Share News

Viral: నల్ల మాస్కు వేసుకున్నారని ప్రైవేటు స్కూలు నుంచి డిబార్.. ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం

ABN , Publish Date - May 10 , 2024 | 07:30 PM

చేయని తప్పునకు స్కూల్ నుంచి డీబార్ అయిన ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం చెల్లించాలంటూ అమెరికాలోని ఓ న్యాయస్థానం ఆదేశించింది. వారిని స్కూల్ నుంచి తొలగించే క్రమంలో పాఠశాల యాజమాన్యం నిబంధనల ప్రకారం నడుచుకోలేదని అభిప్రాయపడింది.

Viral: నల్ల మాస్కు వేసుకున్నారని ప్రైవేటు స్కూలు నుంచి డిబార్.. ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం

ఇంటర్నెట్ డెస్క్: చేయని తప్పునకు స్కూల్ నుంచి డీబార్ అయిన ఇద్దరు విద్యార్థులకు రూ.8 కోట్ల పరిహారం చెల్లించాలంటూ అమెరికాలోని (USA) ఓ న్యాయస్థానం ఆదేశించింది. వారిని స్కూల్ నుంచి తొలగించే క్రమంలో పాఠశాల యాజమాన్యం నిబంధనల ప్రకారం నడుచుకోలేదని అభిప్రాయపడింది. విద్యార్థులు చెల్లించిన స్కూల్ ఫీజు కూడా తిరిగిచ్చేయాలని ఆదేశించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, అమెరికాలో ఆఫ్రికన్ సంతతి వారి హక్కుల కోసం బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యయం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న తరుణంలో బాధిత విద్యార్థులు ఈ కేసు దాఖలు చేశారు. అప్పట్లో వారు ముదురు ఆకుపచ్చ మాస్కులు వేసుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. స్కూల్ అధికారులు వాటిని నల్లమాస్కులుగా భావించారు. విద్యార్థులు నల్లవారి పోరాటాన్ని అవహేళన చేస్తున్నారని పొరపాటుపడ్డారు. దీంతో, వారిని స్కూల్ నుంచి తొలగించారు (US Teens Expelled From School Get 1 Million Compensation In Blackface Lawsuit).

Viral: పోలీసులు యువకుడికి అర్ధరాత్రి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చారో చూస్తే..


అయితే, తమ మాస్కు ముదురు ఆకుపచ్చ రంగులో ఉందని విద్యార్థులు వాదించారు. మొటిమలతో బాధపడుతూ క్రీములువాడుతున్న తమ స్నేహితులకు సంఘీభావంగా తాము ఇలాంటి మాస్కులు వేసుకున్నామన్నారు. అంతేకాకుండా, 2017లో వారు తెల్లమాస్కులు వేసుకున్న ఫొటోలు కూడా వెలుగు చూశాయి. ఈ వాదనలన్నీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఇద్దరు విద్యార్థులను నిర్దోషులుగా ప్రకటించింది.

ఇద్దరు విద్యార్థులకు చెరో రూ.4 కోట్లు (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) పరిహారం ఇవ్వాలని స్కూలు యాజమాన్యాన్ని ఆదేశించింది. విద్యార్థుల తరపున వాదించిన లాయర్ మాట్లాడుతూ తమ కేసుకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. కాలిఫోర్నియాలోని ప్రైవేటు స్కూళ్లు ఇకపై విద్యార్థులను ఇష్టారీతిన తొలగించడం కుదరదని చెప్పారు. నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. మరోవైపు, తీర్పుపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ బిడ్డలు ఎటువంటి తప్పు చేయలేదని ఈ తీర్పు రుజువు చేసిందని అన్నారు.

Read Viral and Telugu News

Updated Date - May 10 , 2024 | 07:36 PM