విజయవంతంగా ‘‘నెలనెలా తెలుగు వెన్నెల’’ సాహిత్య కార్యక్రమం
ABN , Publish Date - Jan 10 , 2024 | 05:27 PM
త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ‘‘నెలనెలా తెలుగు వెన్నెల’’ 178వ సాహిత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
హైదరాబాద్: త్యాగరాయ గానసభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ‘‘నెలనెలా తెలుగు వెన్నెల’’ 178వ సాహిత్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, వంగూరి ఫౌండేషన్ ఇండియా మేనేజింగ్ ట్రస్టీ, డా. వంశీ రామరాజు మాట్లాడుతూ వంగూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్నీ నిర్వహించినట్లు చెప్పారు. 178వ కార్యక్రమంగా సింగపూర్ నుంచి తొలి రచయిత్రిగా పేరుపొందిన రాధిక మంగిపూడి రచించిన 5 పుస్తకాలపై ప్రత్యేక సమీక్షా ప్రసంగాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రఖ్యాత రచయితలు. రచయిత్రులు.. విశిష్ట అతిథులుగా విచ్చేసి సమీక్షలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సభకు ప్రముఖ సాహితీవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, పద్మశ్రీ డా. కొలకలూరి ఇనాక్ ముఖ్య అతిథిగా విచ్చేసి రాధిక రచనలను అభినందించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్ ఆచార్య టి. గౌరీశంకర్ "భారతీయ తత్త్వ శతకం" అనే పద్య శతకం, ప్రముఖ సినీకవి డా వడ్డేపల్లి కృష్ణ - 'నవ కవితా కదంబం' అనే కవితా సంపుటి, హాస్యబ్రహ్మ డా. శంకర నారాయణ - 'అలా సింగపురంలో' అనే కధా సంపుటి, ప్రముఖ రచయిత్రి డా. తిరునగిరి దేవకీదేవి - 'మరో మాయాబజార్' కథా సంపుటి, ప్రముఖ రచయిత్రి డా. కేతవరపు రాజ్యశ్రీ అనే 'భావతరంగాలు' కవితా సంపుటిపై అద్భుతమైన సమీక్షలు అందించి రాధికను ఆశీర్వదించారు.
రాధిక మాట్లాడుతూ తన రచనా వ్యాసంగాన్ని ఆది నుంచి ప్రోత్సాహిస్తూ ప్రచురించడమే కాకుండా వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తన రచనలను ఎంపిక చేయడం, ఆచార్య ఇనాక్ వంటి పెద్దలు, ప్రముఖ రచయితలు సాహితీ వేత్తలు తనకు ఆశీస్సులు అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. వ్యవస్థాపకులు, డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజుకు రాధిక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, వివిధ దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరై అభినందనలు తెలియజేశారు. అలాగే ఈ సభకు వంగూరి ఫౌండేషన్ భారతదేశ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా బాధ్యతలు వహించగా.. మునమర్తి కృష్ణవేణి సభా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని ట్రైనెట్ లైవ్, త్యాగరాయ గానసభ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.