Share News

AP Elections 2024: ‘పీలేరు’లో గెలిచేదెవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎందుకంటే..!?

ABN , Publish Date - May 25 , 2024 | 10:32 AM

అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే.. ఇక్కడ నల్లారి, చింతల కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం సాగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో నల్లారి సోదరుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా, ఆయన సోదరుడు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం..

AP Elections 2024: ‘పీలేరు’లో గెలిచేదెవరు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఎందుకంటే..!?

  • అందరి చూపూ.. పీలేరు వైపు!

  • పాతకాపుల మధ్య పోరుకు పెట్టింది పేరు

  • నల్లారి సోదరులు బరిలో నిలవడంతో మరింత ప్రత్యేకత

  • జిల్లాలోనే అత్యధిక పోలింగ్‌

  • ఇరుపార్టీల ఆశలు మహిళలపైనే

  • ఫలితంపై జోరుగా బెట్టింగులు

అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే.. ఇక్కడ నల్లారి, చింతల కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం సాగుతోంది. ఈ దఫా ఎన్నికల్లో నల్లారి సోదరుల్లో ఒకరైన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి రాజం పేట ఎంపీ అభ్యర్థిగా, ఆయన సోదరుడు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం.. వీరితో ఆది నుంచి రాజకీయ రణరంగంలో తలపడుతున్న చింతల కుటుంబం తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ (YSR Congress) నుంచి పోటీ చేయటం.. ఇక నల్లారి కుటుంబానికి బద్ధశత్రువైన పెద్దిరెడ్డి కుటుంబం చింతలకు అండగా నిలబడటంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అందరీ దృష్టి ఈ నియోజకవర్గం వైపు మళ్లింది. ఇక్కడ ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై జోరుగా బెట్టింగ్‌లు కూడా జరుగుతుండటం హాట్‌టాపిక్‌గా మారింది. ఒక్కసారి ఈ వివరాలు తెలుసుకోవాలంటే..


అన్నమయ్య జిల్లా/పీలేరు: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో అనునిత్యం రాజకీయ వర్గాల చర్చల్లో ఉండే నియోజకవర్గం పీలేరు. పాత కాపులైన నల్లారి, చింతల కుటుంబాల మధ్య 50 ఏళ్లుగా సాగుతున్న రాజకీయ రణరంగానికి పీలేరు సజీవ సాక్ష్యం. తండ్రుల మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం వారసత్వంగా తనయులు కూడా కొనసాగిస్తున్న ప్రత్యేక పరిస్థితి. ఆ రెండు కుటుంబాల మధ్య నెలకొన్న రాజకీయ విరోధానికి నల్లారి కుటుంబ సహజ శత్రువైన పెద్దిరెడ్డి కుటుంబం చింతల వైపు నిలవడంతో గడిచిన రెండు దఫాలుగా పీలేరు ఎన్నిక హాట్‌ టాపిక్‌గా మారింది. ఈసారి అది మరింత వేడి రగిల్చింది. పదేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అనూహ్యంగా రాజంపేట ఎంపీ బరిలో నిలవడం, ఆ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి ఉండడం సహజంగానే రాజంపేట పార్లమెంటు సెగ్మెంటుతో పాటు అందులో భాగమైన పీలేరు నియోజకవర్గంలోనూ సెగలు రేకెత్తిస్తున్నాయి. నల్లారి కుటుంబానికి రాజకీయ యోగం లేకుండా చేస్తానని పన్నెండేళ్లనాడు భీషణ ప్రతిజ్ఞ చేసిన పెద్దిరెడ్డి, దాన్ని నెరవేర్చుకునే క్రమంలో 2014, 2019 ఎన్నికల్లో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిని ఓటమి పాలుచేశారు. తన అనుయాడుమైన చింతల రామచంద్రారెడ్డిని అసెంబ్లీ బరిలో, తనయుడు మిథున్‌రెడ్డిని పార్లమెంటు బరిలో నిలపడం ద్వారా అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి తన పట్టు నిలుపుకుంటూ వస్తున్నారు. సంప్రదాయ రాజకీయాలకు పెట్టింది పేరైన నల్లారి కుటుం బం, పెద్దిరెడ్డికి దీటుగా ఆర్థిక, మానవ, రాజకీయ రంగాల్లో రాజకీయాలు సాగించలేక రెండు ఎన్నికల్లో ఓటమి చవి చూసింది.


