Share News

Hyderabad: ఆ పెళ్లిళ్ల రూటే వేరయా...

ABN , Publish Date - Dec 03 , 2024 | 07:52 AM

వివాహ ఆడంబరాల విషయంలో ఇరుగు పొరుగు, బంధువర్గాల మధ్య పోటీ పెరిగిపోయింది. దాంతో హంగు ఆర్భాటాలకు హద్దులు చెరిగిపోయాయి. దీనికి కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు. భిన్న సంస్కృతుల్లో వివాహ పద్ధతులు వేరైనా, గొప్పలకు పోయి తాహతుకుమించి సొమ్ము వెచ్చించడంలో మాత్రం అందరిదీ ఒకటే తీరు.

Hyderabad: ఆ పెళ్లిళ్ల రూటే వేరయా...

- ఖురేషీల వివాహ విందులో రెండో పదార్థం వడ్డిస్తే జరిమానా

- వధువు కుటుంబంపై భారం తగ్గించేందుకు సంఘం నిబంధన

- కట్నంలేని పెళ్లిళ్లకు ఉచితంగా ఫంక్షన్‌ హాలు ఇస్తున్న సోషియో రిఫార్మ్‌ సొసైటీ

‘ఇల్లు కట్టి చూడు - పెళ్లి చేసి చూడు’ అన్నది లోకోక్తి. ఈ మహా నగరంలో సొంతింటి సంగతేమోగానీ పెళ్లి ఖర్చు మాత్రం మధ్యతరగతికి తలకుమించిన భారమే! అందులోనూ అమ్మాయిల తల్లిదండ్రుల కష్టాలు చెప్పనలవికావు. ఒకరిని చూసి మరొకరన్నట్టు వివాహ విందులు, వినోదాలకు స్థోమతకు మించి సొమ్ము వెచ్చిస్తున్నారు. తలకుమించిన భారాన్ని మీదేసుకుని అప్పుల పాలవుతున్నారు. అయితే.. కొందరు పెళ్లిళ్లలో అనవసర వ్యయాలకు స్వస్తి పలికి, ఆడంబరాలు లేని పద్ధతులకు ‘జై’ కొడుతున్నారు. వాటిని తమ సామాజిక వర్గంలో ఒక నిబంధనగా అమలు చేస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ: వివాహ ఆడంబరాల విషయంలో ఇరుగు పొరుగు, బంధువర్గాల మధ్య పోటీ పెరిగిపోయింది. దాంతో హంగు ఆర్భాటాలకు హద్దులు చెరిగిపోయాయి. దీనికి కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు. భిన్న సంస్కృతుల్లో వివాహ పద్ధతులు వేరైనా, గొప్పలకు పోయి తాహతుకుమించి సొమ్ము వెచ్చించడంలో మాత్రం అందరిదీ ఒకటే తీరు. పెట్టుపోతలు, విందు భోజనాలు తదితర పెళ్లి ఖర్చుల విషయంలో ఆడపిల్ల కుటుంబానికి మరింత భారం అవ్వడం కూడా సాధారణమే.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 21 ఏళ్ల పిల్లి మృతి.. కన్నీటి పర్యంతమైన యజమానులు


ఈ నేపథ్యంలో పెళ్లిళ్లలో అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి హైదరాబాద్‌(Hyderabad)లోని జమియాత్‌ ఉల్‌ ఖురేషీ సంఘం వినూత్న నిబంధన పాటిస్తోంది. అదేంటంటే.. పెళ్లిలో కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే వడ్డించాలి. దానికి విరుద్ధంగా వెళితే జరిమానా చెల్లించాల్సిందే! అయితే ఈ నియమం అమ్మాయి కుటుంబానికి మాత్రమే వర్తిస్తుందని ఖురేషీ కమ్యూనిటీ(Qureshi Community) సభ్యులు చెబుతున్నారు. నగరంలో లక్షకుపైగా ఖురేషీలుంటారు. వారందరి జీవనాధారం బీఫ్‌ దుకాణాల్లో పనిచేయడం.


