Kamala Harris: కమలా హారిస్ మా బిడ్డే.. తమిళనాడులోని ఈ కుగ్రామంలో మిన్నంటిన సంబరాలు
ABN , Publish Date - Nov 02 , 2024 | 12:22 PM
కమలా హ్యారిస్ పూర్వీకుల గ్రామమైన తులసేంద్రపురంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా ఆమె పోస్టుర్లు, ఏ నోట విన్న ఆమె ప్రస్తావనే వినవొస్తోంది. కమల తాత ఇక్కడే జన్మించడంతో గ్రామస్తులందరూ కమలను తమ బిడ్డగా భావిస్తూ ఆమె గెలుపును మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అది తమిళనాడులోని ఓ కుగ్రామం. పేరు తులసేంద్రపురం. రాజధాని చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోస్టర్లే. అక్కడ ప్రతి ఒక్కరూ కమలా హారిస్ పేరు తలుచుకుని గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. ఆమె గెలవాలంటూ గుళ్లల్లో పూజలు చేస్తున్నారు. సముద్రాల ఆవల ఉంటున్న కమలా హారిస్‌పై (USA) ఇక్కడి వారు ఇంతటి ఆప్యాయత కురిపించడానికి కారణం ఆమె మూలాలు తులసేంద్రపురంలో ఉండటమే!
Viral: ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు! జనవరిలో ప్రమాణస్వీకారం! ఎందుకంటే..
కమలా తాత పీవీ గోపాలన్ స్వగ్రామం తులసేంద్రపురం. ఆరేళ్ల వయసులో తల్లితోపాటు ఇండియాకు తనకు బీచ్‌లో తాత చేయి పట్టుకుని నడిచిన జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని కమలా హారిస్ ఓ సందర్భంలో చెప్పారు. కమల తల్లి శ్యామలా గోపాలన్ బ్రెస్ట్ క్యాన్సర్ పరిశోధకురాలు. ఆమె మద్రాస్‌లో పుట్టారు. 19 ఏళ్ల వయసులో స్కాలర్ షిప్‌పై పైచదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడే కమలా, ఆమె సోదరి మాయ జన్మించారు. 2009లో తల్లి అస్తికలను సముద్రంలో కలిపేందుకు కమల ఇండియాకు వచ్చారు. ఇక ఉపాధ్యక్ష బాధ్యతలతో బిజీ అయ్యాక ఆమె ఇండియాకు రాలేదు.
అయితే, గ్రామస్తులందరూ కమలను తమ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అమెరికాలో ఉన్నతస్థానాలు అధిరోహిస్తూ కమల తమ గ్రామం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయేలా చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఆమె మా గ్రామానికి ఎంతో పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. కొన్ని వందల ఏళ్లుగా ఎవరూ మా గ్రామానికి ఇంతటి గుర్తింపు తేలేదు. అసలు ఇది ఊహించనలివి కాకుండా ఉంది. ఆమె కారణంగా మేము వరల్డ్ ఫేమస్ అయిపోయాము. మా దీవెనలు ఎప్పటికీ ఆమె వెన్నంటే ఉంటాయి’’ అని 80 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఒకరు తెలిపారు. ఆమె అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము’’ అని స్థానిక షాపు యజమాని ఒకరు వ్యాఖ్యానించారు. తమ గ్రామాన్ని కమల గుర్తుపెట్టుకుంటే చాలని వ్యాఖ్యానించారు. వాస్తవానికి కమల తన ప్రసంగాల్లో తులసేంద్రపురాన్ని ఎప్పుడూ ప్రస్తావించకపోయినప్పటికీ గ్రామస్థుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. కమల తాత అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అని, అదే లక్షణాలు ఆయన కూతుళ్లు శ్యామల, సరళ, మనవరాలు కమలకు వచ్చాయని చెబుతున్నారు.
US Elections: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాలే కీలకం.. ఇవే డిసైడ్ చేస్తాయా..
ప్రస్తుతం కమల బంధువుల ఎవరూ ఆ గ్రామంలో లేరు. ఆమె తాత పుట్టిన చోట ప్రస్తుతం ఖాళీ స్థలం మాత్రమే ఉంది. అయితే, గ్రామంలోని 300 ఏళ్ల నాటి గుడిలోని శిలాఫలకంపై మాత్రం కమల కుటుంబం పేరు చెక్కి ఉంది. 2014లో ఆమె బంధువుల్లో ఒకరు కమల పేరిట 5 వేల రూపాయలను విరాళంగా ఇచ్చిన సందర్భంగా ఈ శిలా ఫలకం ఏర్పాటు చేశారు.
ఇక అధ్యక్ష రేసులో కమల దిగడంతో తులసేంద్రపురంలో కూడా ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఆమె గౌరవార్థం ఇప్పటికే అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటర్ ట్యాంక్, వాన నీటిని ఒడిసిపట్టే వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను నిర్మిస్తున్నారు. కమలా హ్యారిస్ పేరిట ఓ బస్ స్టాప్ కూడా నిర్మిస్తున్నారు. ‘‘ఆమె గెలిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము. ఆమె మాకెంతో గర్వకారణం’’ అని కార్యక్రమాలకు నిధులందిస్తున్న స్థానిక బ్యాంక్ మేనేజర్ ఎన్. కమకోడి తెలిపారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారా అని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ తమ బిడ్డే ఆ పదవి చేపట్టాలని గ్రామస్తులందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు.
Read Latest and International News