MP: అత్యాచార బాధితురాలి పెళ్లిని అడ్డుకున్న నిందితుడు.. యువతిని ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి..
ABN , Publish Date - May 31 , 2024 | 07:47 PM
అత్యాచార బాధితురాలి పెళ్లిని అడ్డుకునేందుకు నిందితుడు నానా రభసా సృష్టించాడు. యువతి కుటుంబసభ్యులపై దాడి చేయడంతో ఆమె తండ్రి కాలు, సోదరుడి చేయి విరిగాయి. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఓ అత్యాచార బాధితురాలు. పాత గాయాన్ని మరిచి కొత్త జీవితంలో కాలుపెడతామనుకుంది. పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలిసిన నిందితుడు మరోసారి ఆమెకు నరకం చూపించాడు. సరిగ్గా పెళ్లి రోజున ఆమె ఇంటికి వెళ్లి నానా యాగీ చేశాడు. ఆమెను కిడ్నాప్ చేస్తానంటూ కత్తితో బెదిరిస్తూ పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మధ్యప్రదేశ్‌లో (Madhyapradesh) అశోక్ నగర్ జిల్లాలో గురువారం ఈ ఘటన వెలుగు చూసింది.
Viral: తనకో గర్ల్‌ఫ్రెండ్ వెతికిపెట్టమన్న యువకుడికి పోలీసుల రిప్లై చూస్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు సలీమ్ ఖాన్ అలియాస్ ఖాలూ అంతకుముందు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని వీడియోలో చిత్రీకరించి ఆమె పరువును బజారుకీడ్చే ప్రయత్నం చేశాడు. యువతికి మళ్లీ పెళ్లి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చి వేళ్లాడు. ఇదిలా ఉంటే తాజాగా యువతి మరోసారి పెళ్లికి సిద్ధమైంది. ఇది తెలిసిన సలీమ్ ఖాన్.. జోధా, సమీర్, షారుఖ్‌ఖాన్‌లతో కలిసి యువతి ఇంటికి వెళ్లి వివాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు (Sword In Hand MP Man Gate Crashes Wedding Of Woman He Raped).
పెద్ద తల్వార్‌తో సలీమ్ ఆమెను బెదిరిస్తూ ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చాడు. యువతి కుటుంబసభ్యులపై నిందితులు దాడికి దిగడంతో ఆమె తండ్రి కాలు, ఆమె సోదరుడి చేయి విరిగాయి. తమకు అడ్డువస్తే ఎవరినీ లెక్కచేసేది లేదంటూ నిందితులు ఇరుగుపొరుగుపై కూడా రెచ్చిపోయారు. ఈలోపు చుట్టుపక్కల ఉండేవారందరూ అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో బెదిరిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడం కలకలానికి దారితీసింది. మరోవైపు, బాధితురాలు, ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. అత్యాచారం, కిడ్నాప్‌కు యత్నం, తండ్రిని గాయపరచడం, దుర్భాషలాడటం తదితర అభియోగాలతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. .