Share News

Viral News: రియల్ ‘దృశ్యం’.. నదిలో దొరికిన కారులో అస్థిపంజరాలు.. చివర్లో మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్

ABN , Publish Date - Jun 21 , 2024 | 08:26 AM

దృశ్యం సినిమాలో ‘కారు ప్రమాదం’ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం.. హీరో ఓ ఫేక్ కారు యాక్సిడెంట్‌ని క్రియేట్ చేస్తాడు. ఒక చెరువులో కారు పడేసి..

Viral News: రియల్ ‘దృశ్యం’.. నదిలో దొరికిన కారులో అస్థిపంజరాలు.. చివర్లో మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్
A Car Found With Lovers Skelotons In Dam

దృశ్యం (Drishyam) సినిమాలో ‘కారు ప్రమాదం’ ఎపిసోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం.. హీరో ఓ ఫేక్ కారు యాక్సిడెంట్‌ని క్రియేట్ చేస్తాడు. ఒక చెరువులో కారు పడేసి, ప్రమాదవశాత్తూ అది జరిగినట్లు అందరినీ నమ్మిస్తాడు. సరిగ్గా అలాంటి సన్నివేశమే రియల్ లైఫ్‌లో చోటు చేసుకుంది. ఒక నదిలో నుంచి కారు బయటపడటం, అందులో రెండు అస్థిపంజరాలు ఉండటం.. ఇప్పుడు సంచలనం రేపుతోంది. అవి వదిన, బావమరిదికి చెందినవి కావడంతో.. ఈ కథ హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


మధ్యప్రదేశ్‌లోని మొరెనాలోని క్వారీ నదిని శుభ్రపరిచేందుకు గాను అధికారులు ‘స్టాప్ డ్యామ్’ గేట్లను తెరిచారు. నీటిమట్టం తగ్గిన తర్వాత.. ఆ ప్రదేశంలో ఒక కారు కనిపించింది. నాచు, మొక్కలతో కప్పబడి ఉన్న ఈ కారుని గమనించిన గ్రామస్థులు.. దాని దగ్గరకు వెళ్లి చూశారు. అప్పుడు వాళ్లకు దిమ్మతిరిగే దృశ్యాలు ఆ కారులో కనిపించాయి. అందులో రెండు అస్థిపంజరాలు ఉండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ అస్థిపంజరాలను స్వాధీనం చేసుకొని, పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్‌లో ఆ అస్థిపంజరాల్లో ఒకటి మహిళది, మరొకటి పురుషుడిది అని తేలింది. ఆ రిపోర్ట్ ప్రకారం విచారణ చేపట్టగా.. మహిళను మిథిలేష్ జాదవ్‌గా (30), పురుషుడిని నీరజ్ సఖ్వార్‌గా (34) పోలీసులు గుర్తించారు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్ వచ్చింది.


తమకు దొరికిన సమాచారం ప్రకారం.. మిథిలేష్ ఓ వివాహిత అని, ఆమె భర్త ముఖేష్ అని పోలీసులు కనుగొన్నారు. దీంతో.. అతడ్ని సంప్రదించి విచారించగా, ఫ్యూజులు ఎగిరిపోయే వివరాలు అందించాడు. మిథిలేష్, నీరజ్ వరుసకు బావమరదలు అవుతారని.. వాళ్లిద్దరు ప్రేమించుకొని, ఇంటి నుంచి పారిపోయారని తెలిపాడు. ఫిబ్రవరి 6వ తేదీన వాళ్లు ఇంటి నుంచి వెళ్లారని పేర్కొన్నాడు. మార్కెట్‌కి వెళ్తానని చెప్పి తన భార్య బయటకు వెళ్లిందని, నీరజ్ అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఇద్దరూ ఒకేసారి మాయమవడంతో.. వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోయారని తాము గ్రహించామన్నాడు. వాళ్లిద్దరు తిరిగొస్తారని తాము వేచి చూశామని.. కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారం రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 14న మిస్సింగ్ రిపోర్టును దాఖలు చేశానని ముఖేష్ పోలీసులకు తెలిపాడు.


మరి.. ఇంటి నుంచి పారిపోయిన మిథిలేష్, నీరజ్ స్టాప్ డ్యామ్‌లో ఎలా పడ్డారు? ఇది పరువు హత్యనా? లేక ప్రమాదవశాత్తూ వారి కారు నదిలో పడిపోయి, వాళ్లు చనిపోయారా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ కేసుని ఛేధించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనే అని అనిపిస్తున్నప్పటికీ.. పరువు హత్య కోణమూ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఈ కేసులో ఎలాంటి కోణాలు బయటపడతాయో చూడాలి.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 08:26 AM