NRI News: ఛార్లెట్‌లో ఘనంగా ఎమ్మెల్యే సురేష్ అభినందన సభ
ABN , Publish Date - Aug 15 , 2024 | 09:21 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నారై సురేష్ కాకర్ల అభినందన సభను ఛార్లెట్‌లో ఆగస్టు 13వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఛార్లెట్‌లోని ఎన్నారై టీడీపీ అభిమానులు, బిజెపి అభిమానులు, జనసేన అభిమానులతో పాటూ తానా నాయకులు, ఇతర ప్రముఖులు ఈ అభినందన సభకు తరలివచ్చారు..
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నారై సురేష్ కాకర్ల అభినందన సభను ఛార్లెట్‌లో ఆగస్టు 13వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఛార్లెట్‌లోని ఎన్నారై టీడీపీ అభిమానులు, బిజెపి అభిమానులు, జనసేన అభిమానులతో పాటూ తానా నాయకులు, ఇతర ప్రముఖులు ఈ అభినందన సభకు తరలివచ్చారు. వర్కింగ్‌డే అయినప్పటికీ దాదాపు 300 మంది రావడం, చాలామంది కుటుంబంతో కలిసి రావడం నిర్వాహకులను సంతోషపరిచింది.
ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత సురేష్ కాకర్ల ఇక్కడికి తొలిసారి వచ్చిన సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సత్కారాన్ని మిత్రులు, ఎన్నారై టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సురేష్ కాకర్ల అందరివాడని, సామాన్యవ్యక్తిగా ఉంటూ తన గుణంతో, సేవతో నేడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని కొనియాడారు. తానా టీమ్ స్క్వేర్ చైర్మన్‌గా ఉన్నప్పడూ ఎంతోమందికి సహాయాన్ని అందించారని, అలాగే స్నేహితులకు అవసరమైన సమయంలో ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండేవాడని గుర్తు చేశారు. అలాగే ఉదయగిరిలో ఆయన కాకర్ల ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సహాయాన్ని చేస్తున్నారని, ఇప్పుడూ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అందరితోనూ చనువుగానే ఉంటూ వారికి అవసరమైన సేవలను అందిస్తున్నారన్నాని కొనియాడారు. ఆయన సేవ, అందరితో కలిసిపోయే గుణమే ఆయనకు విజయాన్ని అందించిందని చెప్పారు.
సురేష్ కాకర్ల మాట్లాడుతూ తన గెలుపు కోసం ఎంతోమంది ఎన్నారైలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయాన్ని అందించడంతో పాటూ విజయం కోసం కృషి చేశారన్నారు. ఆత్మీయ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు, సన్నిహితులకు ఎన్నారై టీటీపీ నాయకులు, జనసేన, బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతమన్నారు. భౌగోళిక విస్తీర్ణంలో పెద్ద నియోజకవర్గమని, అలాగే సమస్యలు కూడా పెద్దగానే ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతంలో సాగు, త్రాగునీరు కొరత ఉందన్నారు. అలాగే 50 వేల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు.
ఎన్నారైలు వాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని సమస్యలను నేరుగా చూసి సహాయం చేయవచ్చని సురేష్ సూచించారు. అలాగే ఎన్నారైలు ఉదయగిరి ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు అనువుగా ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు కూడా అధికంగా ఉన్నాయని, వెనుకబడిన ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్నారైలు ఉదయగిరి నియోజకవర్గాన్ని సందర్శించి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమాన్ని నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ళ, బాలాజి తాతినేని, సురేష్ జాగర్లమూడి, సతీష్ నాగభైరవ, ఛార్లెట్ ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన తరుపున నగేష్, వీర తోట, కృష్ణ, ఎన్నారై జనసేన కార్యవర్గ సభ్యులు, బీజేపీ నుంచి సుభాష్, పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.