Share News

Tatkal Tickets: తత్కాల్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చా.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:51 PM

భారతీయ రైల్వే ద్వారా రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాబట్టి కన్ఫార్మ్ టికెట్ దొరకడం అందరికీ సాధ్యం కాదు.

Tatkal Tickets: తత్కాల్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చా.. రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

భారతీయ రైల్వే ద్వారా రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కాబట్టి కన్ఫార్మ్ టికెట్ దొరకడం అందరికీ సాధ్యం కాదు. టికెట్ కోసం నెలల ముందు నుంచే బుక్ చేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టికెట్లు కూడా కన్ఫార్మ్ కావు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసేందుకు భారతీయ రైల్వే.. తత్కాల్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రయాణానికి ఒక రోజు ముందు టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. కొన్నిసార్లు విపరీతమైన డిమాండ్ కారణంగా తత్కాల్ కూడా కన్ఫర్మ్ అవడం కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తత్కాల్ టిక్కెట్‌ను రద్దు చేయవచ్చా లేదా, టికెట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జీ ఎంత అనే అనుమానాలు మెదులుతాయి.

తత్కాల్ టికెట్ రద్దు చేయవచ్చా?..

ఇతర టిక్కెట్ల మాదిరిగానే తత్కాల్ టికెట్ కూడా రద్దు చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్ రద్దు చేస్తే మనం పే చేసిన టికెట్ ఫేర్.. మనకు తిరిగి ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. టికెట్‌ను రద్దు చేయడానికి గల కారణాలపై ఇది ఆధారపడి ఉంటుంది. రైలు బయలుదేరే రైల్వే స్టేషన్ నుంచి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే తత్కాల్ టికెట్‌ను రద్దు చేయడం ద్వారా వాపసును క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం టీడీఆర్ రశీదును తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో రైల్వే క్లరికల్ ఛార్జీలను మాత్రమే తీసివేసి మిగతా ఎమౌంట్ ను తిరిగి ఇస్తుంది. రైలు రూట్ మారినా, ఆ మార్గంలో ప్రయాణించకన్నా.. టికెట్‌ను రద్దు చేసి వాపసు క్లెయిమ్ చేయవచ్చు.


ఇవీ టికెట్ రద్దు నిబంధనలు..

తత్కాల్ టికెట్‌ను బుక్ చేసిన తర్వాతా బుక్ చేసిన రిజర్వేషన్ క్లాస్‌లో సీటును ఇవ్వలేకపోతే టికెట్ రద్దుపై వాపసు క్లెయిమ్ చేయవచ్చు. తాను బుక్ చేసుకున్న తరగతికి కాకుండా అంతకంటే దిగువ కేటగిరీకి టికెట్ కన్ఫార్మ్ చేసినప్పుడు ప్రయాణించేందుకు ఇష్టపడకపోతే.. తత్కాల్ టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు. వాపసూ క్లెయిమ్ చేయవచ్చు. కుటుంబంలోని కొంతమందికి టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యి మరికొన్ని వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే ప్రయాణీకులందరూ టిక్కెట్‌ను రద్దు చేసి వాపసు పొందవచ్చు. అయితే రైలు బయలుదేరే 6 గంటల ముందు టికెట్‌ను రద్దు చేయాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

వెయిటింగ్ టికెట్ వాపసు..

వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే వెంటనే ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. 3 నుంచి 4 రోజుల్లో డబ్బు జమవుతాయియ. ఇందులోనూ పూర్తి డబ్బు వాపసు రాదు. బుకింగ్ ఛార్జీ మినహా మిగతా డబ్బు క్రెడిట్ అవుతుంది. బుకింగ్ ఛార్జ్ అనేది రైలు, దాని తరగతిపై ఆధారపడి ఉంటుంది.

Updated Date - Jan 08 , 2024 | 01:51 PM