YS Jagan: ఎంపీలకు ప్లాన్ మొత్తం వివరించిన వైఎస్ జగన్!
ABN , Publish Date - Jul 20 , 2024 | 07:33 PM
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆరోపించిన సంగతి తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తామని ప్రకటించిన జగన్.. దీనిపై ఎలా ముందుకెళ్లాలి..? అని ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ధర్నాతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఏపీలో జరుగుతున్న విషయాలన్నీ ప్రస్తావనకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. శనివారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి..? ఏయే విషయాలపై మాట్లాడాలి..? అనే దానిపై లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
అందరూ ఆహ్వానితులే..!
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీలో ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో నిశితంగా వారికీ వివరిస్తాం. మాతో వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొనిపోతాం. ఢిల్లీ ధర్నా తర్వాత పార్లమెంటులో గళం విప్పుదాం. ఉభయ సభల్లోనూ పార్టీ సభ్యులు ఈ విషయాలపై ప్రసంగించాలి. ఏపీలో దారుణ స్థితిని అందరికీ వివరిస్తాం. యావత్ దేశం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం.రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు’ అని ఎంపీలతో జగన్ చెప్పుకొచ్చారు.
ఇలా చేద్దాం..!
‘ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలతో ఇక్కడ వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి. ఇదే విషయంపై పార్లమెంటులో నినదించాలి. అలా చంద్రబాబుకు గట్టి హెచ్చరికలు పంపాలి. లేకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్ట పడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన వ్యక్తం చేస్తాం. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్రంలో ఈ అరాచకాలు పార్టీకి పరిమితం కావు. అవి ప్రజాస్వామ్య మనుగడకే పెద్ద దెబ్బ’ అని రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలకు జగన్ నిశితంగా వివరించారు. కాగా.. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమిల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణ, మేడా రఘునాథ రెడ్డి హాజరు కాలేదు. దీంతో వీరి గైర్హాజరీపై సొంత పార్టీలోనే లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లైట్ తీస్కోండి..!
ఇదిలా ఉంటే.. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైఎస్ జగన్, వైసీపీపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. జగన్ గురించి, వైసీపీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వెచ్చిస్తే మేలు జరుగుతుందని ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. వీరి అభిప్రాయాలు విన్న సీఎం చంద్రబాబు.. జగన్ వ్యవహారంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ‘ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడో అనేది ఇప్పుడు ముఖ్యం కాదు.. మనం ఏం చేయాలనేదే ముఖ్యం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ అంశాన్ని వదిలేసి.. రాష్ట్రం గురించి ఆలోచించాలని సూచించారు. చూశారుగా.. వైఎస్ జగన్ అలా.. కూటమి ప్రభుత్వం, టీడీపీ ఎంపీలు ఇలా.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.