Suryakumar Yadav: మళ్లీ తెరపైకి సూర్య ‘సూపర్ క్యాచ్’.. కొన్ని సెకన్ల పాటు..
ABN , Publish Date - Jul 23 , 2024 | 07:33 PM
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్‌గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్‌కప్ టైటిల్‌ని..
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (Surykumar Yadav) పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్‌గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్‌కప్ టైటిల్‌ని సొంతం చేసుకుందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. అయితే.. అప్పట్లో ఆ క్యాచ్‌పై పెను దుమారమే చెలరేగింది. బౌండరీ రోప్‌ను కాస్త వెనక్కు జరిపారంటూ సౌతాఫ్రికా ఫ్యాన్స్‌తో పాటు మాజీలు సైతం గగ్గోలు పెట్టారు. మరికొందరేమో సూర్య కాలు బౌండరీ లైన్‌కు తాకిందని ఆరోపణలు గుప్పించారు. చివరికి అదొక పర్ఫెక్ట్ క్యాచ్ అని తేలడంతో.. అందరూ సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు ఈ సూపర్ క్యాచ్ చర్చ మరోసారి తెరమీదకి వచ్చింది. మిల్లర్ క్యాచ్‌ను అందుకున్న తర్వాత సూర్యతో జట్టు సభ్యులు ఏం మాట్లాడారనే ఆసక్తికర విషయాలను ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) బయటపెట్టాడు. ‘‘డేవిడ్ ఆ భారీ షాట్ కొట్టినప్పుడు నేను మిడ్-వికెట్‌లో ఉన్నా. మొదట్లో అది సిక్స్‌గా మారుతుందని నేను భావించాను. కానీ, సూర్య అనూహ్యంగా ఆ బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. అయితే.. అతను బౌండరీ లైన్‌ను టచ్ చేశాడా? లేదా? అనే క్లారిటీ జట్టు సభ్యుల్లో లేదు. దీంతో.. ‘నువ్వు బౌండరీ లైన్‌కు టచ్ అయ్యావా?’ అని అందరూ అడిగారు. అందుకు సూర్య కచ్ఛితమైన సమాధానం ఇవ్వలేదు. మొదట తాన బౌండరీ లైన్‌ను తాకలేదని నమ్మకంగా చెప్పాడు కానీ, కొన్ని సెకన్ల తర్వాత డౌట్‌గా ఉందని చెప్పాడు. ఫైనల్‌గా రీప్లే చూసినప్పుడు.. ఇక మ్యాచ్ మాదేనని ఫిక్సయ్యాం’’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదే సమయంలో.. సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తాను పట్టిన క్యాచ్‌పై కూడా అక్షర్ పటేల్ మాట్లాడాడు. ఆ మ్యాచ్‌లో మిచెల్ మార్ష్ భారీ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న అక్షర్ గాల్లో ఎగిరి మరీ ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. ఆ మ్యాచ్‌లో అది టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అయితే.. తాను పట్టిన ఆ క్యాచ్‌తో పోలిస్తే సూర్య పట్టిన క్యాచ్ అత్యుత్తమమైనదని అతను పేర్కొన్నాడు. అంత ఒత్తిడిలోనూ శరీర బరువుని నియంత్రించుకుంటూ.. అతడు అద్భుతమైన క్యాచ్ పట్టాడని కితాబిచ్చాడు. ఆ క్యాచ్ తమకు వరల్డ్‌కప్ అందించిందని అన్నాడు.
Read Latest Sports News and Telugu News