Share News

IND vs ENG: ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా.. గత 110 ఏళ్లలో..

ABN , Publish Date - Feb 04 , 2024 | 09:50 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దుమ్ములేపాడు. స్పిన్ పిచ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. అద్భుత బంతులతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు.

IND vs ENG: ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా.. గత 110 ఏళ్లలో..

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా దుమ్ములేపాడు. స్పిన్ పిచ్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. అద్భుత బంతులతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. బుమ్రాను ఎదుర్కొలేక ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు ఒలీ పోప్, జో రూట్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. బుమ్రా దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 253 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 143 పరుగుల భారీ అధిక్యం లభించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తీసిన 6 వికెట్ల ద్వారా జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరీర్‌లో 150 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు 34 టెస్టులు ఆడిన బుమ్రా 64 ఇన్నింగ్స్‌ల్లో 20.29 సగటుతో 152 వికెట్లు తీశాడు. దీంతో ఈ పేస్ గన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.


గత 110 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మెరుగైన సగటుతో 150 వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా ప్రపంచరికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ అలాన్ డేవిడ్సన్ 60 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. 1953-1963 మధ్య కాలంలో అలాన్ డేవిడ్సన్ 20.53 సగటుతో 150 వికెట్లు తీశాడు. తాజాగా 20.28 సగటుతో డేవిడ్సన్ రికార్డును బుమ్రా అధిగమించాడు. అత్యుత్తమ సగటు విషయంలో మొత్తంగా టెస్టు క్రికెట్ పరంగా చూస్తే బుమ్రా రెండో స్థానంలో ఉన్నాడు. 16.43 సగటుతో 150 వికెట్లు తీసిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ సిడ్నీ బర్న్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా 1901 నుంచి 1914 మధ్య సిడ్నీ బర్న్స్ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో బుమ్రా మరిన్ని రికార్డులను నెలకొల్పాడు. భారత్ నుంచి టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఈ శతాబ్దంలో మన దేశంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా పేస్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 04 , 2024 | 10:25 AM