Hardik Pandya: అఫీషియల్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా
ABN , Publish Date - Jul 18 , 2024 | 09:50 PM
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుని..
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు (Natasa Stankovic) విడాకులు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఒక పోస్టుని షేర్ చేశాడు. తామిద్దరం విడిపోవాలని డిసైడ్ అయ్యామని, ఇది ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. ఇది కఠినమైన నిర్ణయం అయినప్పటికీ.. పరస్పర గౌరవంతో ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.
‘‘నాలుగేళ్లు కలిసి ఉన్న నేను, నటాషా.. పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము అన్ని విధాలా ప్రయత్నించాం. ఇది కఠినమైన నిర్ణయమే అయినా.. పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక కుటుంబంగా ఎదిగిన మేము ఈ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాం. మా అబ్బాయి అగస్త్యకు మంచి కో-పేరెంట్స్‌గా ఉంటాం. అతనిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ.. మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నా’’ అంటూ ఇన్‌స్టా పోస్టుని హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు.
కాగా.. తన సోషల్ మీడియా ఖాతాలోని పేర్ల నుంచి పాండ్యా ఇంటి పేరుతో పాటు తమ ఫోటోలను తొలగించినప్పటి నుంచి విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందుకు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఇక తన కుమారుడ్ని తీసుకొని నటాషా సెర్బియాకు వెళ్లిపోవడంతో.. విడాకుల ఊహాగానాలు దాదాపు నిజమేనని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు తాము నిజంగానే విడిపోతున్నామంటూ హార్దిక్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే.. వీళ్లు విడిపోవడానికి గల కారణాలేంటో తెలియరాలేదు.
బీసీసీఐ షాక్
మరోవైపు.. వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో సతమతమవుతున్న హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. అతనిని వైస్-కెప్టెన్ హోదా నుంచి తొలగించింది. నిజానికి.. టీ20లకు హార్దిక్ పాండ్యా వీడ్కోలు పలకడంతో, అతని స్థానంలో పాండ్యాకు నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో వైస్-కెప్టెన్‌గా వ్యవహరించాడు కాబట్టి.. అతడే నెక్ట్స్ సారథి అని అంతా భావించారు. కానీ.. బీసీసీఐ అందరికీ షాకిస్తూ సూర్యకుమార్‌కి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చింది. శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
Read Latest Sports News and Telugu News