Share News

YSRCP: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారేం..!?

ABN , Publish Date - Aug 03 , 2024 | 11:46 AM

అధికార మదం తలకెక్కితే ప్రజలే నేలకు దించుతారన్న విషయం వైసీపీ (YSR Congress) విషయంలో రూడీ అయింది. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు చేసిన అరచకాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. వారు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్లు వ్యవహరించారు...

YSRCP: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారేం..!?

అధికార మదం తలకెక్కితే ప్రజలే నేలకు దించుతారన్న విషయం వైసీపీ (YSR Congress) విషయంలో రూడీ అయింది. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు చేసిన అరచకాలు, అక్రమాలు అన్నీఇన్నీ కావు. వారు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్లు వ్యవహరించారు. రానున్న పదేళ్లు.. కాదు 30 ఏళ్లు తమకు తిరుగులేదన్నట్లు విర్రవీగారు. అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లోకి తీసుకున్నారు. దందాలు, భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇసుక, మట్టి, కంకర ఇలా ప్రతిదీ దోచుకున్నారు. ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడ్డారు. అభివృద్ధి తక్కువ.. అరాచకం ఎక్కువ అన్నట్లు వైసీపీ ఐదేళ్ల పాలన సాగింది. అయితే, రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో? చెప్పలేం. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంటుందో? ఊహించలేం. 2024 ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అయింది. ప్రజలు వైసీపీని గద్దె దించారు. ఎన్‌డీఏ కూటమికి (NDA Alliance) పట్టం కట్టారు. దీంతో గతంలో అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇప్పుడు పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. ఓటమిని జీర్ణించుకోలేక ప్రస్తుతం ఇంటి గడప కూడా దాటేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఆ నేతలు ఎక్కడంటూ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.


Baddukonda-Appalanaidu.jpg

అక్రమార్జనే టార్గెట్!

గత ఐదేళ్ల పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా పని చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు అక్రమార్జనే లక్ష్యంగా ముందుకు సాగారు. ప్రభుత్వ ఆసుపత్రిని తన కారుషెడ్‌గా, పశువుల శాలగా మార్చేశారు. జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు సహకారంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి భోగాపురం మండలం రామచంద్రాపురం క్వారీని స్వాధీనం చేసుకున్నారు. నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి క్వారీని కూడా పొందేందుకు ప్రయత్నించగా టీడీపీ, ప్రజా సంఘాలు భగ్గు మన్నాయి. తన వ్యాపార సామ్రాజ్యంలో తన కుమారులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించారు. డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురంలో తక్కువ ధరలకు భూములు కొనడమే కాకుండా, బంజారు, వివాదస్పద భూములపై దృష్టి సారించేవారు. ఉన్నతాధికారుల నుంచి క్లియర్‌ చేయించుకుని లే అవుట్లగా మార్చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు రాజకీయ కక్షలతో ప్రతిపక్ష నాయకులను అణచివేసేందుకు ప్రయత్నించారు. రామతీర్థం శేషాచలం కొండపై కోదండ రాముని తల విరగ్గొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజలు, ప్రజా సంఘాలు, భక్తులు, టీడీపీ నాయకులు భారీగా నిరసన చేపట్టారు. ఈ విషయంలో అప్పట్లో కళా వెంకటరావుపై కేసు కూడా నమోదైంది. నెల్లిమర్ల మండలానికి చెందిన సువ్వాడ రవిశేఖర్‌తో పాటు మరో ఐదారుగురు జైలుకి వెళ్లారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన బడ్డుకొండ ప్రస్తుతం ఇంటికే పరిమిత య్యారు. అవసరం ఉంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వద్దకు వెళ్తుంటారు. అంతేతప్ప ఆయన బయటకు అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది.

Botsa-02.jpg

చూపుడు వేళ్లతో సమాధానం!

గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన బొత్స సత్యనారాయణ జిల్లా రాజకీయాలను శాసించేవారు. తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరించేవారు. సమావేశాల్లో ఎవరైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశ్నించినా, మాట్లాడినా చూపుడు వేళ్లతో సమాధానం చెప్పి కూర్చోబెట్టేవారు. చీపురుపల్లిలో నచ్చిన కార్యకర్తలకే కాంట్రాక్టులు అప్పజెప్పేవారు. ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. తమ్ముడు చేస్తున్న భూ దందాలకు కనీసం అడ్డు చెప్పవారు కాదు. చీపురుపల్లిలోని రెస్కో కంపెనీలో ఉద్యోగాల విషయంలో ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా టీచర్లను నచ్చిన చోటకు బదిలీల వ్యవహారంలో కూడా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్రకు ‘నేనే పెద్దలీడర్‌’ను అని చెప్పుకునే బొత్స ఈ ఎన్నికల్లో కళా వెంకటరావు చేతిలో ఘోరంగా ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయన ప్రెస్‌మీట్లకు పరిమితం అయ్యారు.


Jogulu-Kambala.jpg

నేను చెప్పిందే శాసనం!

