అలాంటి వాడే కావాలి...
ABN , Publish Date - Aug 25 , 2024 | 07:27 AM
ప్రియాంక మోహన్... నానీ ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగులో సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ ఇకపై తెలుగుపై దృష్టి సారించింది. ‘సరిపోదా శనివారం’ అంటూ మరోసారి నానీతో జత కడుతోంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఇలా పంచుకుంది...
ప్రియాంక మోహన్... నానీ ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగులో సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ భామ ఇకపై తెలుగుపై దృష్టి సారించింది. ‘సరిపోదా శనివారం’ అంటూ మరోసారి నానీతో జత కడుతోంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలను ఇలా పంచుకుంది...
ఇంట్లో ఎవరికీ తెలియకుండా...
ఇంజనీరింగ్‌లో ఉండగానే థియేటర్ ఆర్ట్స్ చేసేదాన్ని. ఒక కన్నడ డైరెక్టర్ నా నాటకం చూసి ‘సినిమాలో నటిస్తావా’ అని అడిగారు. ‘అసలు సినిమా అంటే ఏంటో తెలుసుకుందామ’ని వెంటనే ఓకే చెప్పేశా. ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్లి ఆ సినిమా పూర్తిచేశా. అదే నా మొదటి సినిమా ‘ఒందు కథే హెళ్లా’. ఆ తర్వాత రెండు, మూడు ప్రకటనల్లో నటించా. ఆపై నా ఫొటోలను డైరెక్టర్ విక్రమ్ కుమార్‌కి పంపిస్తే, వాటిని చూసి నన్ను హైదరాబాద్‌కు పిలిచారు. ఫొటోషూట్ పూర్తయిన రెండు రోజుల తర్వాత ‘గ్యాంగ్‌లీడర్’లో ఎంపికైనట్లు చెప్పారు. అలా తెలుగులో నా ప్రస్థానం మొదలైంది.
కోపం వస్తే...
ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే... కోపం వస్తే, పది నిమిషాల పాటు గట్టిగా ఏడ్చేస్తా. అప్పుడే మనసు తేలికైనట్లు అనిపిస్తుంది. ఇకపోతే నిద్రాదేవి నన్ను ఇట్టే ఆవహిస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంచం ఎక్కేస్తా. రోజంతా నిద్రపొమ్మన్నా, ఎంచక్కా బజ్జుండిపోతా. సాధారణంగా అమ్మాయిలందరూ చాక్లెట్స్ అంటే పడిచస్తారు. కానీ నాకు మాత్రం చాక్లెట్స్, పాప్‌కార్న్ అస్సలు నచ్చవు. స్వీట్స్ కూడా పెద్దగా తినను. జ్యూస్, కాఫీ ఎక్కువగా తాగుతా.
సలహాలు తీసుకునేదాన్ని...
పవన్‌కళ్యాణ్‌తో ‘ఓజీ’ సినిమా చేస్తున్నా. నిజానికి ఆయన లెజెండ్. గొప్ప లీడర్ కూడా. సూర్యతో ‘ఈటీ’ సినిమా చేశా. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన నాకు, ఆయన పక్కనే హీరోయిన్‌గా నటించే అవకాశం రాగానే ఎగిరిగంతేశా. సూర్య సర్ వర్సటైల్ యాక్టర్. ప్రతీరోజూ షాట్‌లో కొత్త విషయాలు చెప్పేవారు. కష్టపడేతత్వం, అంకితభావం ఆయనది. ఏ సీన్ చేసినా, దానికి ముందు ఆయనతో చర్చించి సలహాలు తీసుకునేదాన్ని. ఆయన నిజజీవితంలో కూడా స్టారే.
నా బెస్ట్‌ఫ్రెండ్...
నాకు స్నేహితులు చాలా తక్కువ. ఉన్నవారిలో సన్నిహితురాలంటే కీర్తి సురేష్. మా ఇద్దరికీ సమయం దొరికితే చాలు... రెస్టారెంట్స్‌కి వెళ్లి బెస్ట్ ఫుడ్ ట్రై చేస్తుంటాం. సినిమాలకు, షికార్లకు వెళ్తుంటాం. పండగ సమయంలోనూ ఒకరింటికి ఒకరం వెళ్తుంటాం. మేమిద్దరం కలిస్తే అల్లరి మామూలుగా ఉండదు. గంటల తరబడి ముచ్చట్లతో గడిపేస్తాం.
కాబోయేవాడు ఎలా ఉండాలంటే..
అందరిలాగే కాలేజీ రోజుల్లో నాకూ ఒక ప్రేమకథ ఉండేది. అతడు మా సీనియరే. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. అయినప్పటికీ మేము స్నేహితులుగానే ఉన్నాం. ఇక నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే.. నిజాయితీగా, నన్ను నన్నుగా అర్థం చేసుకోవాలి. ఎమోషనల్ పర్సనై ఉండాలి. అందరినీ గౌరవించాలి. అలాంటి వ్యక్తి కోసం వెయిటింగ్. అలాగని ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది ఇప్పుడే చెప్పలేను.
అదే నా డ్రీమ్ రోల్...
నా ఆల్‌టైం ఫేవరెట్ హీరో రజనీకాంత్. ఆయన సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతుంది. ఆయనతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవాలన్నదే నా కల. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గలగలా మాట్లాడగలను. అందుకే తొలిసినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ‘బాహుబలి’లో అనుష్క పోషించిన పాత్ర లాంటిది చేయాలనేది నా డ్రీమ్‌రోల్. కథల ఎంపికలో అలియాభట్ నచ్చుతుంది.