Share News

తరాల సౌరభం.. మహా ప్రసాదం...!

ABN , Publish Date - Oct 06 , 2024 | 10:15 AM

తిరుమల ప్రసాదాలు అనేకం క్రీ.శ. 830 నుంచి ఉనికిలో ఉన్నట్టు శాసనాధారాలున్నా, ప్రస్తుతం ఉన్న రూపంలోని లడ్డూ ప్రస్తావన మాత్రం 1940ల నుంచే ఉంది. అంతకు మునుపు బూందీ రూపంలో ప్రసాదంగా ఉండేది.

తరాల సౌరభం.. మహా ప్రసాదం...!

ప్రసాదం ఏదైనా అరచేతిలో చిటికెడు పెడితే కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటాం. అది తిరుపతి లడ్డూ అయితే మాత్రం చిటికెడుతో సరిపెట్టుకోలేం. శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూకి భక్తితో పాటూ రుచి కూడా ఒక విశిష్టమైన లక్షణమే.

అందుకే ఏ దేవుడి ప్రసాదానికీ లభించని పేటెంట్‌ తిరుపతి లడ్డూకి లభించింది. కల్తీనెయ్యి కలకలంతో మరోమారు ప్రపంచవార్తగా నిలిచింది.. ఈ సందర్భంగా శ్రీవారి లడ్డూ విశేషాలు..


లడ్డూ ఎప్పటిది?

తిరుమల ప్రసాదాలు అనేకం క్రీ.శ. 830 నుంచి ఉనికిలో ఉన్నట్టు శాసనాధారాలున్నా, ప్రస్తుతం ఉన్న రూపంలోని లడ్డూ ప్రస్తావన మాత్రం 1940ల నుంచే ఉంది. అంతకు మునుపు బూందీ రూపంలో ప్రసాదంగా ఉండేది. మనోహరం అనే పేరుతో క్రీ.శ 1843 - క్రీ.శ 1933 మధ్యకాలంలో (మహంతుల పాలనలో) శెనగపిండి, బెల్లంపాకంతో తయారుచేసిన తియ్యటి బూందీ ప్రసాదాన్ని భక్తులకు పంచేవారు. క్రీ.శ. 1480లో శ్రీవారి ప్రసాదాల్లో తియ్యటి పిండి పదార్ధం అంటూ ‘మనోహరం’ ప్రస్తావన శాసనాల్లో ఉంది. మహంతుల కాలంలోని బూందీ, ఇదీ ఒక్కటేనా కాదా అనేది నిర్ధారణ కాలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెంట తీసుకువెళ్లడానికి అనువైన ప్రసాదం తయారు చేసే క్రమంలోనే బూందీ వచ్చింది. ఆ సమయంలోనే (1803లో) వడ కూడా ప్రసాదంగా మొదలైంది. ఈ రెండూ ఎక్కువ రోజులు నిల్వ ఉండే ప్రసాదాలు కావడంతో భక్తులకు ప్రీతిపాత్రం అయ్యాయి.


- పల్లవుల కాలం నుంచే ..

శ్రీవారికి క్రీ.శ.830 పల్లవ రాజవంశీకుల కాలం నుంచే సంధి నివేదన పేరుతో ప్రసా దాలను సమర్పించే ఆనవాయితీ మొదలైనట్టు తిరుచానూరు, గోవిందరాజ స్వామి ఆలయాల్లో లభించిన శాసనాల ద్వారా స్పష్టమవుతోంది. క్రీ.శ 1424-46 మధ్య రెండవ దేవరాయల పరిపాలనా కాలంలో స్వామికి నివేదించే ప్రసాదాల రకాలు, పరిణామాలు పెరిగాయి. ఆ క్రమంలోనే నైవేద్య వేళలను కూడా ఖరారు చేశారు. తిరుప్పొంగం అనే ప్రసాదాన్ని ప్రవేశపెట్టినట్టు కూడా శాసనాల్లో ఉంది. క్రీ.శ 1444లో సుఖీయం, క్రీ.శ 1455లో అప్పం, క్రీ.శ 1461లో వడ, క్రీ.శ 1469లో అత్తిరసం పేర్లతో ప్రసాదాలు తయారు చేసి స్వామికి నివేదించారనే అంశం శాసనగ్రస్తమై ఉంది. అలాగే క్రీ.శ 1480లో మనోహరం అనే తియ్యటి పిండి పదార్థం సహా 30 రకాల ప్రసాదాలను శ్రీవారికి నివేదించేవారని పలు శాసనాల్లో ఉన్నట్టు భారత పురావస్తుశాఖ అధ్యయనంలో వెల్లడైంది. ప్రసాదాల తయారీ కోసం ఎందరో రాజులు, మహారాణులు బంగారు, వెండి గిన్నెలు, పాత్రలు సమర్పించారని, భూములను కూడా ఇచ్చినట్టు ఈ శాసనాల్లో పేర్కొన్నారు.

mag8.1.jpg


- లడ్డూ దిట్టానికి ఆమోదం

లడ్డూ తయారీకి వినియోగించే సరుకుల మోతాదును దిట్టం అంటారు. 1948-51లో తొలిసారిగా లడ్డూ దిట్టానికి అధికారిక ఆమోదం లభించింది. ఆతర్వాత పలు సందర్భాల్లో దిట్టంలో మార్పులు చేసుకుంటూ వచ్చారు. తాజాగా 2001లో అప్పటి స్పెసిఫైడ్‌ అథారిటీ దిట్టాన్ని సవరించింది. దానినే నేటికీ కొనసాగిస్తున్నారు. దీన్నే పడితరం దిట్టం స్కేల్‌ అంటారు.

