Share News

Reunite: గీత ‘తల’రాత 11 ఏళ్లు కోమాలో మహిళ .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Feb 14 , 2024 | 12:07 PM

గుజరాత్‌కు చెందిన గీత అనే వివాహిత కోల్ కతాలో 11 ఏళ్ల క్రితం తప్పిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్నాళ్లూ కోమాలో ఉన్న గీతకు ఇటీవల సృహ వచ్చింది. తన కుటుంబం వివరాలు చెప్పడంతో అధికారులు వీడియో కాల్ మాట్లాడించారు. గీతతో మాట్లాడటంతో ఆ కుటుంబ సభ్యులు తెగ సంబర పడిపోయారు.

Reunite: గీత ‘తల’రాత 11 ఏళ్లు కోమాలో మహిళ .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

గోద్రా: తన కుటుంబంతో కలిసి ఓ వివాహిత పెళ్లికి వెళ్లింది. అక్కడ తప్పి పోయింది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆమె కోసం వెతికి వెతికి ఊరుకున్నారు. తిరిగి తమ గ్రామానికి (Village) వచ్చేశారు. అలా 11 సంవత్సరాలు గడచిపోయాయి. ఇటీవల ఆ కుటుంబానికి ఫోన్ వచ్చింది. తప్పిపోయిన ఆ మహిళ ఆచూకీ దొరికిందని తెలిసింది. ఆమెతో వీడియో కాల్ మాట్లాడారు. దీంతో ఆ కుటుంబం తెగ సంబర పడిపోతుంది.

ఏం జరిగిందంటే..

గుజరాత్‌ గోద్రా జిల్లా పంచమహాల్‌కు చెందిన మహిళ గీత. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. బంధువుల పెళ్లి ఉందని గీత కుటుంబం 2013లో కోల్ కతా వెళ్లింది. అక్కడ గీత తప్పి పోయింది. ఆమె కోసం వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. తర్వాత తమ స్వగ్రామం భామయ్యకు వచ్చారు. తల్లి గీతను పిల్లలు మరచిపోలేదు. గీత జ్ఞాపకాల్లో పెరిగారు. తల్లి లేకపోవడంతో వారి కుటుంబం ఇబ్బందులను ఎదుర్కొంది. ఆర్థిక పరిస్థితుల వల్ల పిల్లలు మధ్యలో చదువు ఆపివేయాల్సి వచ్చింది. ఇటీవల గీత భర్త కూడా చనిపోయాడు. ఏదో చిన్న ఆశతో పిల్లలు జీవిస్తున్నారు. ఇన్నాళ్లకు గీత ఆఛూకీ తెలిసింది.

కోమాలో 11 ఏళ్లు

పెళ్లి కోసం వెళ్లి తప్పిపోయిన గీతకు ఏం జరిగిందో తెలియదు. ఎక్కడ ఉందో తెలియదు. తర్వాత కోల్ కతా మెంటల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్నారు. 11 ఏళ్ల పాటు కోమాలో ఉన్నారు. ఇటీవల గీత కోమా నుంచి కోలుకున్నారు. తన కుటుంబ సభ్యుల వివరాలను వైద్యులకు తెలిపారు. దీంతో వారు కోల్ కతా పోలీసులకు సమాచారం అందజేశారు. గీత చెప్పిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్‌ను పోలీసులు సంపాదించారు. వారికి వీడియో కాల్ చేసి గీతతో మాట్లాడించారు.

కోల్ కతాకు గీత ఫ్యామిలీ

గీతతో మాట్లాడిన తర్వాత ఆమెను ఇంటికి తీసుకు రావాలని కుటుంబ సభ్యులు భావించారు. గీత కుటుంబం పేదరికంతో మగ్గుతుంది. దాంతో వారికి పోలీసులు సాయం చేశారు. ఓ పోలీస్ అధికారి గీత కుటుంబాన్ని గురువారం (రేపు) కోల్ కతా తీసుకెళతారు. అక్కడ గీత అప్పగింతకు సంబంధించిన లాంఛనాలు పూర్తయిన తర్వాత గ్రామానికి తీసుకువస్తారు.

మరిన్ని ప్రత్యేక కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2024 | 12:07 PM