Share News

New Year 2025: ఈ ఏడాది కలిసి రాలేదా.. ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అదృష్టం మీ అడ్రస్ వెతుక్కుంటూ రావల్సిందే..

ABN , Publish Date - Dec 28 , 2024 | 02:35 PM

మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది ముగియబోతోంది. 2025వ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. 2024 సంవత్సరం బాగా కలిసొచ్చిందని కొందరు అనుకుంటే.. తమకు అసలు కలిసి రాలేదని మరికొందరు అనుకుంటుంటారు. కొందరికి 2024 ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చి ఉండొచ్చు. తమకు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదని బాధపడేవాళ్లుంటారు. ఏది ఏమైనా జరిగిపోయిన కాలం తిరిగిరాదు. అందుకే ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. వచ్చే ఏడాదిలో అయినా.. సక్సెస్ ట్రాక్ ఎక్కాలని కోరుకునేవారు ఏం చేయాలంటే..

New Year 2025: ఈ ఏడాది కలిసి రాలేదా.. ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో అదృష్టం మీ అడ్రస్ వెతుక్కుంటూ రావల్సిందే..
2025 New Year

మరో నాలుగు రోజుల్లో ఈ ఏడాది ముగియబోతోంది. 2025వ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమవుతోంది. 2024 సంవత్సరం బాగా కలిసొచ్చిందని కొందరు అనుకుంటే.. తమకు అసలు కలిసి రాలేదని మరికొందరు అనుకుంటుంటారు. కొందరికి 2024 ఎన్నో చేదు జ్ఞాపకాలు మిగిల్చి ఉండొచ్చు. తమకు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదని బాధపడేవాళ్లుంటారు. ఏది ఏమైనా జరిగిపోయిన కాలం తిరిగిరాదు. అందుకే ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. వచ్చే ఏడాదిలో అయినా అంతా మంచే జరగాలని కోరుకుందాం. ఈ ఏడాది అందించిన చేదు అనుభవాలను పాఠాలుగా అంగీకరించండి. తీపి గురుతులను అపురూప జ్ఞాపకాలుగా, భవిష్యత్ లక్ష్యాలకు ఇంధనంగా మలుచుకుని ముందుకు సాగండి. కొంతమందికి ఈ ఏడాది వ్యక్తిగతంగా, వృత్తిగతంగా సంతృప్తిని ఇచ్చి ఉండకపోవచ్చు. అందుకు కారణమేంటో విశ్లేషించుకోండి. నిత్యం గతాన్ని తలుస్తూ, అందులోనే జీవిస్తూ ఉండకుండా ప్రతిరోజును ఇదే చివరిరోజని తలచుకుని చేయాలనుకున్న పనులన్నీ చేసేయండి. ఈ కింది సూచనలను పాటిస్తూ ముందుకెళితే కొత్త సంవత్సరంలో అదృష్టం మీ అడ్రస్ వెతుక్కుంటూ రావల్సిందే..


కొత్త సంవత్సరంలో కలిసి రావాలంటే..

ఈ ఏడాది కలిసి రాలేదు, తనకు దురదృష్టం తప్ప అదృష్టం లేదని చాలా మంది గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడుతుంటారు. ఇలా చేయడం వలన వ్యక్తిలో నెగిటివ్ ఫీలింగ్ బలపడుతుందని, దీంతో జీవితం అంధకారంగా మారిపోయినట్టు అనిపించి నిరాశ, నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదముందని కొందరు సైకాలజిస్టులు చెబుతున్నారు. సాధారణంగా ఏ ఏడాదైనా మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది మనిషి ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్‌గా ఆలోచిస్తున్నామా.. నెగిటివ్‌గా ఆలోచిస్తున్నామా అనేదే మన భవిష్యత్తుకు పునాది అవుతుందని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే మన ఆలోచనలు పాజిటివ్‌గా ఉంచుకుంటే కొత్త ఆశలు చిగురించి భావిజీవితానికి బాసటగా నిలుస్తాయి. కొత్త సంవత్సరంలోనైనా మంచి జరగాలని భావిస్తూ ప్రయత్నాలు మొదలుపెడితే అదృష్టమూ మీ వెన్నంటే వస్తుంది.


అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ..

తాను అనుకున్నది సాధించాలని ప్రతి వ్యక్తి అనుకుంటారు. కొందరు మాత్రమే తమ లక్ష్యాలను చేరుకోవడంలో సక్సెస్ అయితే మరికొంతమంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇంకొంతమంది మా వల్ల కాదంటూ ఆగిపోతారు. అయితే, లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తులు తమకు అదృష్టం కలిసిరాలేదని బాధపడుతూ కూర్చోవటం కరెక్ట్ కాదు. ఓడిన ప్రతిసారీ గెలవడానికి మరో ఛాన్స్ దొరికిందనే కసితో కొత్త ఏడాదిని ప్రారంభించండి. మధ్యలో ఎన్ని వైఫల్యాలు వెంటాడినా, నిరాశను వీడి.. రానున్న కాలం నాదేనని నమ్మి ముందుకు వెళ్లండి. పడిలేచిన కెరటంలా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తూ పోతే అదృష్టం మీ అడ్రస్ వెతుక్కుంటూ రాకమానుతుందా చెప్పండి.


కొత్తగా ప్రారంభించండి..

ఈ ఏడాది ఎలా గడిచిందనే విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. వచ్చే నూతన సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని, జరగాలని కోరుకోండి. అలా చేయడం ద్వారా మన మనసులోకి నెగిటివ్ ఆలోచనలు రావు. ఏదైనా అనుకున్నది సాధించాలంటే సంకల్ప బలంతో పాటు, ప్రయత్నలోపం లేకుండా చూసుకోవాలి. ఎలాంటి ప్రయత్నం చేయకుండా అనుకున్నది జరగలేదని బాధపడటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని మానసిక వికాస నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి ఏదైనా పనిలో విఫలమైతే ఇక తాను జీవితంలో ఏమి సాధించలేననే అభిప్రాయానికి రాకుండా.. ఫెయిల్యూర్ నుంచి అనుభవాలను నేర్చుకుని, ఈ అనుభవంతో భవిష్యత్తులో తప్పకుండా విజయం సాధిస్తాననే ధీమాతో ముందుకెళ్తే కొత్త సంవత్సరంలో విజయాలు మీ సొంతమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, సాధించగలననే గట్టి విశ్వాసం ఉన్నవారినే సక్సెస్ తలుపు తడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే, నెగటివ్ థింకింగ్ మాని పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకుంటే.. కాలం కలిసివస్తుందనే అభిప్రాయం సదరు వ్యక్తిలో కలిగి సక్సెస్‌ అవుతున్నారట.

Updated Date - Dec 28 , 2024 | 02:35 PM