‌గా, గృహిణిగా... ఉదయం నుంచి రాత్రి వరకూ బిజీగా ఉంటాను. రోజుకు ఆరు గంటల సేపు పాఠాలు చెబుతాను. ఇంటికి వచ్చాక... పనులు పూర్తి చేసుకొని, మర్నాడు పాఠాలకు ప్లానింగ్ చేసుకుంటాను. నా భర్త మనీష్ కుమార్ ఆనంద్ టీచర్. నా వీడియో కంటెంట్ తయారీలో, పోస్టింగ్‌లో ఆయన, మా అమ్మాయి సాయం చేస్తారు. ఇప్పుడు ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో నా వీడియోల ద్వారా నేను పరిచయమే. ఎంతోమంది నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి పలకరిస్తారు, అంతేకాదు... నా వీడియోల గురించి తెలిసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక కార్యక్రమానికి ఆహ్వానించి, సత్కరించారు.
మరోసారి మా పాఠశాలకు వచ్చారు. మా పిల్లలతో మాట్లాడి, నా ప్రయత్నాన్ని అభినందించారు. అలాగే ప్రముఖ కవి గుల్జార్ కూడా నా వీడియోలు చూసి... ఫోన్‌లో మాట్లాడి మెచ్చుకున్నారు. ఇక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. కానీ కొన్ని వేల మంది పిల్లలకు నా వీడియోల ద్వారా చేరువ కావడం కన్నా సంతృప్తికి మించినది మరేదీ లేదు. వారికోసం సోషల్ మీడియాలో పాఠాలు చెబుతూనే ఉంటాను.’’