Share News

CSK vs KKR: చెలరేగిన చెన్నై బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన కోల్‌కతా

ABN , Publish Date - Apr 08 , 2024 | 09:33 PM

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. స్లో పిచ్‌ను ఉపయోగించుకుని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్రేయాస్ అయ్యర్(34) మిగతా వారంతా ఫ్లాప్ షోను కనబరిచారు.

CSK vs KKR: చెలరేగిన చెన్నై బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన కోల్‌కతా

కోల్‌కతా: చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కలిసికట్టుగా చెలరేగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు తేలిపోయారు. స్లో పిచ్‌ను ఉపయోగించుకుని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. శ్రేయాస్ అయ్యర్(34) తప్ప వారంతా ఫ్లాప్ షోను కనబరిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా జట్టు 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. చెన్నైసూపర్ కింగ్స్ ముందు 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(3/18), తుషార్ దేశ్‌పాండే (3/33) చెలరేగారు. వీరిద్దరు వరుసగా కీలక వికెట్లను పడగొట్టి కోల్‌కతాను దెబ్బ కొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఇన్నింగ్స్ మొదటి బంతికే చెన్నైసూపర్ కింగ్స్ యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే దెబ్బకొట్టాడు. ఓపెనర్ పిలిఫ్ సాల్ట్‌ను ఇన్నింగ్స్ మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ చేశాడు. అనంతరం అంగ్క్రిష్ రఘువంశీతో కలిసి మరో ఓపెనర్ సునీల్ నరైన్ రెండో వికెట్‌కు 56 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో పవర్‌ప్లేలో కోల్‌కతా మరో వికెట్ కోల్పోలేదు. పవర్ ప్లే ముగిసే సమయానికి 56/1తో మంచి పొజిషన్‌లో కనిపించింది.


కానీ పవర్ ప్లే అనంతరం స్పిన్నర్ రవీంద్ర జడేజా ఎంట్రీతో సీన్ మారిపోయింది. వరుస ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీసి కేకేఆర్‌ను దెబ్బతీశాడు. ఒకే ఓవర్లో సునీల్ నరైన్(27), రఘువంశీ(24)ను పెవిలియన్ చేర్చడంతోపాటు 9వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్(3)ను కూడా ఔట్ చేశాడు. దీంతో 8 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా 64/4తో కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో రమణ్‌దీప్ సింగ్‌తో కలిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 12వ ఓవర్లో రమణ్‌దీప్ సింగ్(13)ను మరో స్పిన్నర్ మహేష్ తీక్షణ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 85 పరుగులకు కేకేఆర్ సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం రింకూ సింగ్‌తో కలిసి కెప్టెన్ అయ్యర్ కేకేఆర్ స్కోర్‌ను 100 పరుగులు దాటించాడు. మరోసారి చెలరేగిన తుషార్ దేశ్‌పాండే 17వ ఓవర్లో రింకూ(9)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. డెత్ ఓవర్లలో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడనుకున్న రస్సెల్ కూడా 10 పరుగులే చేసి తుషార్ దేశ్ పాండే వేసిన 19వ ఓవర్లో ఔటయ్యాడు. ముస్తఫిజుర్ రహ్మాన్ వేసిన చివరి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయాస్ అయ్యర్ కూడా ఔట్ అయ్యాడు. 32 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్ 3 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ డకౌట్ అయ్యాడు. చివరి ఓవర్లో 2 పరుగులే వచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జడేజా, దేశ్‌పాండే మూడేసి వికెట్లు.. ముస్తాఫిజుర్ రహ్మాన్ 2, మహేష్ తీక్షణ ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!

Updated Date - Apr 08 , 2024 | 09:37 PM