Share News

Sanju Samson: సంజూ సక్సెస్ వెనుక సూపర్ పవర్.. చెప్పి మరీ కొట్టించాడు

ABN , Publish Date - Nov 09 , 2024 | 03:11 PM

పిడుగొచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది సౌతాఫ్రికా పరిస్థితి. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ ఓటమికి భారత్ మీద ప్రతీకారం తీర్చుకుందామని బరిలోకి దిగిన ఆ జట్టుకు సంజూ శాంసన్ చుక్కలు చూపించాడు.

Sanju Samson: సంజూ సక్సెస్ వెనుక సూపర్ పవర్.. చెప్పి మరీ కొట్టించాడు

సంజూ శాంసన్.. క్రికెట్ లవర్స్ అంతా ఇప్పుడు ఇదే నామం జపం చేస్తున్నారు. అదేం బాదుడు, ఆ పిచ్చకొట్టుడు ఏంటంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లూ ఈ టాలెంట్‌ను ఎందుకు దాచావని అతడ్ని ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఇలాగే శివతాండవం చెయ్ సామి.. మాకు కావాల్సింది అదేనని అంటున్నారు. టీమిండియా భవిష్యత్ పదిలంగా ఉందని.. సంజూనే ఫ్యూచర్ హీరో అని చెబుతున్నారు. శాంసన్‌ను ఇంతగా పొగడటానికి కారణం అతడి బ్యాక్ టు బ్యాక్ సెంచరీలే. రీసెంట్‌గా బంగ్లాదేశ్ సిరీస్‌లో మెరుపు శతకం బాదిన సంజూ.. శుక్రవారం పటిష్టమైన సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మరో సెంచరీ కొట్టాడు. నిన్న మొన్నటి వరకు టీమ్‌లో చోటు కష్టమనే స్థితి నుంచి ఇప్పుడు ఒక్కసారిగా హీరో అయిపోయాడు. అయితే అతడి వెనుక ఓ సూపర్ పవర్ ఉందని చాలా మందికి తెలియదు.


అండాదండ.. అన్నీ అతడే

టీమిండియాలో చోటు కష్టమనే సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా సంజూ హీరోగా మారడానికి హెడ్ కోచ్ గౌతం గంభీర్ కారణమని చెప్పాలి. శాంసన్ వెనుక ఉన్న అదృశ్య శక్తి గౌతీనే. గత కోచ్‌లు రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌ హయాంలో ఈ స్టైలిష్ బ్యాటర్‌కు అంతగా అవకాశాలు రాలేదు. అడపాదడపా ఆడే ఛాన్సులు వచ్చినా ఎక్కడో ఆఖర్లో బ్యాటింగ్‌కు దింపేవారు. దీంతో అప్పట్లో గంభీర్ సీరియస్ అయ్యాడు. సంజూకు ఛాన్సులు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంత టాలెంట్‌ ప్లేయర్‌ను బెంచ్ మీద కూర్చోబెట్టడం ఏంటని అటు మేనేజ్‌మెంట్‌తో పాటు ఇటు సెలెక్షన్ కమిటీ మీద ఫైర్ అయ్యాడు.


నమ్మకం వమ్ము కాలేదు

సంజూ లాంటోడ్ని టీమ్‌లోకి తీసుకోకపోవడం దారుణమని.. తనకు అవకాశం ఉంటే కచ్చితంగా అతడ్ని ఆడిస్తానని చెప్పాడు. అతడికి ఉన్న సామర్థ్యానికి ఎన్నో అద్భుతాలు చేయగలడని తెలిపాడు. అయితే అప్పట్లో భారత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్న గంభీర్.. ఇటీవల కోచ్‌గా టీమ్‌తో జాయిన్ అయ్యాడు. దీంతో వచ్చీ రాగానే శ్రీలంక సిరీస్‌లోనే సంజూకు ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఫెయిలైనా అతడిపై నమ్మకం ఉంచి బంగ్లా సిరీస్‌లో అవకాశం ఇచ్చాడు. అతడు బాగా ఆడతాడని చెప్పి మరీ ఇప్పుడు కొట్టించాడు.


వాళ్లిద్దరికీ క్రెడిట్

సంజూ లాంటి క్లాస్, మాస్ మిక్స్‌డ్ స్టైల్ ఉన్న బ్యాటర్‌ను ఆడించాల్సింది ఓపెనింగ్‌ పొజిషన్‌లో అని గౌతీ నమ్మాడు. దాన్నే ఆచరణలో పెట్టాడు. ఇది ఫుల్ సక్సెస్ అయింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో సూపర్ సెంచరీ బాదిన ఈ కేరళ సెన్సేషన్.. తాజాగా సౌతాఫ్రికా మీద మరో శతకంతో చెలరేగాడు. ప్రొటీస్‌తో మ్యాచ్‌లో 7 ఫోర్లు బాదిన అతడు.. ఏకంగా 10 సిక్సులు కొట్టాడు. 214 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ప్రొటీస్ బౌలర్లకు నరకం చూపించాడు. కోచ్ గంభీర్ అతడిపై ఉంచిన నమ్మకం, బ్యాటింగ్ ఆర్డర్ మార్పుతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ప్రోత్సాహం వమ్ముకాలేదు. అందుకే సంజూ సక్సెస్‌లో సూపర్ పవర్‌గా ఉన్న గౌతీతో పాటు సారథి సూర్యకు కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే.


Also Read:

సంజూ నువ్వు చాలా స్పెషల్.. రికార్డు సెంచరీలపై మాజీల హర్షం

కాన్పూర్‌.. చెత్త చెన్నై.. సూపర్‌

రాహుల్‌.. అదే తీరు

For More Sports And Telugu News

Updated Date - Nov 09 , 2024 | 03:23 PM