India vs Afghanistan: ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. టీ20 సిరీస్ కైవసం
ABN , Publish Date - Jan 14 , 2024 | 10:10 PM
ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేధించింది. యువ ఆటగాళ్లైనా..
India vs Afghanistan: ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేధించింది. యువ ఆటగాళ్లైనా యశస్వీ జైస్వాల్ (68), శివమ్ దూబె (63) ఊచకోత కోసి.. భారత్‌కు ఈ విజయాన్ని అందించారు. మధ్యలో మన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (29) కూడా మెరుపులు మెరిపించాడు. దీంతో.. మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ని 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో గుల్బదిన్ నాయబ్ (57) అర్థశతకంతో రాణించడంతో పాటు కరీమ్ (20), ముజీబ్ (21) మెరుపులు మెరిపించడంతో.. ఆఫ్ఘన్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 173 పరుగులతో బరిలోకి దిగిన భారత్.. 15.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి గెలుపొందింది. తొలుత భారత్‌కి రోహిత్ శర్మ వికెట్ రూపంలో పెద్ద ఝలకే తగిలింది. అతడు డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే.. రోహిత్ ఔటయ్యాక విరాట్ కోహ్లీ, యశస్వీ కలిసి కాసేపు ఆఫ్ఘన్ బౌలర్లతో ఓ ఆటాడుకున్నారు. ఇద్దరూ ఎడాపెడా షాట్లతో చెలరేగిపోయారు. అయితే.. మంచి జోష్‌లో కనిపించిన కోహ్లీ.. 29 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు.
కోహ్లీ తర్వాత రంగంలోకి దిగిన శివమ్ దూబె.. వచ్చి రావడంతోనే వీరబాదుడు మొదలుపెట్టేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడి, మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. అటు.. తాను ఏం తక్కువ తినలేదన్నట్టు యశస్వీ కూడా విధ్వంసం సృష్టించాడు. ఇలా వీళ్లిద్దరు ఆకాశమే హద్దుగా దుమ్మురేపి.. మూడో వికెట్‌కి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్లిద్దరే మ్యాచ్‌ని ముగించేస్తారనుకుంటే.. భారత్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వీ ఔట్ అవ్వగా, ఆ వెంటనే జితేశ్ పెవిలియన్ బాట పట్టాడు. చివర్లో రింకూతో కలిసి.. శివమ్ ఈ మ్యాచ్‌ని ముగించాడు.