Jasprit Bumrah: మళ్లీ ఆసీస్ పొగరు అణిచిన బుమ్రా.. పుండు మీద కారం చల్లాడు
ABN , Publish Date - Nov 27 , 2024 | 04:00 PM
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి టాప్ లేపాడు. తమ కంటే తోపులు ఎవరూ లేరంటూ బిల్డప్ ఇచ్చే ఆస్ట్రేలియాకు ఇంకోసారి ఇచ్చిపడేశాడీ స్పీడ్‌స్టర్.
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను చూసి ఓర్వలేకపోతోంది ఆస్ట్రేలియా. పెర్త్ టెస్ట్‌లో 8 వికెట్లు తీసి తమ నడ్డి విరిచిన భారత స్పీడ్‌స్టర్‌ను చూసి కంగారూలు తట్టుకోలేకపోతున్నారు. తమ పిచ్‌లపై తమ కంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం, సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పడంతో బుమ్రా అంటే ప్రత్యర్థులు వణికిపోతున్నారు. అందుకే ఆసీస్ మీడియా అతడిపై విషం కక్కుతోంది. అతడి బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదంటూ చెత్త ప్రచారం చేస్తోంది. అయితే వాళ్లకు బుమ్రా గట్టిగా ఇచ్చిపడేశాడు. మళ్లీ టాప్‌లోకి వచ్చిన ఏస్ పేసర్.. ఆసీస్‌ను మరోమారు నోరెత్తకుండా చేశాడు.
అతడికే అగ్రపీఠం
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అదరగొట్టాడు. పెర్త్ టెస్ట్‌కు ముందు వరకు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న పేసుగుర్రం.. ఆసీస్‌పై సూపర్బ్ పెర్ఫార్మెన్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్నాడు బుమ్రా. అతడి తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్ కగిసో రబాడ (872 పాయింట్లు), జోష్ హేజల్‌వుడ్ (860) నిలిచారు. బుమ్రా 883 పాయింట్లతో తిరిగి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకుముందు రబాడ టాప్‌లో, కంగారూ పేసర్ హేజల్‌వుడ్ రెండో స్థానంలో ఉండేవారు.
పుండు మీద కారం..
తాజాగా హేజల్‌వుడ్‌ను దాటేసి టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు బుమ్రా. దీంతో అతడు మరోమారు ఆసీస్ పొగరు అణిచాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అతడి కెప్టెన్సీ, నిప్పులు చెరిగే బౌలింగ్ చూసి ఓర్వలేకపోతున్న ఆస్ట్రేలియకు ఇది పుండు మీద కారం చల్లినట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు ఎంత ఓవరాక్షన్ చేసినా బుమ్రాను ఏమీ చేయలేరని.. అతడో ఛాంపియన్ బౌలర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక, ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (825) రెండు ర్యాంకులు మెరుగుపర్చుకొని సెకండ్ పొజిషన్‌లో నిలిచాడు. పంత్ (736) ఆరో స్థానంలో ఉన్నాడు. జో రూట్ (903) టాప్‌లో కంటిన్యూ అవుతున్నాడు.