Viral: 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న కవలలు..రీల్ సీన్ కాదండోయ్.. రియల్ సీనే..
ABN , Publish Date - Jan 27 , 2024 | 03:43 PM
నటుడు నాగార్జున నటించిన హలోబ్రదర్ సినిమా సీన్ రియల్ లైఫ్ లో నిజమైంది. ఆ సినిమాలో హీరో వాళ్ల అమ్మకు కవల పిల్లలు పుట్టడం, విలన్ వల్ల ఆ పిల్లలిద్దరూ విడిపోతారు.
నాగార్జున నటించిన హలోబ్రదర్ సినిమా సీన్ రియల్ లైఫ్ లో నిజమైంది. ఆ సినిమాలో హీరో వాళ్ల అమ్మకు కవల పిల్లలు పుట్టడం, విలన్ వల్ల ఆ పిల్లలిద్దరూ విడిపోతారు. వేర్వేరు ప్రాంతాల్లో పెరిగి పెద్దవుతారు. వారికి తాము కవలలమనే విషయమే తెలియదు. కానీ ఓ సారి ఆకస్మాత్తుగా వారిద్దరూ కలుసుకుంటారు. గతాన్ని తెలుసుకుని విలన్ ను మట్టుబెట్టి తల్లిదండ్రుల చెంతకు చేరడంతో కథకు శుభం కార్డు పడుతుంది. తాజాగా జార్జియా దేశంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బీబీసీ కథనం ప్రకారం.. అజా శోని అనే మహిళ 2002లో ప్రసవానంతరం కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త తన ఇద్దరు కవల కూతుళ్లను వేర్వేరు కుటుంబాలకు విక్రయించాడు. ఆ విధంగా జార్జియా రాజధాని నగరమైన బిలిసీలో అనో సార్టానియా చేరగా.. దీనికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న జగ్‌డీడీ పట్టణంలోనే అమి ఖ్విటియా పెరిగింది.
‘జార్జియాస్ గాట్ టాలెంట్’ టీవీ షోలో పాల్గొన్న అమీ.. అచ్చంగా తన పోలికలతో ఉన్న మరో బాలిక డ్యాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయింది. ఆ అమ్మాయే తన సోదరి అని అమీకి తెలియదు. ప్రేక్షకులు మాత్రం ఇద్దరూ ఒకేలా భలే ఉన్నారే అనుకున్నారు. కొంత కాలానికి అనో కూడా ఓ టిక్‌టాక్ వీడియోలో అమీని చూసింది. దాదాపు 20 సంవత్సరాలు విడిగా పెరిగాక.. బిలిసీ నగరంలోని రస్టావెలి వంతెనపై కలుసుకొన్న అనో, అమీ తాము విడిపోయిన తీరును తెలుసుకొని అవాక్కయ్యారు. మళ్లీ కలుసుకొన్నందుకు ఆనందంలో మునిగిపోయారు.
కాగా.. దశాబ్దాలుగా జార్జియాను పట్టి పీడిస్తున్న ఓ పెద్ద సమస్యను తాజా ఇన్సిడెంట్ చర్చనీయాంశంగా మార్చింది. ఆసుపత్రుల నుంచి పిల్లలను అపహరించి, విక్రయించడం అక్కడ ఏళ్లతరబడి కొనసాగుతోంది. ఈ ఇద్దరు సోదరీమణుల్లాగే జార్జియా ఆసుపత్రుల నుంచి వేలాది చిన్నారులు దారి తప్పారని బీబీసీ కథనం పేర్కొంది.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.