- ఏవి ఎంత మోతాదులో ?

ఈ దిట్టం ప్రకారం 5,100 లడ్డూలుతయారు చేయడానికి.. ఆవునెయ్యి 108 కిలోలు, శనగపిండి 200 కిలోలు, చక్కెర 400 కిలోలు, జీడిపప్పు 35కిలోలు, ఎండుద్రాక్ష 17.5 కిలోలు, కలకండ 10కిలోలు, యాలకులు 5కిలోలు ఉపయోగిస్తారు. మొత్తం 851కిలోల సరుకులను విని యోగించి 5,100 లడ్డూలు తయారు చేస్తారు.


- లడ్డూ ఇలా చేస్తారు..

ఆలయం లోపల ఉండే పోటులో బూందీని తయారు చేసి పాకంలో కలుపుతారు. దానిని ఆరక ముందే ఉండలుగా చేస్తారు. తొలి రోజుల్లో కట్టెలపొయ్యిలపైనే బూందీని తయారు చేసేవారు. లడ్డూల సంఖ్య పెంచాల్సి రావడంతో ఆస్థానంలో గ్యాస్‌స్టవ్‌లు ప్రవేశించాయి. 2008 దాకా రోజుకి 45 నుంచి 50 వేల లడ్డూలకు సరిపడా బూందీని మాత్రమే తయారు చేయగలిగేవారు. భక్తుల నుంచి డిమాండ్‌ పెరగడంతో అదే సంవత్సరంలో ఆలయం వెలుపల వాయవ్యదిశలో బూందీ తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోని 48 ఎల్‌పీజీ స్టవ్‌లు మీద బూందీని తయారుచేసి కన్వేయర్‌బెల్టు ద్వారా ఆలయంలోపలికి పంపు తారు. లోపల శ్రీవైష్ణవ పోటు కార్మికులతో లడ్డూ తయారుచేస్తారు. ఇలా తయారైన లడ్డూలను మళ్లీ కన్వేయర్‌బెల్ట్‌ ద్వారానే ఆలయం వెలుపలకు చేరుస్తారు. లడ్డూ కౌంటర్లలో వీటిని భక్తులకు విక్రయిస్తారు.


- కట్టెల పొయ్యి పోయి...

సాధారణ స్టవ్‌లపై భారీ బాండీలను పెట్టి నెయ్యిని వేడి చేస్తూ బూందీని తయారుచేస్తున్న క్రమంలో నెయ్యి కిందపడటం, స్టౌవ్‌ల నుంచి అధిక వేడి, మంటలు రావటంతో 2010-20 మధ్య అనేక అగ్నిప్రమాదాలు చోటుచేసు కున్నాయి. పోటు సిబ్బంది కూడా తీవ్రమైన వేడికి ఆనారోగ్యం పాలవుతున్నట్టు గుర్తించారు. దీంతో బూందీ తయారీ కేంద్రం పక్కనే 2021 లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 40 థర్మిక్‌ ఫ్లూయిడ్‌ స్టవ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు లడ్డూలు వీటి మీద తయారవుతున్నాయి.

- శ్రీవైష్ణవుల చేతుల్లోంచి..

ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం లోని పోటులోనే లడ్డూలు పట్టాలి. పోటు ముందు శ్రీనివాసుడి తల్లి వకుళమాత విగ్రహం ఉంటుంది. ఆమె ప్రసాదాల తయారీని పర్యవేక్షిస్తుందని విశ్వసిస్తారు. ఆలయంలోపలి పోటులో లడ్డూలు పట్టే పనిలో శ్రీవైష్ణవులు మాత్రమే ఉంటారు. నిజానికి శ్రీవారి పోటుల్లో మొత్తం 643 మంది కార్మికులున్నా వీరిలో 594 మంది లడ్డూల తయారీ పనిలోనే ఉంటారు. 394 మంది శ్రీవైష్ణవులు మాత్రమే ఆలయంలోని పోటులో లడ్డూలు పడతారు.

mag8.2.jpg


- పెద్ద లడ్డూ భలే రుచి

స్వామి లడ్డూల్లో ఆస్థానం లడ్డు, కల్యాణో త్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని మూడు రకాలుంటాయి. ఆస్థానం లడ్డూలను గతంలో కేవలం ప్రత్యేక ఉత్సవాల సమయంలో మాత్రమే తయారు చేసి అతిథులకు ఇచ్చే వారు. దీని బరువు 750 గ్రాములు, దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదుకన్నా ఎక్కువ నెయ్యి, కుంకుమపువ్వు, జీడిపప్పుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇదే ఆ తర్వాత కల్యాణోత్సవం లడ్డూగా పేరు పొందింది. ఈ లడ్డూలను కల్యాణోత్సవం, ఇతర ఆర్జితసేవల్లో పాల్గొనే భక్తులకు ఇస్తారు. ఇది సాధారణ లడ్డూకంటే కూడా రుచిగా ఉంటుంది.

