IND vs ENG: భారీ ఆధిక్యం దిశగా టీమిండియా.. టీ బ్రేక్ సమయానికి స్కోర్ ఎంతంటే..
ABN , Publish Date - Feb 17 , 2024 | 02:29 PM
మూడో టెస్టులో మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 44/1 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్(19), శుభ్‌మన్ గిల్(5) ఉన్నారు. 19 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను జోరూట్ లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు.

రాజ్‌కోట్: మూడో టెస్టు మూడో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 44/1 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్(19), శుభ్‌మన్ గిల్(5) ఉన్నారు. 19 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను జోరూట్ లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం భారత జట్టు 170 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు 207/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 112 పరుగులు మాత్రమే జోడించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగుల భారీ స్కోర్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 126 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
నేడు ఉదయం ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు బుమ్రా, కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టారు. రూట్(18)ను బుమ్రా, బెయిర్‌స్టోతోపాటు కీలకమైన డకెట్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా బెయిర్‌స్టోను డకౌట్ చేసిన కుల్దీప్.. కాసేపటికే భారీ సెంచరీతో చెలరేగుతున్న బెన్ డకెట్ (153)ను కూడా ఔట్ చేశాడు. శుక్రవారం నాటి తన స్కోర్‌కు డకెట్ మరో 18 పరుగులు మాత్రమే జోడించాడు. అయితే వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన డకెట్ 23 ఫోర్లు, 2 సిక్సులతో 151 బంతుల్లోనే 153 పరుగులు చేశాడు. దీంతో 260 పరుగులకు ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టోక్స్, ఫోక్స్ వికెట్లకు కాసేపు అడ్డుగా నిలిచారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 65వ ఓవర్లో రవీంద్ర జడేజా విడదీశాడు. 41 పరుగులు చేసిన స్టోక్స్‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్ చెలరేగాడు. ఆ వెంటనే ఫోక్స్(13)ను ఔట్ చేశాడు. దీంతో 299 పరుగుల వద్దే ఇంగ్లండ్ 6, 7 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఇంగ్లండ్ ఆలౌట్ అవడానికి ఎంతో సమయం పట్టలేదు. రెహాన్ అహ్మద్(6), జేమ్స్ అండర్సన్(1)ను సిరాజ్.. టామ్ హార్ట్‌లీ(9)ను జడేజా ఔట్ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు.. బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు.
ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.