NRI news: 2025 తానా మహాసభలు.. డిట్రాయిట్లోనే..
ABN , Publish Date - Aug 27 , 2024 | 04:48 PM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో 2025లో నిర్వహించనున్న 24వ మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నగరాన్ని ఎంపిక చేశారు. అలాగే ఈ మహాసభలకు కో-ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్ చాపలమడుగు, చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ళను నియమించినట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో 2025లో నిర్వహించనున్న 24వ మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నగరాన్ని ఎంపిక చేశారు. అలాగే ఈ మహాసభలకు కో-ఆర్డినేటర్‌గా ఉదయ్ కుమార్ చాపలమడుగు, చైర్మన్ గా గంగాధర్ నాదెళ్ళను నియమించినట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. ఈ మేరకు బోర్డ్, ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురితో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఈ కమిటీకి చైర్మన్‌గా శ్రీనివాస్ కోనేరు వ్యవహరించారు. సభ్యులుగా నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి ఉన్నారు. 2025 జూలై మొదటివారంలో ఈ మహాసభలు డిట్రాయిట్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతి పదేళకు ఓసారి డిట్రాయిట్లో మహాసభలు నిర్వహించడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరంలో కూడా డిట్రాయిట్లో తానా (TANA) మహాసభలు జరిగిన విషయం విదితమే. ఇప్పుడు ఆ ఆనవాయితీ కొనసాగింపుగా 2025 మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నిలవడం విశేషం. డిట్రాయిట్ అయితే తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత ఈసీ, బోర్డ్ డిట్రాయిట్‌ను ఎంపిక చేసినట్లు రాజా కసుకుర్తి తెలిపారు.
తానా 2025 మహాసభలకు చైర్మన్‌గా గంగాధర్ నాదెళ్లను కూడా నియమించారు. తానాలో పాతతరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న గంగాధర్ నాదెళ్ల ఈ మహాసభలను పర్యవేక్షించనున్నారని చెప్పారు. ఈ మహాసభల కో-ఆర్డినేటర్‌గా నియమితులైన ఉదయకుమార్ చాపలమడుగు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చల్లపల్లిలో జన్మించారని చెప్పారు. ఉదయ కుమార్ తానాలో వివిధ కీలక పదవులను నిర్వహించారని చెప్పారు. అలాగే డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఎ) కార్యనిర్వాహక కమిటీలో అనేక పదవులను నిర్వహించారని తెలిపారు.
ముఖ్యంగా బాగా గుర్తింపు పొందిన డీటీఏ 25వ, 40వ వార్షికోత్సవాల నిర్వహణలో కన్వీనర్‌గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డిట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కో-ఆర్డినేటర్ గా కూడా ఆయన సేవలందించారని గుర్తు చేశారు. అదేవిధంగా 2007లో తానా చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ గా కూడా ఆయన పనిచేశారన్నారు. ప్రముఖ నటుడు స్వర్గీయ తమ్మారెడ్డి చలపతి రావు గారి అల్లుడైన ఆయన, తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాల ద్వారా తెలుగు ప్రజలలో విశేషంగా గుర్తింపు పొందారని తెలిపారు. జూలై 2025 లో మెట్రో డెట్రాయిట్లో జరగబోయే తానా 24వ ద్వైవార్షిక సదస్సుకు కో-ఆర్డినేటర్‌గా ఆయన్ను ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.