Share News

NRI News: ఎడారిలో 700 కిలో మీటర్లు ప్రయాణించి.. ఒంటెల కాపరిని రక్షించిన ‘‘సాటా’’

ABN , Publish Date - Oct 02 , 2024 | 09:17 PM

కువైత్‌లోని ఓ అరబ్బు యాజమాని ఇంట్లో టీ చేసే ఉద్యోమంటూ తీసుకెళ్లి.. సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా మార్చిన నిర్మల్ జిల్లా ముథోలు మండలానికి చెందిన నాందేవ్ రాథోడ్ అనే గిరిజనుడిని ఎట్టకేలకు ఇద్దరు ప్రవాసీ వాలంటీర్లు రక్షించారు.

NRI News: ఎడారిలో 700 కిలో మీటర్లు ప్రయాణించి.. ఒంటెల కాపరిని రక్షించిన ‘‘సాటా’’

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లోని ఓ అరబ్బు యాజమాని ఇంట్లో టీ చేసే ఉద్యోమంటూ తీసుకెళ్లి.. సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా మార్చిన నిర్మల్ జిల్లా ముథోలు మండలానికి చెందిన నాందేవ్ రాథోడ్ అనే గిరిజనుడిని ఎట్టకేలకు ఇద్దరు ప్రవాసీ వాలంటీర్లు రక్షించారు. 700 కిలోమీటర్ల దూరంలోని ఎడారిలోకి వెళ్లి, అతన్ని తీసుకొచ్చి సురక్షితంగా మంగళవారం స్వదేశానికి పంపించారు.


తీవ్ర ఎండలో ఒంటెల మధ్య ఎడారిలో పని చేస్తున్న నాందేవ్.. ఇసుక ఎడారిలో తాను ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అయింది. ఈ వీడియోపై తెలుగు ప్రవాసీ సంఘం సాటా ప్రధాన కార్యదర్శి ముజ్జమ్మీల్ శేఖ్, సామాజిక కార్యకర్త సిద్దీఖ్ తువూరు స్పందించారు. 700 కిలోమీటర్ల ప్రయాణించి, సౌదీ ప్రభుత్వ అధికారుల (Saudi government officials) సహాయంతో నాందేవ్‌ను సురక్షితంగా రియాధ్‌కు తీసుకొచ్చారు. కేసు విచారణ పూర్తయి ఇమ్మిగ్రేషన్ లాంఛనాలు పూర్తయ్యే వరకూ ఒంటెల కాపరికి సాటా కో ఫౌండర్ చెట్లూరి రంజీత్ ఆశ్రయమిచ్చారు.


నాందేవ్‌కు విమాన టిక్కెట్ సమకూర్చి ఇవ్వడంతో పాటూ విమానశ్రాయం వరకు వచ్చి అతడికి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ప్రతి ఒక్క తెలుగు ప్రవాసీ చేయూత వల్లే తాము ఇలాంటి సహాయక చర్యలు చేయగలుగుతున్నామని సాటా సభ్యులు పెర్కొన్నారు. తమకు సహాకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం రాత్రి రియాధ్ నుండి బయలుదేరిన నాందేవ్.. మంగళవారం స్వదేశానికి చేరుకున్నాడు. ఈ కేసులో అంతకు ముందు, పీసీసీ ఎన్నారై కన్వీనర్ మంద భీంరెడ్డి, తెలంగాణ ఖాదీ బోర్డు చెర్మెన్ ఈరవత్రి అనిల్ కుమార్ కూడా స్పందించి భారతీయ ఎంబసీ దృష్టికి తీసుకెళ్ళారు. ఎడారిలో పని కష్టమైనా ఒంటె పిల్లలతో తనకు ఆవుదూడల తరహా అనుబంధం ఏర్పడిందని కూడ నాందేవ్ వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 02 , 2024 | 09:17 PM