Nallari-Kishorr-Reddy.jpg

గెలిచి తీరాలనే పట్టుదలతో...

ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి గత ఐదేళ్లుగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైసీపీ నాయకుల ఆక్రమణలు, అక్రమాలు, దౌర్జన్యాలపై పోరాడుతూ వచ్చారు. అన్న నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి రూపంలో ఈ ఎన్నికల్లో ఆయనకు అనుకోకుండా అదనపు బలం చేకూరింది. దీంతో ఈ ఎన్నికల్లో ఆయనపై సానుభూతితో పాటు కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఉన్న అభిమానం పనిచేసి కిశోర్‌ గెలిచి తీరుతారని టీడీపీ వర్గాలు ధైర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు గంటలకొద్దీ ఓపికగా క్యూలైన్లలో నిల్చుని వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డిపై అభిమానం కూడా పీలేరులో బలంగా పనిచేసిందని వారు ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్లుగానే పోలింగ్‌ అనంతరం జరుగుతున్న బెట్టింగ్‌ వ్యవహారాల్లోనూ కిశోర్‌ కుమార్‌ రెడ్డి ఫేవరెట్‌గా ఉంటున్నారు. అత్యధికులు ఆయన గెలుస్తారనే బెట్టింగ్‌ కాస్తున్నారు. దీంతో ఆయన గెలుపు ఖాయమైపోయిందన్న పుకార్లు నియోజకవర్గమంతటా షికార్లు చేస్తున్నాయి.


Chintala-Rama-Chandra-Reddy.jpg

సవాళ్లు.. ప్రతి సవాళ్లు

నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబానికి మధ్య దశాబ్దాలుగా వైరం ఉందన్న సత్యం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అటువంటిది డీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తన బద్ధశత్రువైన కిరణ్‌ కాళ్లు పట్టుకున్నారా అన్న చర్చ సర్వత్రా జరిగింది. అందులో నిజం లేకపోతే కిరణ్‌ సత్యప్రమాణానికి సిద్ధపడతారా అనే వాళ్లు ఎక్కువయ్యారు. విద్యావంతుడైన కిరణ్‌ సాధారణంగా ఎవరిపైనా విమర్శలు చేయరని, ఒకవేళ చేయాల్సి వస్తే పూర్తి ఆధారాలు ఉంటేనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడతారని, కిరణ్‌ సంధించిన విమర్శలకు పెద్దిరెడ్డి సమాధానం చెప్సాల్సిందేనంటూ డిమాండ్లు సైతం వెల్లువెత్తాయి. దీంతో పదేళ్లుగా అప్రతిహతంగా రాజకీయాలు సాగించిన పెద్దిరెడ్డి కుటుంబం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో డబ్బులు దోచుకున్నారని, అలా దోచుకోలేదని ప్రమాణం చేయాలని పెద్దిరెడ్డి ప్రతిసవాల్‌ విసిరారు. దానికి కూడా కిరణ్‌ ధీటుగా సమాధానం ఇచ్చారు. తాను పుట్టపర్తి సాయిబాబా వ్యవహారంలో ఎలాంటి తప్పు చేయలేదని, సదుం అయ్యప్పస్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, తన కాళ్లు పట్టుకోలేదని పెద్దిరెడ్డి కూడా అక్కడే ప్రమాణం చేయాలని వారికి ప్రతిసవాల్‌ విసిరారు. దీంతో పెద్దిరెడ్డి క్యాంపునకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. ఏం చేయాలో తోచక మిథున్‌, కిరణ్‌పై వ్యక్తిగత దూషణలకు తెగపడ్డారు.


Vote.jpg

ఇరుపక్షాల ఆశలు మహిళల ఓటుపైనే..

