Share News

Gujarat Titans: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు

ABN , Publish Date - Oct 29 , 2024 | 11:51 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు మరో కీలక ఆటగాడు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు మంగళవారం తన రిటైర్‌మెంట్ ప్రకటన విడుదల చేశాడు.

Gujarat Titans: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు
Mathew Wade

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు మంగళవారం రిటైర్‌మెంట్ ప్రకటన విడుదల చేశాడు. ‘‘ నా అంతర్జాతీయ క్రికెట్ రోజులు ముగిసిపోయాయని గత టీ20 వరల్డ్ కప్ ముగింపు దశలోనే నాకు పూర్తిగా అర్థమైంది. నాకు కొన్ని గొప్ప అవకాశాలు లభించాయి. అందుకు చాలా సంతోషంగా, కృతజ్ఞతాభావంతో ఉన్నాను. వేసవి నెలల్లో జరగనున్న బిగ్ భాష్ లీగ్ (BBL), ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడటం కొనసాగిస్తాను. ఒక ఆటగాడిగా కొనసాగుతాను. అయితే కోచింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని భావిస్తున్నాను. ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి నా రిటైర్మెంట్, కోచింగ్‌కు సంబంధించిన అంశాలపై గత ఆరు నెలలుగా జార్జ్ బెయిలీ, ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌తో (ఆస్ట్రేలియా సెలక్టర్లు) నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను. కోచింగ్ చేపట్టాలనే ఆలోచన గత కొన్నేళ్లుగా నా మనసులో ఉంది. ’’ అని మాథ్యూ వేడ్ చెప్పాడు. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.


తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగుస్తున్న సందర్భంగా సహచర ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాని వేడ్ అన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడడాన్ని ఒక సవాలుగా ఆస్వాదించానని, తన చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు లేకుంటే ఒంటరిగా ఈ స్థాయికి ఎదగలేకపోయేవాడినని వ్యాఖ్యానించాడు. కాగా వేడ్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో కనిపించనున్నాడు. పాకిస్తాన్‌తో స్వదేశంలో నవంబర్‌లో జరగనున్న టీ20 సిరీస్‌కు ఆసీస్ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


కాగా మాథ్యూ వేడ్ వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. అతడు దాదాపు 13 సంవత్సరాలపాటు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించాడు. ఆస్ట్రేలియా తరపున మొత్తం 225 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. మూడు టీ20 ప్రపంచ కప్‌లలో ఆస్ట్రేలియా తరపున ఆడాడు. 2021లో ఆసీస్ టీ20 వరల్డ్ కప్ గెలవగా అప్పుడు జట్టు వైస్ కెప్టెన్‌గా వేడ్ ఉన్నాడు. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వేడ్ 17 బంతుల్లోనే 41 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.


వేడ్ గణాంకాలు ఇవే..

మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా తరపున 36 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 29.87 సగటుతో 1613 పరుగులు సాధించాడు. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో సాధించిన 117 పరుగులు కెరీర్‌లో అత్యుత్తమ స్కోరుగా ఉంది. వన్డేల విషయానికి వస్తే అతడు మొత్తం 97 మ్యాచ్‌లు ఆడాడు. 83 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 26.29 సగటుతో 1,867 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో 92 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 134.15 స్ట్రైక్ రేట్‌, 26.03 సగటుతో 1,202 పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అతడికి 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 80 పరుగులుగా ఉంది.


ఇవి కూడా చదవండి

కేఎల్ రాహుల్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని షాక్..

24 ఏళ్లలో తొలిసారి.. టీమిండియాకు చెత్త రికార్డు ముప్పు

కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు

Updated Date - Oct 29 , 2024 | 12:00 PM