- ఎనిమిది అణాల నుంచి.,.

అత్యధికంగా తయారయ్యేది సాధారణ లడ్డూలే. భక్తులకు విక్రయించే ఈ లడ్డూ 175గ్రాములు బరువుంటుంది. 1940 ప్రాంతంలో ఈ లడ్డూ ఇంకా పెద్దదిగా ఉండేదంటారు. ఆరోజుల్లో దీని ధర ఎనిమిది అణాలే. తర్వాత దాని పరిమాణం తగ్గడంతో పాటు ధర కూడా పెరుగుతూ వచ్చింది. రూ.2, రూ.4, రూ.5, రూ.10కి చేరి 2007లో రూ.25కు చేరుకుంది. దాని తర్వాత 2020లో ఏకంగా లడ్డూ ధర రూ.50కు పెరిగింది.


- మాన్యాలు.. మిరాశీ

ఒకప్పుడు అర్చకులు, జీయంగార్లలో కొందరికి మాన్యాలిచ్చి ప్రసాదాలను తయారు చేయించేవారని తిరుమలక్షేత్ర ప్రాంత పరిపాలన కేంద్రమైన ఉత్తర ఆర్కాట్‌ జిల్లా అధికారి జిజె స్టార్టన్‌ దొర రూపొందించిన సవాల్‌-ఎ-జవాబ్‌ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 1933లో టీటీడీ పరిపాలన మొదలైన తర్వాత మిరాశీ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి మహంత్‌ ప్రయోగ్‌ దాస్‌జీ, కమిషనర్‌ ఆధ్వర్యంలో ఆలయ పేష్కార్‌ చెలికాని అన్నారావు లడ్డూలను తయారుచేసే మిరాశీదారులకు డబ్బులు బదులుగా లడ్డూలే ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ విధానం ప్రకారం శ్రీవారి వంటశాలలో తయారుచేసే ప్రతి 51 లడ్డూలకు గాను 11 లడ్డూలు మిరాశీదారులకే ఇచ్చేవారు. ఈవిధానం ద్వారా రోజుకు వెయ్యి లడ్డూలను తయారు చేసే మిరాశీదారులు 1990 నాటికి సుమారు లక్ష లడ్డూలను తయారు చేసే స్థాయికి చేరుకున్నారు. వీటిలో పెద్ద వాటా అర్చకులకే దక్కేది. 1996 మార్చి 16న సుప్రీం కోర్టు శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థను రద్దు చేయడంతో ఈ విధానం అంతరించింది. టీటీడీ స్వయంగా లడ్డూలను తయారు చేయించే విధానానికి శ్రీకారం చుట్టింది.


- ప్రసాదాలకు పేటెంట్‌ ..

2009 సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి లడ్డూకి మేధో సంపత్తి (పేటెంట్‌) హక్కులు టీటీడీకి లభించాయి. ప్రపంచంలోనే ప్రసా దానికి పేటెంట్‌ పొందిన ఏకైక దేవాలయంగా తిరుమల చరిత్రకెక్కింది. దీనికి ముందే భౌగో ళిక ఉత్పత్తి అనుమతి(జీఐ) కూడా లడ్డూకి లభించింది. తిరుమల లడ్డూ చిత్రంతో భారత ప్రభుత్వం స్టాం పును కూడా విడుదల చేసింది.

- జగదీష్‌ జంగం

తిరుమల


లడ్డూ బడ్జెట్‌ రూ.493 కోట్లు

లడ్డూలకు టీటీడీ ఏడాదికి రూ. 493 కోట్లు కేటాయిస్తోంది. దాదాపు 12.5 కోట్ల లడ్డూలు తయారవుతాయి. వీటి విక్రయం ద్వారా రూ. 544 కోట్లు లభిస్తోంది.

టన్నులకు టన్నుల దినుసులు

లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ కోసం దినుసులను భారీ ఎత్తున కొనుగోలు చేస్తారు. నెలకి.. 4.50 లక్షల కిలోల నెయ్యి వినియోగిస్తారు. 3 వేల కిలోల శనగపప్పు, 1.50 లక్షల కిలోల జీడిపప్పు, 1.55 లక్షల కిలోల బాదం పప్పు, 10.50 లక్షల కిలోల చక్కెర, 13,500 కిలోల యాలకులు, ఎండుద్రాక్ష 45 వేల కిలోలు, కలకండ 36 వేల కిలోలు అవసరం అవుతాయి. వీటిలో 70 శాతం లడ్డూల తయారీకే వినియోగిస్తారు.

Updated Date - Oct 06 , 2024 | 10:25 AM