city3.jpg

వీరిలో ఎక్కువమంది పేదరికంలో మగ్గుతున్నవారే. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి ఖర్చుల భారాన్ని మోయలేక ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అవస్థను గమనించిన సంఘం పెద్దలు ఎనిమిదేళ్ల కిందట ఒక నిబంధన రూపొందించారు. అమ్మాయి కుటుంబం సంపన్నులైనా, నిరుపేదలైనా సరే, నిఖా వేడుకలో అతిథులకు కేవలం ఒక ఆహార పదార్థాన్ని మాత్రమే వడ్డించాలని షరతు పెట్టారు. దాన్ని అతిక్రమిస్తే జరిమానా విధిస్తారు. తొలినాళ్లలో ఛాయ్‌ లేదా ఐస్‌క్రీమ్‌ ఏదో ఒకటి మాత్రమే పెళ్లిలో వడ్డించేవారట. దూరప్రాంతాల నుంచి వచ్చే బంధువులను దృష్టిలో పెట్టుకుని కొంతకాలంగా కేవలం బిర్యానీ వడ్డిస్తున్నారు.


రెండో వంటకం ఉంటే ఖురేషీ బిరాదరీ (సంఘం) నియమ నిబంధనలను ఉల్లంఘించడమే. అందుకు తగిన శిక్షనూ ఎదుర్కోవాల్సిందే. అదే వలీమాలో అబ్బాయి కుటుంబం విందు భోజనాలు ఎంత ఘనంగా నిర్వహించినా అభ్యంతరం లేదని, కేవలం అమ్మాయి కుటుంబానికే ఈ షరతు వర్తిస్తుందని సంఘానికి చెందిన అక్రమ్‌ ఖురేషీ తెలిపారు. ఏదేమైనా, ఈ నిబంధన ఖురేషీ కమ్యూనిటీలోని అమ్మాయిల తల్లిదండ్రులకు పెద్ద ఊరటే. పెళ్లి చేసి అప్పుల పాలు కానవసరం లేకుండా ఒక మంచి మార్గాన్ని ఆశ్రయించడం గొప్ప విషయమే.. కాదు ఆదర్శనీయం కూడా కదా!


కట్నంలేని పెళ్లిళ్లకు ఈ వేదిక ఉచితం

ఇదివరకు పెళ్లిళ్ళకు ఇంటిముందు పందిరి వేసేవారు. ఇరుగుపొరుగు ఇళ్లు విడిది అయ్యేవి. ఇప్పుడలా సాధ్యమా! నగరంలో పెళ్లి ముహూర్తానికన్నా ముందు ఫంక్షన్‌ హాల్‌ (వివాహ వేదిక)ను నిర్ణయించుకోవడం ముఖ్యం. వాటి అద్దె స్థాయిని బట్టి వేల నుంచి లక్షల్లో ఉంటుంది. ఇదే పెళ్లి ఖర్చులో సింహభాగం అవుతుంది. అలాంటిది నగరం నడిబొడ్డున మెహిదీపట్నంలో రోజుకు వేల రూపాయల అద్దె వచ్చే తన అమాన్‌ ఎయిర్‌ కండిషన్డ్‌ ఫంక్షన్‌ హాల్‌ను వివాహ వేడుకలకు సోషియో రిఫార్మ్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆజ్మత్‌ ఉల్లా ఖాన్‌ ఉచితంగా ఇస్తున్నారు.

city3.3.jpg


అయితే ఆడపిల్ల కుటుంబం నుంచి కట్నకానుకలు తీసుకోని వారికి మాత్రమే ఈ అవకాశమని తెలిపారు. ఇంకొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఆ వివాహ వేడుకల్లో సంగీత, నృత్య కార్యక్రమాలు, మద్యం పార్టీలను అనుమతించరట. ముస్లింలకే కాదు, హిందు, క్రిస్టియన్‌.. ఎవరైనా సరే, తమ షరతులకు అనుగుణంగా వివాహ వేడుకలు చేసుకునేవారికి ఫంక్షన్‌ హాల్‌ను ఉచితంగా ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. నిఖా జరిగిన రోజే వలీమా చేసుకోవాలన్నది ముస్లింలకు మాత్రమే వీరు విధించిన షరతు. వీడియోగ్రాఫర్లను అనుమతించరు. 2019 నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి ఫంక్షన్‌ హాల్‌ను ఉచితంగా కేటాయించినట్లు వారు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2024 | 08:19 AM