Share News

YS Jagan: జగన్ తొందరపడుతున్నారా.. ఆరు నెలలు కాకుండానే యుద్ధం చేస్తారా..

ABN , Publish Date - Oct 02 , 2024 | 08:27 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం దాదాపు మరో ఏడాది సమయం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కాకపోయినా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ అనుబంధ సంఘాల నాయకుల సమావేశంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అదే సమయంలో ..

YS Jagan: జగన్ తొందరపడుతున్నారా.. ఆరు నెలలు కాకుండానే యుద్ధం చేస్తారా..
YS Jagan

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో ఘోర పరాజయం తర్వాత మరో యుద్ధానికి సిద్ధం కావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మళ్లీ శాసనసభ ఎన్నికలకు నాలుగున్నరేళ్ల సమయం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం దాదాపు మరో ఏడాది సమయం ఉంది. ప్రస్తుతం ఎన్నికల సమయం కాకపోయినా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ అనుబంధ సంఘాల నాయకుల సమావేశంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అదే సమయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు. ఈలోపే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఓ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ప్రకారం నడుచుకోకపోతే ప్రశ్నించాల్సిన బాధ్యత విపక్షాలపై ఉంటుంది. ఈలోపు ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే నిలదీయాల్సిన బాధ్యత విపక్షాలదే. ఓవైపు కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చర్చ జరుగుతున్న వేళ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే చర్చ సాగుతోంది.


ఉత్సాహం నింపేందుకేనా..

వైసీపీ సీనియర్లు ఒక్కొక్కరు వైసీపీకి గుడ్‌బై చెబుతున్నారు. వలసలను నివారించడంలో జగన్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు.. వారిని యాక్టివ్ చేసేందుకు జగన్ తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. లడ్డూ వివాదంతో జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీని నుంచి బయటకు వచ్చేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేసేందుకు జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఉండొచ్చు. కానీ ప్రజలు వాస్తవాలను గమనిస్తుంటారనే విషయాన్ని విమర్శల చేసే సమయంలో విపక్ష నాయకుడు గుర్తించుకోకపోతే ఒక్కోసారి నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదు. వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహారించిన తీరును, సహాయక చర్యలను రాష్ట్రం మొత్తం ప్రశంసిస్తే జగన్ మాత్రం ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. అసత్య ఆరోపణలు చేయడం ద్వారా జగన్ తన ఇమేజ్‌ను మరింత దిగజార్చుకుంటున్నారనే చర్చ జరుగుతోంది.


తొందరపడ్డారా..

ఆరు నెలలు కాకుండానే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం ద్వారా జగన్ తొందరపడుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం పనితీరుపై ప్రజలు తీర్పునిచ్చేది ఎన్నికల సమయంలోనే. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ పాలన నచ్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పునిస్తారు. కనీసం అప్పటివరకైనా జగన్ ఓపికపట్టి ఉంటే బాగుంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటినుంచే ఆరోపణలు చేయడం ద్వారా.. ఆరు నెలల్లో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదని.. విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా జగన్‌కు రాజకీయంగా సరైన అనుభవం లేకపోవడంతోనే తొందరపాటు చర్యలకు పాల్పడుతున్నారే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 02 , 2024 | 08:27 PM