ఎన్నికల అనంతరం ఓటింగ్‌ సరిళిని పరిశీలించి గెలుపోటములపై అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్‌లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనడంతో వారి ఓట్లు తమకు అంటే తమకే దక్కాయని అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. సంక్షేమ పథకాలు పనిచేశాయని, అందుకనే మహిళలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొని తమకు ఓటు వేశారని వైసీపీ నాయకులు, ప్రభుత్వ వ్యతిరేకత, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు, స్థానిక నాయకుల ఆక్రమణలు, దౌర్జన్యాలకు విసిగిపోవడంతో పాటు తాము ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల పట్ల మహిళలు ఆకర్షితులయ్యారని, తద్వారా తమకే ఓటు వేశారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో 2,34,608 మంది ఓటర్లకు గాను 1,90,234 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలోనే అత్యధికంగా 81.09 శాతం పోలింగ్‌ నమోదైంది. 1,14,962 మంది పురుషు ఓటర్లకు గాను 93,854 మంది ఓటు వేశారు. 1,19,624 మంది మహిళా ఓటర్లు ఉండగా 96,364 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులు 22 మంది ఉండగా 16 మంది ఓటు వేశారు.

బెట్టింగ్‌లో టీడీపీదే పైచేయి...

పోలింగ్‌ అనంతరం ప్రారంభమైన బెట్టింగుల్లో కిశోర్‌ కుమార్‌రెడ్డి గెలుపు మీదనే ఎక్కువగా పందేలు సాగుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రభుత్వ ఏర్పాటు, ఆయా నియోజకవర్గాల్లో గెలుపు సాధించే అభ్యర్థులపై పెద్దఎత్తున బెట్టింగులు జరుగుతుంటాయి. పీలేరులో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుపై పందేలు కాయడానికి అత్యధికులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నప్పటికీ కిశోర్‌ గెలుపుపై మాత్రం పందేలు కాయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కిశోర్‌ గెలుస్తారని రూ.లక్ష పందెం కాస్తే, చింతల గెలుస్తున్నట్లు రూ.50వేలు పెడితే చాలునని టీడీపీ సానుభూతిపరులు ఆహ్వానిస్తున్నా స్పందన కరువైనట్లు తెలిసింది. కేవలం పీలేరు వాసులే కాకుండా కిశోర్‌ గెలుపుపై ఆన్‌లైన్‌లో కూడా పెద్దఎత్తున బెట్టింగ్‌ నడుస్తున్నట్లు సమాచారం.


TDP-JANASENA-BJP-PATH.jpg

నిప్పు రాజేసిన నల్లారి

ఐదేళ్లుగా పీలేరు రాజకీయం టీడీపీలో నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, వైసీపీలో చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి చుట్టూ తిరిగాయి. అవకాశం వచ్చినప్పుడల్లా వీరు ముగ్గురూ ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం, ఆరోపణలు చేసుకోవడం పరిపాటిగా ఉండేది. కేవలం పీలేరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ధీటుగా ఎదుర్కోగల నేతగా నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇవన్నీ ఆయన సోదరుడు నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజంపేట ఎంపీ ఎన్‌డీఏ అభ్యర్థిగా జిల్లాలోకి అడుగుపెట్టేంత వరకు సాగాయి. ఆ తరువాత రాజకీయాలన్నీ కిరణ్‌ చుట్టూ తిరగడం మొదలెట్టాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరులో జరిగిన కిశోర్‌ నామినేషన్‌ ర్యాలీలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వీరుడిని, శూరుడిని, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్నవాడిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్ష పదవి కోసం రెండుసార్లు తన కాళ్లు పట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి నిప్పు రాజేశారు. పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని తరిగొండలోగానీ, కాణిపాకంలోగానీ ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, పట్టుకోలేదని పెద్దిరెడ్డి ప్రమాణం చేయగలరా అంటూ సవాల్‌ విసిరి రాజకీయాలను తనవైపు తిప్పుకున్నారు. అప్పటి వరకు స్తబ్ధుగా సాగిన పీలేరు రాజకీయాలు, ఎన్నికల ప్రచార సభలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అమెరికా టూర్ వెనుక నివ్వెరపోయే నిజాలివే..!



Vallabhaneni Vamsi: గన్నవరంలో మాయమై డల్లాస్‌లో వల్లభనేని వంశీ ప్రత్యక్షం.. ఎందుకా అని ఆరాతీస్తే..?


Updated Date - May 25 , 2024 | 10:59 AM