Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్! ఇదెలా సాధ్యమంటే..
ABN , Publish Date - Sep 15 , 2024 | 08:32 PM
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నుంచే తాను ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ తాజాగా పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటు వేయడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని (ఐఎస్ఎస్) నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమన్స్, బారీ విల్‌మోర్‌ల తిరుగుప్రయాణం బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాల కారణంగా వాయిదా పడింది. ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన వారిని నాసా వచ్చే ఏడాది భూమ్మీదకు సురక్షితంగా చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోనే తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ విషయాన్ని సునీతా విలియమ్స్ స్వయంగా చెప్పారు. ‘‘ఓటు వేయడం ప్రజల బాధ్యత. ఇక అంతరిక్షం నుంచి ఓటు వేయడం నాకు దక్కిన అద్భుత అవకాశం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. (Sunita Williams to vote from Space)
Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..
ఇదెలా సాధ్యమంటే..
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, అంతరిక్షంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం నాసా ఉద్యోగులకు 1997 నుంచి అందుబాటులో ఉంది. ఈ హక్కును కల్పిస్తూ అప్పట్లో టెక్సాస్ రాష్ట్రం ఓ చట్టాన్ని తెచ్చింది. ఈ ప్రక్రియలో భాగంగా జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని మిషన్ కంట్రోల్ కేంద్రం నుంచి ఐఎస్ఎస్‌లోని వ్యోమగాములకు ఎన్‌క్రిప్షన్ చేసిన ఎలక్ట్రానిక్ బాలెట్‌ను పంపిస్తారు. దీన్ని తెరిచేందుకు వీలుగా వారికి పాస్‌వర్డ్స్‌ను ఈమెయిల్‌లో పంపిస్తారు. వీటి సాయంతో ఆస్ట్రోనాట్స్ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆ తరువాత ఎలక్ట్రానిక్ బాలెట్స్‌ను తిరిగి భూమికి పంపిస్తారు.
Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?
ఇప్పటికే పలువురు నాసా వ్యోమగాములు అంతరిక్షంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న తొలి వ్యోమగామిగా డేవిడ్ వుల్ఫ్ నిలిచారు. మిర్ అంతరిక్ష కేంద్రంలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2020లో మరో వ్యోమగామి కేట్ రూబిన్స్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఓటు వేశారు. ఇక ఎలక్ట్రానిక్ బాలెట్ల కోసం తాము ఇప్పటికే అభ్యర్థన పంపించినట్టు నానా ఆస్ట్రోనాట్ బారీ విల్‌మోర్ తాజాగా మీడియాకు తెలిపారు.