Share News

IND vs ENG: యశస్వీ జైస్వాల్ మరో డబుల్ సెంచరీ.. ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం

ABN , Publish Date - Feb 18 , 2024 | 01:20 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపిస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ డబుల్ సెంచరీలతో దుమ్ములేపుతున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. తాజాగా రాజ్‌కోట్ వేదికగ జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ డబుల్ సెంచరీ కొట్టాడు.

IND vs ENG: యశస్వీ జైస్వాల్ మరో డబుల్ సెంచరీ.. ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం

రాజ్‌కోట్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపిస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ డబుల్ సెంచరీలతో దుమ్ములేపుతున్నాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. తాజాగా రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ డబుల్ సెంచరీ కొట్టాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన జైస్వాల్ 14 ఫోర్లు, 10 సిక్సులతో 231 బంతుల్లోనే డబుల్ సెంచరీ కొట్టేశాడు. టెస్ట్ కెరీర్‌లో ఆడిన 7 టెస్టుల్లోనే జైస్వాల్ రెండు సార్లు డబుల్ సెంచరీ మార్కు అందుకోవడం విశేషం. అలాగే టెస్ట్ క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 14 ఫోర్లు, 12 సిక్సులతో 236 బంతుల్లోనే అజేయంగా 214 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి సర్ఫరాజ్ ఖాన్(68*) కూడా సహకరించాడు. శుభ్‌మన్ గిల్(91) తృటిలో సెంచరీ చేజార్జుకున్నాడు. ఈ ముగ్గురు కుర్రాళ్లు అదరగొట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 430/4 పరుగుల భారీ స్కోర్ వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా 557 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.


రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోర్ 196/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు మరో 50 పరుగులు జోడించారు. అయితే సెంచరీ కొడతాడనుకున్న శుభ్‌మన్ 91 పరుగుల వద్ద అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అనంతరం మూడో రోజు ఆటలో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లిన యశస్వీ జైస్వాల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఆ కాసేపటికే 27 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్‌ను రెహాన్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 258 పరుగులకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం జత కట్టిన యువ బ్యాటర్లు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వన్డే తరహాలో ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశారు. లంచ్ బ్రేక్ సమయానికి జట్టు స్కోర్‌ను 300 దాటించారు. దీంతో మొదటి సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. భారత జట్టు ఆధిక్యం కూడా 400 దాటింది. మొదటి సెషన్‌లో 118 పరుగులు రాగా 2 వికెట్లు పడ్డాయి.

లంచ్ బ్రేక్ అనంతరం మొదలైన రెండో సెషన్‌లో జైస్వాల్, సర్ఫరాజ్ ఇద్దరూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. టెస్ట్ మ్యాచ్‌లో టీ20 స్టైలు బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించారు. రెండో సెషన్‌ ఆరంభంలోనే 150 పరుగులు పూర్తి చేసుకున్న జైస్వాల్.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ అండర్సన్ వేసిన 85వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులొచ్చాయి. తర్వాత కూడా దూకుడు కొనసాగించిన జైస్వాల్ చూస్తుండగా డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. జైస్వాల్‌కు మంచి సహకారం అందించిన సర్ఫరాజ్ ఖాన్ 66 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో అరంగేట్ర టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. జోరూట్ వేసిన 97వ ఓవర్‌లో సింగిల్ తీసి జైస్వాల్ డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డబుల్ సెంచరీ అనంతరం అదే ఓవర్‌లో జైస్వాల్ రెండు సిక్సులు బాదడంతో 15 పరుగులొచ్చాయి. జట్టు స్కోర్ 400 దాటగా.. ఆధిక్యం కూడా ఏకంగా 500 పరుగులు దాటింది. జైస్వాల్, సర్ఫరాజ్‌ను ఎలా ఆపాలో తెలియక ఇంగ్లండ్ బౌలర్లు దిక్కులు చూడక తప్పలేదు. రెహాన్ అహ్మద్ వేసిన 98వ ఓవర్‌లో సిక్సు, ఫోర్, సిక్సు బాదిన సర్ఫరాజ్ ఖాన్ 18 పరుగులు రాబట్టాడు. ఈ సమయంలోనే జట్టు స్కోర్ 430/4 వద్ద ఉన్న సమయంలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ డిక్లేర్ చేశారు. దీంతో ఇంగ్లండ్‌పై భారత జట్టు 556 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లీష్ జట్టు ముందు 557 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. 14 ఫోర్లు, 12 సిక్సులతో 236 బంతుల్లోనే 214 పరుగులు చేసిన జైస్వాల్, 6 ఫోర్లు, 3 సిక్సులతో 72 బంతుల్లోనే 68 పరుగులు చేసిన సర్ఫరాజ్ నాటౌట్‌గా నిలిచారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 158 బంతుల్లోనే అజేయంగా 172 పరుగులు జోడించారు. వీరి దూకుడుతో రెండో సెషన్‌లో 16 ఓవర్లలోనే 116 పరుగులొచ్చాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2024 | 01:52 PM