YS Jagan: వైఎస్ జగన్-సాయిరెడ్డి మధ్య ‘శాంతి’పై చర్చ.. వివరణ
ABN , Publish Date - Jul 20 , 2024 | 03:03 PM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘శాంతి’ ఇష్యూపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అసలేం జరిగిందంటే..?
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ‘శాంతి’ ఇష్యూ తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమెపై భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేయడం.. మీడియా ముందుకొచ్చి శాంతి వివరణ ఇచ్చుకోవడం.. ఈ ఇద్దరి కామెంట్స్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) స్పందించడం ఇదంతా పెద్ద సీరియల్‌నే తలపిస్తోంది. ఈ వ్యవహారానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అస్సలు కనిపించట్లేదు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ కూడా..!
అధినేత ఆరా..!
శాంతి ఇష్యూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వద్దకు చేరింది. శనివారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎంపీలతో.. అధినేత సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు వైఎస్ జగన్- ఎంపీ విజయసాయిరెడ్డిల మధ్య ‘శాంతి’పై పెద్ద చర్చే జరిగింది. అసలేం జరిగింది..? ఎందుకు.. ఏమిటీ రచ్చ..? మీడియాలో ఎందుకింత రాద్ధాంత జరుగుతోంది..? అని సాయిరెడ్డిని జగన్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై సుమారు అరగంటపాటు ఎంపీ వివరణ ఇచ్చుకున్నారు. అప్పుడు జగన్, విజయసాయితో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఆ తర్వాత విడిగా కూడా వీరితో జగన్ మాట్లాడారు.
ఇంతకుమించి ఏమీ లేదు..!
‘కొన్ని టీవీ చానళ్లు పనిగట్టుకొని అసత్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఆ చానళ్లకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2020లో అసిస్టెంట్ కమీషనర్ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా శాంతిని సీతమ్మదారి ఆఫీసులో కలిశాను. అప్పటి నుంచి ఆమెను కూతురుగా భావిస్తున్నాను. ఓ తండ్రిగా అడిగినప్పుడు సాయం చేశాను. శాంతికి కొడుకు పుట్టాడంటే వెళ్లి మాట్లాడాను. నా ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వదించాను. అంతే ఇంతకుమించి ఏమీ లేదు’ అని జగన్‌కు సాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈ వివరణపై వైఎస్ జగన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది..? అనేది మాత్రం బయటికి రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విజయసాయికి అధినేత గట్టిగానే క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.
సమావేశం తర్వాత..?
కాగా.. పార్లమెంటరీ సమావేశం తర్వాత ప్రజాప్రతినిధిగా.. ప్రజలకు వివరణ ఇస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్లు, వాటి ముసుగులో చెలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. శాంతి కళింగిరిని 2020 సంవత్సరం ఏసీ ఎండోమెంట్స్ ఆఫీసర్‌గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్‌లో మొట్టమొదటగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోను అనైతిక/అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవ దేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను’ అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.