Share News

Telugu Desam: ఉమ్మడి కడప నుంచి మంత్రి అయ్యేదెవరు.. చంద్రబాబు మనసులో ఏముంది..!?

ABN , Publish Date - Jun 09 , 2024 | 02:05 PM

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్‌ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. అయితే ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఈనెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. .

Telugu Desam: ఉమ్మడి కడప నుంచి మంత్రి అయ్యేదెవరు.. చంద్రబాబు మనసులో ఏముంది..!?

  • అమాత్యయోగం ఎవరికో?

  • ఉమ్మడి జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఎన్నిక

  • పొరుగు జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా మనోళ్లు

  • మంత్రివర్గంలో చోటు కోసం యత్నాలు

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్‌ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. అయితే ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఈనెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేరోజు కానీ, తరువాత కానీ మంత్రివర్గం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో అమాత్యయోగం ఎవరికి దక్కుతుందో అంటూ ఉమ్మడి కడప జిల్లాలో చర్చ జరుగుతోంది.


ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడుచోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇక అనకాపల్లి, ఏలూరు ఎంపీలుగా సీఎం రమేశ్‌, పుట్టా మహేశ్‌యాదవ్‌ గెలిచారు. ధర్మవరం ఎమ్మెల్యేగా జిల్లా వాసి సత్యకుమార్‌ గెలిచారు. అయితే కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఎందుకంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మనోళ్ల పేర్లే చర్చకు వస్తున్నాయి. సామాజికవర్గాల ఆధారంగా మంత్రివర్గం కూర్పు ఉం టుంది. అన్నివర్గాలకు మంత్రివర్గంలో సమప్రాధాన్యం ఉం టుంది. దీంతో ఆయా వర్గాల్లో ఇప్పుడు ఎవరికి పదవి వస్తుందనే చర్చ నడుస్తోంది.

కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి నుంచి ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఎన్‌.వరదరాజులరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి టీడీపీ తరఫున గెలిచారు. ఇక జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి బీజేపీ తరఫున, రైల్వేకోడూరు నుంచి అర వ శ్రీధర్‌ జనసేన తరపున గెలిచారు. వీరంతా మంత్రివర్గంలో చోటు సంపాదించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు.


ఉమ్మడి కడప జగన్‌ సొంత జిల్లా.. 2004 తరువాత వరుసగా నాలుగుదఫాలుగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలుపు రుచి చూడని నియోజకవర్గాలున్నాయి. ఈసారి కూటమి అభ్యర్థులు ఏడుగురు గెలిచి మళ్లీ 1999 ముందునాటి పరిస్థితులు రావడంతో టీడీపీకి పూర్వవైభవం వచ్చింది. జగన్‌ సొంత జిల్లాలోనే కూటమి అభ్యర్థులు అనూహ్య విజయం సాధించారు. దీంతో కూటమి ఇక్కడ మరింత పటిష్టమయ్యేందుకు మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కుతాయని అంటున్నారు. అయితే ఎవరెవరికి దక్కుతాయనే చర్చ నడుస్తోంది.


రేసులో ఎవరెవరు..?

మంత్రివర్గంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేల గురించి పరిశీలిస్తే..

  • కడప అసెంబ్లీ చరిత్రలోనే మహిళ ఎమ్మెల్యేగా గెలవడం ఇదే మొదటిసారి. టీడీపీ నుంచి బరిలో దిగిన ఆర్‌.మాధవీరెడ్డి మొట్టమొదటిగా గెలిచి చరిత్ర సృష్టించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి సతీమణి అయిన ఈమె తక్కువ సమయంలోనే జనాల్లోకి బాగా వెళ్లారు. ఆమె ముక్కుసూటితనం, దూకుడు ప్రవర్తన టీడీపీ శ్రేణులను ఆకర్షించింది. మహిళ కావడంతో ఈమె పేరు కూడా ప్రచారంలో ఉంది.

  • ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోసారి ఎన్నికయ్యారు. జిల్లా లో చాలా సీనియర్‌ ఎమ్మెల్యే ఆయన. ఇంతవరకు ఏ ప్రభుత్వంలోనూ ప్రొ ద్దుటూరు నుంచి మంత్రివర్గంలో ఎవ్వరికీ స్థానం లభించలేదు. సీనియర్‌ నే త కావడంతో ఈసారి అవకాశం ఉంటుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

  • కమలాపురం ఎమ్మెల్యేగా పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి తొలిసారి ఎన్నికల్లోనే గెలిచి సత్తా చాటారు. యువకుడు, వి ద్యావంతుడు కావడం, టీడీపీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో బాగా డీలింగ్స్‌ ఉండడంతో మంత్రిప దవిపై ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకుని ఉన్నారు.

  • మైదుకూరు ఎమ్మెల్యేగా పుట్టా సుధాకర్‌యాదవ్‌ మొట్టమొదటిసారిగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో పు ట్టా సుధాకర్‌యాదవ్‌ ఓడిపోయారు. 2014లో టీడీపీ అధికారం చేపట్టడం తో ఈయన టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. బీసీ వర్గాని కి చెందినవారు కావడంతో ఈయన అనుచరులు మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్నారు.

  • రాయచోటిలో టీడీపీ ఎమ్మెల్యేగా మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి గెలుపొందారు. నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1999, 2004 ఎన్నికల్లో మా త్రమే టీడీపీ నుంచి ఎస్‌.పాలకొండ్రాయుడు గెలిచారు. ఇక 2009 నుంచి 2019 వరకు కాంగ్రె స్‌, వైసీపీలే గెలుస్తూ వచ్చాయి. అయితే ఈసారి మండిపల్లి రాంప్రసాదరెడ్డి గెలిచారు. ఉమ్మడి జిల్లా అయినా ప్రస్తుతానికి అది రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్‌క్వార్టర్‌. మం త్రి పదవిపై ఆయన ఆశలు పెట్టుకుని ఉన్నారు.

  • రైల్వేకోడూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ నుంచి చివరిసారిగా 1999లో ఎస్‌.సరస్వతి గెలుపొంది అప్పటి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తరువాత వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌, వైసీపీ గెలుస్తూ వచ్చాయి. కూటమిలో భాగంగా ఈ టికెట్‌ను జనసేనకు కేటాయించారు. అరవ శ్రీధర్‌ గెలుపొందారు ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరుతుంది. సామాజిక వర్గాల కూర్పు ప్రకారం మంత్రి పదవిపై ఇక్కడ జనసేన వర్గాలు ఆశలు పెట్టుకుని ఉన్నాయి.

  • జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆయన తరువాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీ కోటాలో మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని ఆయన వర్గీయులు ఆశిస్తున్నారు.


Kadapa-District-LEaderss.jpg

పొరుగు జిల్లాలో మనోళ్లు

ప్రొద్దుటూరుకు చెందిన సత్యకుమార్‌ ధర్మవరం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దలు, ఆర్‌ఎస్ఎస్‌ నాయకులతో సంబంధాలున్నాయంటారు. బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో మంత్రి పదవిపై ఆయన అనుచరవర్గం ఆశలు పెట్టుకుని ఉన్నారు. పోట్లదుర్తికి చెందిన సీఎం రమేశ్‌ అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. కేంద్ర మంత్రివర్గంలో ఈయనకు చోటు లభిస్తుందని ఈయన వర్గీయులు భావిస్తున్నారు. కేంద్రంలో ఈయనకు విస్తృత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం ఉండడంతో ఈయన పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇక మైదుకూరుకు చెందిన పుట్టా మహేశ్‌కుమార్‌యాదవ్‌ ఏలూరు నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఏమో గుర్రం ఎగురుతుందేమోనన్న ఆశ ఆయన వర్గీయుల్లో ఉంది. ఇక పులివెందులకు చెందని భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికై రాయలసీమలోని టీడీపీలో ఊపు తెచ్చారు. ఈయన కూడా మంత్రి పదవిపై ఆశతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఎవరి ప్రయత్నాల్లో వారు

మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. జిల్లా నుంచి ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా ఇప్పటికే కొందరు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ను కలిశారు. ఇక బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌ ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లారు. ఇలా ఎవరికి వారు మంత్రివర్గంలో చోటుపై ప్రయత్నాలు చేస్తుండడంతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరికి పదవి దక్కుతుందోనన్న చర్చ బాగా నడుస్తోంది.

Updated Date - Jun 09 , 2024 | 02:08 PM