IND vs PAK: పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం.. అతని కష్టం వృథా!
ABN , Publish Date - Jul 07 , 2024 | 02:03 PM
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ జట్టుకి ఘోర పరాభావం ఎదురైంది. పాకిస్తాన్ ఛాంపియన్స్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా...
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 (WCL 2024) టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ (India Champions) జట్టుకి ఘోర పరాభావం ఎదురైంది. పాకిస్తాన్ ఛాంపియన్స్ (Pakistan Champions) చేతిలో దారుణ ఓటమిని చవిచూసింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. పాకిస్తాన్ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, దాన్ని ఛేధించలేక భారత్ చతికిలపడింది. 175 పరుగులకే పరిమితం కావడంతో.. 68 పరుగుల తేడాతో పాక్ జట్టు ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు పరుగుల సునామీ సృష్టించింది. కమ్రాన్ ఆక్మల్ (77), షర్జీల్ ఖాన్ (72), సోహైబ్ మసూద్ (51) అద్భుత అర్థశతకాలతో మెరిశారు. షోయబ్ మాలిక్ (25) సైతం తనదైన సహకారం అందించాడు. ఫలితంగా.. పాకిస్తాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తడబడింది. సురేశ్ రైనా (52) ఒక్కడే అర్థశతకం చేయగా.. అంబటి రాయుడు (39), రాబిన్ ఊతప్ప (22) కాస్త ఫర్వాలేదనిపించారు. అంతే.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితం అయ్యింది.
బౌలర్ల విషయానికొస్తే.. భారత బౌలర్లలో ఆర్పీ సింగ్, అనురీత్ సింగ్, ధవాల్ కులకర్ణి, పవన్ నేగి తలా వికెట్ తీశారు. పాకిస్తాన్ బౌలర్లలో.. షోయబ్ మాలిక్ , వహాబ్ రియాబ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సోహైల్ ఖాన్, తన్వీర్ చెరో వికెట్ తీశారు. షర్జీల్ కాన్ 30 బంతుల్లోనే 72 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పాక్ 6 పాయింట్లతో అగ్రస్థానంలోనూ, భారత్ 4 పాయింట్లతో మూడో స్థానంలోనూ ఉన్నాయి.
Read Latest Sports News and Telugu News