Share News

Dhammika Niroshana: శ్రీలంక మాజీ కెప్టెన్ దారుణ హత్య.. భార్య, పిల్లల ముందే..

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:12 PM

శ్రీలంక క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. గతంలో ఆ జట్టుకి సారథిగా వ్యవహరించిన ఓ మాజీ ఆటగాడు హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ముందే దుండగులు ఆయన్ను దారుణంగా..

Dhammika Niroshana: శ్రీలంక మాజీ కెప్టెన్ దారుణ హత్య.. భార్య, పిల్లల ముందే..
Dhammika Niroshana

శ్రీలంక (Sri Lanka) క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. గతంలో ఆ జట్టుకి సారథిగా వ్యవహరించిన ఓ మాజీ ఆటగాడు హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ముందే దుండగులు ఆయన్ను దారుణంగా కాల్చి చంపేశారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆ క్రికెటర్ పేరు ధామిక నిరోషన (Dhammika Niroshana) (41). 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టుకు నాయకత్వం వహించాడు. గత కొన్నాళ్ల నుంచి ఆయన తన కుటుంబంతో గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.


ఎప్పట్లాగే.. ధామిక కుటుంబ సభ్యులు మంగళవారం రోజు కూడా సంతోషంగా గడిపారు. కానీ.. అదే రోజు రాత్రి తమ ఇంట్లో ఓ దారుణం చోటు చేసుకుంటుందని, తాను హత్యకు గురవుతానని ధామిక గుర్తించలేకపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు కానీ.. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి, ధామికపై కాల్పులు జరిపాడు. అతని కుటుంబం కళ్ల ముందే కాల్పులు జరిపి.. అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ధామిక శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో.. అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ధామిక మరణంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పిల్లలు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


Read Also: మరో కొత్త స్కామ్.. వాట్సాప్‌లో ఈ-చలాన్‌లు పంపించి..

మరోవైపు.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ధామిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్కడ దొరికిన సాక్ష్యాల ఆధారంగా.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. ఆ నిందితుడు ఎవరు? ధామికను ఎందుకు చంపాడు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ధామికను హతమార్చారా? లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. కాగా.. అతడి మృతికి పలువురు శ్రీలంక క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.


వ్యక్తిగత కారణాల వల్ల..

కాగా.. ధామిక నిరోషన కుడిచేతివాటం బౌలర్. అతను 2000 సంవత్సరంలో శ్రీలంక అండర్‌-19 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. రెండేళ్ల పాటు పలు వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌లకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. అతను మెరుగైన ప్రదర్శనతో దూసుకెళ్లడం, కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేయడం చూసి.. శ్రీలంక క్రికెట్‌లో అతను స్టార్‌గా ఎదుగుతాడని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అతను 20 ఏళ్లకే క్రికెట్‌ను వదిలేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే ధామిక క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని తెలుస్తోంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 17 , 2024 | 04:13 PM