Share News

IND vs ENG: టీమిండియా ఓటమికి అదే ప్రధాన కారణం.. ఆ క్యాచ్ పట్టి ఉంటే..

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:06 PM

ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.

IND vs ENG: టీమిండియా ఓటమికి అదే ప్రధాన కారణం.. ఆ క్యాచ్ పట్టి ఉంటే..

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగిన ఒల్లీ పోప్ ఇంగ్లండ్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పోప్ 196 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగినప్పటికీ, అంతకుముందే అతనిచ్చిన రెండు విలువైన క్యాచ్‌లను మన ఫీల్డర్లు వదిలేశారు. దీంతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న పోప్ టీమిండియాను ఓడించాడు. నిజానికి పోప్ సెంచరీ సాధించిన కాసేపటికే ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా జడేజా బౌలింగ్‌లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్ పటేల్ నేలపాలు చేశాడు. జడేజా వేసిన లెంగ్త్ బాల్‌ను పోప్ రివర్స్ స్వీప్ ఆడాడు. కానీ అది సరిగ్గా టైమ్ కాకపోవడంతో గాల్లోకి లేచింది. గల్లీ మధ్యలో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఆ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు.


దీంతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న పోప్ మరో 86 పరుగులు జోడించాడు. ఆ తర్వాతి బంతికే ఫోర్ కొట్టి పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది 28 పరుగుల తేడాతోనే కావడం గమనార్హం. దీంతో ఆ క్యాచ్ పట్టి ఉంటే కచ్చితంగా విజయం భారత్‌నే వరించేది. మొత్తంగా అక్షర్ పటేల్ క్యాచ్ వదిలేయడంతో మ్యాచ్ భారత్ చేతుల్లో నుంచి జారిపోయింది. అలాగే 186 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పోప్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కేఎల్ రాహుల్ వదిలేశాడు. దీంతో పోప్ ఒకానొక దశలో డబుల్ సెంచరీ కొట్టే వాడిలాగే కనిపించాడు. కానీ 103వ ఓవర్లో బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో 196 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో వైజాగ్ టెస్టులోనైనా భారత ఫీల్డర్లు మిస్టేక్స్ చేయకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246, భారత్ 436.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 420, భారత్ 202 పరుగులు చేశాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 02:06 PM