రాజాం ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేసిన కంబాల జోగులు నియోజకవర్గ ప్రజల కోసం చేసిందేమీ లేదు. ఆయన మాత్రం అన్ని శాఖల అధికారులను పావులుగా ఉపయోగించుకుని పైరవీలు చేసుకున్నారు. తాను చెప్పిందే శాసనం అన్నట్లు అధికారులకు హుకుం జారీ చేసేవారు. మండల పరిషత్‌కు సంబంధించిన స్థలాన్ని తక్కువ ధరకే తనవారికి ముట్టజెప్పారన్నా విమర్శలు ఉన్నాయి. కంబాల జోగులు అండతో గడ్డిముడిదాం గ్రామంలో ఆర్‌సీఎం చర్చి భూములను తక్కువ ధరకు కట్టబెట్టటానికి ప్రయత్నం చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన పాయకరావుపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. అక్కడి నుంచే అప్పుడప్పుడు ఇక్కడి కార్యకర్తలతో టచ్‌లో ఉంటారు.


Botsa-appalanarasayya.jpg

అటు వైపు కూడా రాలేదేం!

గజపతినగరం ఎమ్మెల్యేగా బొత్స అప్పలనర్సయ్య పనిచేసిన గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు భూ అక్రమణలు, ఇసుక దందా, మట్టి దందాకు పాల్పడ్డారు. ప్రస్తుతం వారంతా అడ్రాస్‌ లేకుండా ఉన్నారు. ఎన్నికలు ముగిసి రెండు నెలలు కావస్తున్నా పార్టీ కార్యాలయం వైపు వచ్చేందుకు అప్పలనర్సయ్య ఇష్టపడడం లేదు. ఇప్పటికీ ఆయన వెనుక ఉండి ఇసుక దందా సాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే, నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఇళ్లకే పరిమితమై ఉన్నారు. స్థానిక సంస్థల్లో గెలుపొందిన వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల కార్యాలయానికి కూడా రాని పరిస్థితి నెలకొంది.


kadubandi-Srinivasa-Rao.jpg

బయటికి కూడా..!

ఎస్‌.కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మొదటి నుంచీ ఇంటిపోరుతోనే రాజకీయాల్లో కొనసాగారు. ఈ ఎన్నికల్లో ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలే ఆయన్ను తిరస్కరించడంతో ఘోరంగా ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పనిచేసిన ఐదేళ్లలో ఇసుక, మట్టి అక్రమ తరలింపులో భారీగా ముడుపులు అందాయన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు రాజుపాత్రునిపాలెం సమీపంలో ఉన్న కొండను చదును చేసి ఇంటి స్థలాలుగా మార్చేసి విక్రయించినట్లు సమాచారం. స్థానిక అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే ఉన్నతాధికారులతో వారికి ఫోన్‌ చేయించేవారు. ఆయన అండ చూసుకుని స్థానిక వైసీపీ నేతలు కూడా రెచ్చిపోయేవారు. ఇంటి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. అదే విధంగా ఉపాధి హమీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను బెదిరించిన ఆడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కడుబండి తమ్ముడు రమేష్‌నాయుడు రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగాన్ని తన అధీనంలో ఉంచుకుని దందా చేసేవారు. తానే ఎమ్మెల్యే అన్నట్లు అధికారులకు ఆదేశాలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఓటమిపాలైన కడుబండి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.


Kolagatla-Veerabhadra-Swamy.jpg

శత్రువులంతా..!

విజయనగరం ఎమ్మెల్యేగా 2019లో విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి ఐదేళ్ల పాటు అంతా తానై వ్యవహరించారు. ఆయనతో పాటు అనుచరులు బరి తెగించారు. జగనన్న కాలనీ కోసం స్థలం ఎంపిక, ఆ స్థలం ప్రభుత్వ కొనుగోలు వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయి. కొండకరకాం, సారిక ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు ఏకపక్షంగా నిర్వహించారు. వైసీపీ మద్దతుదారులకే ఇళ్లు కేటాయించారు. విజయనగరం నగరపాలక సంస్థని వైసీపీకి అనుకూలంగా మార్చేశారు. కోలగట్ల ఏమి చేబితే అధికారులు అదే చేసేవారు. కోలగట్ల అనుచరులు నగరంలోని పలు చెరువులు, గెడ్డలను ఆక్ర మించేశారు. మన్నార్‌ రాజగోపాల స్వామి ఆలయ భూముల్లో ఉన్న గెడ్డను కోలగట్ల ప్రధాన అనుచరుడు, ఆయన వ్యాపార భాగస్వామి కప్పేశాడు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు శత్రువులంతా చేతులు కలిపారు. ఫలితంగా ఘోర ఓటమిని చవిచూశారు. దీంతో ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. జగన్మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీకి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపువచ్చినా వెళ్లలేదు. బొత్స స్వయంగా ఫోన్‌ చేసి పిలిచినా గడప దాటలేదు. తాను గెలిపించిన కార్పొరేటర్లు, పలువురు ఎంపీటీసీ, సర్పంచ్‌లే తనకు చావు దెబ్బకొట్టారని మదనపడుతూ ఇంటిలోనే ఉంటున్నారు.


ఇవి కూడా చదవండి


బొత్స ఎంపికపై వైసీపీ నేతల్లో గరంగరం!


వల్లభనేని వంశీ ఎక్కడ..!?



Updated Date - Aug 03 , 2024 | 12:03 PM