NRI: ‘‘ఒంటెలు వద్దని వచ్చా .. బర్రెలు ఇవ్వండి’’
ABN , Publish Date - Oct 05 , 2024 | 05:58 PM
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రప్రథమంగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన ఒక బాధితున్ని ముఖ్యమంత్రి కలుసుకున్నారు. సౌదీ అరేబియా కువైత్ దేశాల సరిహద్దు ఎడారుల్లో ఒంటెల కాపరిగా పని చేస్తూ, నరకయాతన అనుభవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో..
రేవంత్ రెడ్డికి సౌదీ నుండి వచ్చిన కాపరి విన్నపం
రాష్ట్ర చరిత్రలో మోదటిసారిగా గల్ఫ్ బాధితుడితో ముఖ్యమంత్రి భేటి
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రప్రథమంగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన ఒక బాధితున్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలుసుకున్నారు. సౌదీ అరేబియా కువైత్ దేశాల సరిహద్దు ఎడారుల్లో ఒంటెల కాపరిగా పని చేస్తూ, నరకయాతన అనుభవించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో స్వదేశానికి తిరిగొచ్చిన నిర్మల్ జిల్లా ముథోలు మండలానికి చెందిన నాందేవ్ రాథోడ్ అనే ప్రవాసీ.. తన కుటుంబ సమేతంగా శనివారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాందేవ్ మాట్లాడుతూ.. తనను క్షేమంగా స్వదేశానికి రప్పించిన ముఖ్యమంత్రితో పాటూ తనకు సహకరించిన సౌదీలోని భారతీయ ఎంబసీ, తెలుగు ప్రవాసీ సంఘం సాటాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లిన తాను ఆర్థికంగా చితికిపోయానని, ఒంటెల కాపరిగా పని చేసిన తాను ఇప్పుడు మాతృభూమిలో బర్రెలను పెంచుకుంటానని చెప్పాడు. నాలుగు బర్రెలను కోనుగోలు చేయడానికి రూ.2లక్షలను స్వయం ఉపాధి కింద తనకు రుణ సహాయం అందించాలని ముఖ్యమంత్రిని వేడుకున్నాడు.
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రప్రథమంగా కష్టాల కడలి నుంచి మాతృభూమికు తిరిగి వెళ్ళిన ఒక ప్రవాసీని ముఖ్యమంత్రి కలుసుకుని, విచారించడం పట్ల సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ సంఘం సాటా హర్షం వ్యక్తం చేసింది. 700 కిలో మీటర్ల దూరం నుండి నాందేవ్‌ను తీసుకోరావడంతో పాటూ ఆయనకు రియాధ్‌లో ఆశ్రయం ఇచ్చి హైద్రాబాద్ వరకు వెళ్లడానికి అవసరమైన టిక్కెట్‌ను రియాధ్‌లోని తెలుగు ప్రవాసీయులు సమకూర్చినందుకు.. సాటా ప్రతినిధులు సాటా సభ్యలు ముజ్జమ్మీల్ శేఖ్, రంజీత్ చెట్లూరి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయంలో అన్ని విధాలుగా సహకరించిన సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువూరు మరియు భారతీయ ఎంబసీలకు కూడ సాటా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, పీసీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు మంద భీం రెడ్డి, ప్రవాసీ సంఘం ప్రతినిధులు నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పిరికిపండ్ల, చెన్నమనేని శ్రీనివాస రావు తదితురులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.