Chadrababu-Pawan: హైదరాబాద్‌లోనే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు.. ఏం చేస్తున్నారు?
ABN , Publish Date - Aug 26 , 2024 | 08:54 AM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు జూబ్లీ హిల్స్ నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొని బిజీబిజీగా గడిపారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇక పవన్ కూడా బాబు బాటలోనే నడుస్తున్నారు. ఆయన కూడా తనకు వీలు చిక్కినప్పుడల్లా హైదరాబాద్‌కు వచ్చి వెళుతున్నారు. ఇవాళ పవన్ ఏపీకి వెళ్లాల్సి ఉంది. అయితే తన షెడ్యూల్‌ను రేపటికి మార్చుకున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు బేగంపేట్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.
టార్గెట్ తెలంగాణ..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీని బలోపేతం చేయాలని.. పునర్‌వైభవం తీసుకురావడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి 15 రోజులకోసారి హైదరాబాద్‌కు రావడం, ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశాలు అవుతూ వస్తున్నారు. ఆదివారం నాడు కూడా ఎన్టీఆర్‌భవన్‌లో ఆయన రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో టీడీపీ బలోపేతం, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకుల అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీనుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి ఆహ్వానించాలని, వారితో పాటు కొత్తవారిని కూడా చేర్చుకోవాలని సూచించారు. వాస్తవానికి ఏపీలో టీడీపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణలోనూ టీడీపీకి మైలేజ్ పెరిగింది. దీనిని మరింత పెంచేందుకు పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘‘మబ్బులు వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఛేదించుకుని ముందుకు వెళ్లే నాయకత్వం ఉండాలి. పార్టీపై స్థానిక నాయకత్వం ప్రజల్లో నమ్మకం కలిగించాలి. విశ్వాసాన్ని పెంచుకోవాలి’’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో తెలంగాణలోని టీడీపీ నేతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు.
బాబు అలా.. పవన్ ఇలా..!
ఇక మీదట ప్రతి 15 రోజులకూ ఒకసారి తాను రాష్ట్ర పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తానని చంద్రబాబు.. తన పార్టీ నేతలకు తెలిపారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయి నుంచి విస్తృత అభిప్రాయ సేకరణ చేపట్టి, రాష్ట్రస్థాయిలో సమీక్ష చేయాలని ముఖ్యనేతలకు సూచించారు. ఇక పవన్ వచ్చేసి నిన్న రష్యన్ వ్యోమగామి సెర్గ్ కోర్సకొవ్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అమరావతిలో స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమై.. అంతరిక్ష రంగంలో సంస్థ చేసిన పరిశోధనల గురించి తెలుసుకున్నారు. స్పేస్ కిడ్జ్ సంస్థ పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి డిప్యూటీ సీఎంకు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఆ తరువాత వెంటనే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చారు. వారానికో.. పది రోజులకోసారి అయినా పవన్ హైదరాబాద్‌కు వచ్చి వెళుతున్నారు.