Lok Sabha Polls: హైదరాబాద్‌లో ఎన్నికల సందడి కనిపించలేదేం!
ABN , Publish Date - Apr 15 , 2024 | 03:38 PM
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. అయినా అయినా గ్రేటర్‌లో లోక్‌సభ ఎన్నికల సందడి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. అభ్యర్థులు ఇప్పటివరకు కూడా పూరి స్థాయి పర్యటనలకు సైతం శ్రీకారం చుట్టలేకపోతున్నారు..
చప్పగా లోక్‌సభ సమరం
ఒకట్రెండు స్థానాల్లోనే సందడి
గ్రేటర్‌లో పుంజుకోని అభ్యర్థుల ప్రచారం
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఐదు నెలలైనా కాలేదు
పైగా ఎండల ఎఫెక్ట్ తోడు
నిరుత్సాహంగా ద్వితీయ శ్రేణి నాయకగణం
కనిపించని ప్రచార రథాలు, పోస్టర్లు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. అయినా అయినా గ్రేటర్‌లో లోక్‌సభ ఎన్నికల సందడి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. అభ్యర్థులు ఇప్పటివరకు కూడా పూరి స్థాయి పర్యటనలకు సైతం శ్రీకారం చుట్టలేకపోతున్నారు. అభ్యర్థితత్వం ఖరారై దాదాపు ఇరవై రోజులు కావస్తున్నా.. కొంతమంది గడపదాటని పరిస్థితి కనిపిస్తోంది. అధిష్ఠానం ఆదేశాల కోసం ఎదురుచూడడమో లేకుంటే నామినేషన్ల కంటే ముందే ప్రచారం చేపడితే ఖర్చు ఎక్కువవుతోందనే భయమో.. తెలియదు కానీ ఆశించిన స్థాయిలో ప్రచారం లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారు. టికెట్లు దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఇద్దరు, ముగ్గురు మినహా.. ఎవరూ బయటకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
15 రోజులపాటు నిర్విరామంగా
నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గర పడుతున్నా.. చాలా మంది వేచిచూసే ధోరణిలోనే ఉండడంతో ఎన్నికల వాతావరణం పూర్తి స్తబ్దుగా కనిపిస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నగరవాసులను హోరెత్తించాయి. నామినేషన్ల కంటే ముందే టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు తమ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు పాదయాత్రలు చేపట్టడం, ప్రచార రథాలతో బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేయడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఆత్మీయ సమ్మేళనాలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. దాదాపు 15 రోజులపాటు నిర్విరామంగా సెగ్మెంట్లలో తిరిగారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించారు. దీంతో నాటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ వర్గాలకు చెందిన శ్రామికులకు చేతినిండా పని దొరికింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడినా అలాంటి వాతావరణం నగరంలో ఎక్కడా కనిపించడం లేదు.
అనుచరులతో చర్చలు
నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పూర్తిస్థాయిలో కదనరంగంలోకి దిగుదామని, ప్రచారానికి ఇప్పుడేం తొందరలేని అనుచరులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల్లో తమ పార్టీ ఎలాగైనా గెలవాలనే ఆకాంక్షతో ఎదురుచూస్తున్న కార్యకర్తలకు అభ్యర్థుల నిర్లక్ష్యం నిరుత్సాహానికి గురిచేస్తోంది. మరో వైపు పార్టీలకు చెందిన ప్రచార రథాలు, వాల్‌పోస్టర్లు ఎక్కడా కనిపించకపోవడంతో దిగులు చెందుతున్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన మరికొన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇతర పార్టీల్లోని నాయకులను పెద్ద సంఖ్యలో చేర్పించుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నాయి.
నోట్ల పంపిణీకి కసరత్తు
గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఒక్కో ఓటుకు రూ.1,000, మరికొన్ని చోట్ల రూ.1,500 వరకు ఇచ్చారు. కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ లాంటి నియోజకవర్గాల్లో కొన్ని వర్గాల ప్రజలకు ఓటుకు రూ.3వేల వరకు కూడా ఇచ్చినట్లు తెలిసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో అంత మొత్తంలో డబ్బులు పంపిణీ చేయడం కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ.. ఓట్లను సంతృప్తి పరిచేందుకు కొంత వరకైనా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గ్రేటర్‌లోని ఆయా నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటుకు కనీసం రూ.500 నుంచి రూ.1,000 వరకు ఇచ్చేందుకు కొంతమంది అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే నగదు నిల్వలను సమ కూర్చుకుని బంధువులు, సన్నిహితుల దగ్గరకు చేర్చే పనిలో పడ్డారు. కాగా, డబ్బులు తీసుకునేందుకు ఆసక్తి చూపించని ఓటర్లకు కానుకలు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా నగరంలో పార్లమెంట్ ఎన్నికల జోష్ ఇంకా మొదలుకాకపోవడం గమనార్హం.