Share News

Ayodhya: భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య రాముడి దర్శన వేళలు పొడిగింపు..

ABN , Publish Date - Jan 24 , 2024 | 05:36 PM

అతిరథ మహారథుల మధ్య అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

Ayodhya: భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్య రాముడి దర్శన వేళలు పొడిగింపు..

అతిరథ మహారథుల మధ్య అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రోజు భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి 11 గంటలు కాకుండా 15 గంటల పాటు భక్తులకు దర్శనమివ్వనున్నాడు బాలరాముడు. భోగ్ ప్రసాద్, హారతి వంటి వైదిక కార్యక్రమాల కోసం కొంత సమయం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ విధానం తక్షణమే అమలులోకి వస్తుందని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది.

ఉదయం ఎనిమిది గంటలకు బదులుగా ఏడు గంటల నుంచే రామ్ లల్లా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 11.30 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం భోగ్ హారతి సమయాన్ని కూడా తగ్గించారు. రాత్రి 10 గంటల వరకు దర్శనం కొనసాగుతుందని తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా వృద్ధులు, వికలాంగుల దర్శనాలను ఇప్పటికే నిలిపివేశారు. రెండు వారాల తర్వాత రావాలని కోరారు. ఇప్పుడే కాకుండా కొన్ని రోజులు ఆగి అయోధ్యకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడో రోజున సైతం రామయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ఆలయంలో ఏర్పాట్లను, భక్తుల రద్దీ కారణంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్య వెళ్లగా.. ఇవాళ మరోసారి వెళ్లనున్నారు. ఆయన కంటే ముందే ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ప్రసాద్, లా అండ్ ఆర్డర్ డీజీ ప్రశాంత్ కుమార్, స్థానిక అధికారులు ఆలయానికి చేరుకున్నారు. వీరందరూ ఆలయంలోనే మకాం వేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 05:36 PM