Share News

AP Election Results: కూటమి గెలిచినా బెట్టింగ్ రాయుళ్లు బికారులయ్యారే..!

ABN , Publish Date - Jun 10 , 2024 | 02:33 PM

సార్వత్రిక ఎన్నికలు (AP Election Results) ఉత్కంఠ రేకెత్తించాయి. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు కూటమికి ఏకపక్షంగా రావడంతో పందె కాసిన పలువురు బికారులయ్యారు. పందెం గెలిచినా..

AP Election Results: కూటమి గెలిచినా బెట్టింగ్ రాయుళ్లు బికారులయ్యారే..!

అమరావతి/ఏలూరు: సార్వత్రిక ఎన్నికలు (AP Election Results) ఉత్కంఠ రేకెత్తించాయి. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు కూటమికి ఏకపక్షంగా రావడంతో పందె కాసిన పలువురు బికారులయ్యారు. పందెం గెలిచిన వారు కూడా సొమ్ము అందక లబోదిబోమంటున్నారు. ఎవరికివారు తమ పార్టీ అభ్యర్ధులే విజయం సాధిస్తారు. పందెం కాస్తే అయాచితంగా లక్షలు వస్తాయనే ఆశతో లక్షలాది రూపాయలు పందెం కట్టారు. కొంతమంది పందెం ఓడిపోయి ఉన్న ఆస్థులను అమ్ముకుని, బికారులుగా మారగా, మరికొంతమంది పందెం గెలిచి కూడా కట్టిన సొమ్ము చేతికి రాక అవస్థలు పడుతున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు చాలామంది మధ్యవర్తుల వద్ద పందెం సొమ్ము కట్టారు. ఇరుపక్షాల కలసి పందెపు సొమ్మును మధ్యవర్తి దగ్గర ఉంచారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత పందెం సొమ్ముకోసం వెళ్లిన వారికి మధ్యవర్తి అడ్రస్‌ లేడు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాప్‌ వస్తోంది. దీంతో లబోదిబోమంటూ వెతుకులాట ప్రారంభించినా వారి జాడ కనిపించక పందెపు సొమ్ము రాక ఎదురు చూస్తున్నారు.


TDP-And-YSRCP-Logo.jpg

అప్పు చేసి కొందరు.. భూములు తనఖా పెట్టి మరికొందరు!

దెందులూరు నియోజకవర్గంలో నలుగురైదుగురు మద్యవర్తుల దగ్గర దాదాపు రూ.20 కోట్లకు పైగా పందెపుసొమ్ము ఉన్నట్లు చెబుతున్నారు. ఒక వ్యక్తి రూ.ఐదుకోట్లతో పరారయ్యాడని, తాను కట్టిన రూ.12.50లక్షల నగదు, పందెంలో తనకు రావాల్సిన రూ.పది లక్షల మాటేమిటో అర్ధం కావడంలేదని ఒకరు దిగాలుగా చెప్పారు. మద్యవర్తిని నమ్మి కోట్లలో సొమ్మును అతనివద్ద ఉంచితే అతను ఆ సొమ్మును వేరొక పందెంలో కాయడం, ఆ పందెం కాస్తా పోవడంతో అతడు పరారయ్యాడని అను కుంటున్నారు. దీంతో పందెం గెలిచిన వ్యక్తులు కూడా సొమ్ము చేతి కందక అవస్థలు పడుతున్నారు. అప్పుచేసి పందెం కాశామని ఒకరు.. పది రూపాయల వడ్డీకి తెచ్చామని మరొకరు.. బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టిన సొమ్ముతో పందెం కట్టామని ఇంకొకరు.. భూమి పత్రాలను తనఖా పెట్టామని వేరొకరు.. ఇలా పలువురు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మద్యవర్తి వచ్చిన తర్వాతైనా ఆ సొమ్ము వస్తుందనే గ్యారంటీ లేదని పందెపురాయుళ్ళు వాపోతున్నారు. పందెం గెలిచికూడా సొమ్ము పోగొట్టుకోవడం అంటే అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదని ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు.


AP-Election-Betting.jpg

అయ్యో.. ఇలా జరిగిందేంటి..?

కాగా పందెం సొమ్ము తన దగ్గర పెట్టుకున్న మధ్యవర్తుల్లో ఇద్దరు, ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారని సమాచారం వారి దగ్గర పెట్టిన సొమ్ము ఇక రానట్లేనని పందెపు రాయుళ్లు దిగాలు పడుతున్నారు. పెదవేగి మండలానికి చెందిన ఒకరు తన దగ్గర పెట్టిన పందెపు సొమ్మును మరొక పందెంలో పెట్టి మొత్తం పోగొట్టుకున్నట్లు తెలిసింది. సొమ్ము తిరిగి ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పరారయ్యాడు. ఐదురోజుల తరువాత తిరిగొచ్చిన అతడు తనకున్న రెండెకరాల భూమిని విక్రయించి, పందెం సొమ్మును కట్టడతానని పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగినట్లు సమాచారం.


TDP-JANACENA-BJP-LOGO-(1).gif

మాయాజాలం!

2019లో జరిగిన ఎన్నికల్లోనూ మద్యవర్తుల మాయాజాలంతో ఒక కుటుంబం మాటకు కట్టుబడి వారి ఆస్తులను విక్రయించి, కుదేల య్యారు. ఆరోజున ఆ కుటుంబం నేను ఇవ్వను అంటే చేసేది ఏమీ లేదని,. కానీ మధ్యవర్తికి సొమ్ము ఇప్పించే విషయంలో ఆ కుటుంబం మొత్తం ఆస్తులను పోగొట్టుకుంది. ఇలా పందేలు ఎంతోమంది జీవితాలను సర్వనాశనం చేశాయి. తాజా ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో తన స్థాయిని మించి పెందేలు కాసి, పందేలు ఓడి, సొమ్ము కట్టలేక ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడం విషాదం.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2024 | 02:34 PM